YSRCP News: జగన్ కీలక నిర్ణయం, 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిల మార్పు
YSRCP Latest News: మంత్రి బొత్స సత్యనారాయణ ఈ వివరాలను వెల్లడించారు. ఆయా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ సీపీ వ్యవహారాలను ఈ కొత్త ఇన్‌ఛార్జిలు పర్యవేక్షిస్తారని వెల్లడించారు.
Andhrapradesh News: ఏపీలోని 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిలను మారుస్తూ వైఎస్ఆర్ సీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నియమకాలను తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మంత్రి బొత్స సత్యనారాయణ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో ప్రకటించారు. పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు 11 నియోజకవర్గాల ఇంచార్జుల స్థానంలో కొత్త వారిని నియమించడం జరిగిందని వెల్లడించారు.
వీటిలో ప్రత్తిపాడు - బాలసాని కిషోర్ కుమార్, కొండేపి - ఆదిమూలపు సురేశ్, వేమూరు - వరికూటి అశోక్ బాబు, తాడికొండ - సుచరిత, సంతనూతలపాడు - మేరుగ నాగార్జున, చిలకలూరిపేట - మల్లెల రాజేష్, గుంటూరు పశ్చిమ- విడదల రజినీని నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలుగా నియమించింది. ఆయా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ సీపీ వ్యవహారాలను ఈ కొత్త ఇన్‌ఛార్జిలు పర్యవేక్షిస్తారని వెల్లడించారు.
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వివరాలు:
ప్రత్తిపాడు - బాలసాని కిరణ్ కుమార్
కొండెపి - ఆదిమూలపు సురేష్
వేమూరు - వరికూటి అశోక్ బాబు
తాడికొండ - మేకతోటి సుచరిత
సంతనూతలపాడు - మేరుగు నాగార్జున
చిలకలూరిపేట - మల్లెల రాజేశ్ నాయుడు
గుంటూరు పశ్చిమ - విడదల రజనీ
అద్దంకి - పాణెం హనిమిరెడ్డి
మంగళగిరి - గంజి చిరంజీవి
రేపల్లె - ఈవూరు గణేష్
గాజువాక - వరికూటి రామచంద్రరావు
మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. రేపటి నుంచి పార్టీ వ్యవహరాలన్నీ వీరు పర్యవేక్షిస్తారని తెలియచేశారు. ఏ ఒక్కరినీ పార్టీ వదులుకోదని.. అందరి సేవలు వినియోగించుకుంటుందని అన్నారు. ‘‘175 కి 175 స్థానాల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించాలని మార్పులు చేర్పులు చేస్తూ వైయస్ జగన్ నిర్ణయించారు. చేనేత కార్మికులు, బడుగు బలహీనవర్గాలు జగన్ గారు వారందరికీ ఒక ధైర్యాన్నిచ్చారు. మాటలు చెప్పడం కాదు...చేతల్లో చేసి చూపించారు. అందులో భాగంగానే మంగళగిరి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గంజి చిరంజీవిని తీసుకొచ్చి జాయిన్ చేశారు. మంగళగిరి అభ్యర్దిగా చిరంజీవిని నిర్ణయించారు. ఆర్కేకి ఏ రకంగా సముచిత స్థానం ఇవ్వాలో అలానే చేయడం జరుగుతుంది.
ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ప్రత్యేక మైన స్థానం ఇవ్వాలని లక్ష్యంతోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాం. ఇది మొదటి దశగా జరుగుతుంది. 175 సీట్లనూ పరిశీలించుకుంటూ ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. పార్టీ అంటే ఎమ్మెల్యేతో పాటు క్యాడర్ కూడా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. వైయస్ జగన్ పార్టీని స్థాపించినప్పటి నుంచీ ఈ 12 ఏళ్లలో పార్టీని ప్రజలకు జవాబుదారీగా ఉంచారు. జగన్ దృష్టిలో శాసన సభ్యునికి ఎంత విలువ ఉంటుందో కార్యకర్తకూ అంతే విలువ ఉంటుందని అన్నారు. ప్రజలకు మంచి సేవ చేయాలంటూ ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. దానిలో భాగంగా ఈ 11 నియోజకవర్గాలలో మార్పులు చేర్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారన్నారు. వీటికి సంబంధించి భవిష్యత్తులోనూ మార్పులు ఉండవచ్చన్నారు. శాస్త్రీయంగా సర్వేల ప్రకారం ప్రజల్లో మమేకం అయ్యే రీతిలో మెరుగైన ఫలితాల కోసం మార్పులు చేశారు. దీన్ని వేరే రకంగా చూడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
సహజంగానే స్థానికంగా మా నాయకుడికి ఇబ్బంది వచ్చిందని కొందరు నేతలు రియాక్ట్ కావచ్చు. ఈ ప్రభుత్వం మంచి మెజార్టీతో మళ్లీ అధికారంలోకి రావాలి.. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయాలు తీసుకున్నారు. జగన్ అధ్యక్షుడిగా శాస్త్రీయంగా లోతుగా ఆలోచనతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒక సెన్సేషనల్ కోసం ఆయన ఏదీ చేయడం లేదు. ఆయన ఏది చేసినా ఓపెన్ గా చెప్పారు. ప్రజలకు మళ్లీ మనం సేవ చేసే పరిస్థితి రావాలని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు పొత్తులకు ఒక దారీ తెన్నూ లేకుండా వారున్నారు. ఇందులో మీడియాకు కూడా పెద్దగా సందేహాలు అక్కర్లేదు. భవిష్యత్తులో కూడా కొన్ని మార్పులు ఉండచ్చు.. ఉండకపోవచ్చని స్పష్టం చేశారు.