Breaking News Telugu Live Updates: జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద ఉద్రిక్తత, బాలికకు న్యాయం చేయాలని బీజేపీ నేతలు ఆందోళన
Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

Background
ఈ ఏడాది నాలుగైదు రోజుల ముందే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. ప్రస్తుతం నైరుతు రుతువనాలు చురుకుగా కదులుతున్నాయి. పశ్చిమ బెంగాల్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతం వరకు సముద్రమట్టంపై 0.9 కిలోమీటర్ల వరకు ఉపరితల ఆవర్తనం నెలకొని ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఈశాన్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతంలోని కొన్ని చోట్ల, మిజోరం, మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాల వైపు నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఉత్తర, సెంట్రల్ బెంగల్, ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయాలు, పశ్చిమ బెంగాల్, సిక్కింలను మరో రెండు రోజుల్లో తాకనున్నాయి. వ్యవసాయరంగానికి కీలకమైన నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయని ఐఎండీ ఇటీవల ప్రకటించింది. దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. మరోవైపు కొన్నిచోట్ల 2 నుంచి 4 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని సూచించారు.
ప్రముఖ రచయిత, గోదారోళ్ల కితకితల పేరుతో ఫేస్‌బుక్ గ్రూప్ సృష్టించి చాలా మందికి స్ఫూర్తిగా మారిన ఈదర వీర వెంకట సత్యనారాయణ గుండెపోటుతో మృతి చెందారు. గురవారం రాత్రి 11.30 గంటలకు గుండెపోటు వచ్చింది. హుటాహుటిన 108 కాల్ చేసి ఆసుపత్రికి తరలించేందు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అంబులెన్స్ వచ్చేసరికే ఆయన తుది శ్వాస విడిచినట్టు బంధువులు చెప్పారు.
పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు నేడు మళ్లీ పెరిగాయి. వెండి సైతం బంగారం బాటలోనే పయనించి భారీగా పుంజుకుంది. రూ.110 మేర పెరగడంతో తాజాగా హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,930కి చేరింది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,600 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. మరోవైపు వెండి ధర నిన్నటి ధర వద్ద నిలకడగా ఉంది. హైదరాబాద్‌లో 1 కేజీ వెండి ధర రూ.67,600 అయింది.
ఏపీ మార్కెట్లోనూ బంగారం ధరలు పెరగడంతో విజయవాడలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,930 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,600 కు ఎగబాకింది. విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.67,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. విశాఖపట్నం, తిరుపతిలో రూ.100 మేర పెరగడంతో నేడు 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,930 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,600 అయింది. ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్లో నేడు 1 కేజీ వెండి ధర రూ.67,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
హైదరాబాద్‌లో ఇంధన ధరలు వరుసగా మూడోరోజు నిలకడగా ఉన్నాయి. నేడు హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.109.66 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.82 వద్ద స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. నేడు ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62 వద్ద స్థిరంగా ఉన్నాయి. ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర 19 పైసలు తగ్గింది. పెట్రోల్ లీటర్ ధర రూ.109.16 కాగా, 17 పైసలు తగ్గడంతో డీజిల్ లీటర్ ధర రూ.97.35 అయింది. వరంగల్ రూరల్ జిల్లాలో 18 పైసలు తగ్గడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.109.21 కాగా, 16 పైసలు తగ్గడంతో డీజిల్ లీటర్ ధర రూ.97.40 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి
జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసులో ఎమ్మెల్యే, వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కుమారులు అరెస్టు
జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసులో అరెస్టుల పర్వం మొదలైంది. ఎమ్మెల్యే కుమారుడితో పాటు వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ శివారులో వారిని అరెస్టు చేసినట్లు సమాచారం.
జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద ఉద్రిక్తత, బాలికకు న్యాయం చేయాలని బీజేపీ నేతలు ఆందోళన
హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అత్యాచారానికి గురైన బాలికకు న్యాయం చెయ్యాలని బీజేపీ ఆందోళన చేపట్టింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ బీజేపీ నేతలు ముట్టడించారు. నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.





















