Virginia University Research: కడలి ముప్పు ముంగిట అమెరికా- వర్జీనియా యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడి
అగ్రరాజ్యంఅమెరికా పరిస్థితి మేడిపండు చందంగా ఉందా? ఇక్కడి నగరాల పరిస్థితి ప్రమాదంలోనే ఉందని, నగరాలు నీటమునగనున్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. వర్జీనియా యూనివర్సిటీ అధ్యయనం చేసింది.
US Coastal Cities In Danger : అగ్రరాజ్యం అమెరికా(America)లో పరిస్థితి ఎలా ఉందంటే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చెప్పడం కష్టమే. ఒకవైపు ఎప్పుడు పేలుతాయో.. ఎక్కడ పేలుతాయో తెలియని తుపాకీ వ్యవస్థ.. దేశాన్ని పట్టిపీడిస్తోంది. దీంతో అంతర్జాతీయ వచ్చే పర్యాటకులు , విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు ఈ సమస్యలకు తోడు అమెరికాలో ప్రకృతి సమస్యలు కూడా దేశానికి ప్రధాన సవాలుగా పరిణమించాయి. గత కొన్నాళ్లుగా అమెరికాలో కార్చిచ్చులు రేగి.. చాలా మేరకు నష్టం చేకూరింది. ఇక, ఇప్పుడు సముద్ర మట్టాలు ఊహించని రీతిలో పెరుగుతున్నాయని వర్జీనియా యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. ఇలా సముద్రమట్టాల పెరుగుదలతో అమెరికాలోని 24 తీరప్రాంత నగరాలు.. ముంపు అంచుకు చేరాయన్నది తాజాగా కలవర పెడుతున్న ప్రధాన విషయం.
వర్జీనియా యూనివర్సిటీ-భారత్‌తో కలిసి
అమెరికాలో సముద్ర తీర ప్రాంతాల పరిస్థితిని వర్జీనియా యూనివర్సిటీ(Virginia University Research) పరిశోధక బృందం అధ్యయనం చేసింది. దీనిలో భారత్‌కు చెందిన విద్యార్థులు కూడా పాల్గొన్నారు. పంజాబ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూ ట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ బృందం పాల్గొని పలు అంశాలను అధ్యయనం చేసింది. ఈ పరిశోధన విషయాలకు సంబంధించిన సమగ్ర వివరాలు ‘నేచర్’ జర్నల్ లో ప్రచురించారు. గ్లోబల్ వార్మింగ్ దెబ్బకి వాతావరణంలో అనూహ్య ప్రతికూల మార్పులు సంభవిస్తున్నాయని అధ్యయన కర్తలు అభిప్రాయపడ్డారు. పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా తరచూ హీట్‌వేవ్‌లు, కరువులు సంభవించి, కార్చిచ్చులు చెలరేగి సగటు ఉష్ణోగ్రతలను అంతకంతకూ పెరుగుతున్నాయని తెలిపారు. దీంతో ధృవాల వద్ద హిమానీ నదాలు గతంలో కంటే వేగంగా కరిగిపోతున్నాయని, ఫలితంగా అమెరికా, భారత్ సహా పలు ప్రపంచదేశాల తీరప్రాంతాలకు ముంపు ప్రమాదం ఉందని అధ్యయనం వెల్లడించింది.
ఏటా 2 మిల్లీ మీటర్లు..
అమెరికా(America)లోని 32 సముద్ర తీర ప్రాంత నగరాలకుగాను 24 నగరాల వెంట సముద్రమట్టం ప్రతి సంవత్సరం 2 మిల్లీమీటర్ల మేర పెరుగుతోంది. వీటిలోని 12 నగరాల్లో అయితే అంతర్జాతీయ సముద్ర మట్టాల సగటు పెరుగుదల రేటును దాటి మరీ జలాలు పైపైకి వస్తున్నాయి. 2050 నాటికి అమెరికా తీరప్రాంతాల వెంట సముద్రం దాదాపు 3 మీటర్లమేర పైకి ఎగిసే ప్రమాదముంది. దీంతో జనావాసాలను సముద్రపు నీరు ముంచెత్తడంతోపాటు.. నగరాలను కూడా ఆక్రమించుకునే అవకాశం ఉంటుందని అధ్యయనం వెల్లడించింది. సముద్రపు నీటితో కుంగిన నేలలు, రోడ్లు ఇలా ప్రజారవాణా వ్యవస్థ మొత్తం దెబ్బతింటుందని అంచనా వేసింది. వచ్చే 30 సంవత్సరాల్లో ప్రతి 35 ప్రైవేట్ ఆస్తుల్లో ఒకటి వరదల బారిన పడే అవకాశముందని పేర్కొంది.
జన జీవనంపై ప్రభావం
గత అంచనాలను మించి విధ్వంసం తప్పదని వర్జీనియా యూనివర్సిటీ అధ్యయనం(Virginia University research) హెచ్చరించింది. సముద్ర మట్టం పెరగడంతో లక్షలాది మంది తీరప్రాంత ప్రజల జీవనం ప్రశ్నార్ధకంగా మారనుందని తెలిపింది. అమెరికాలో 109 బిలియన్ డాలర్లమేర ఆస్తినష్టం సంభవించవచ్చని ఓ అంచనాకు వచ్చినట్టు తెలిపింది. తీరాల వెంట మట్టాలు పెరిగితే కలిగే విపత్తులు, విపరిణామాలు దారుణంగా ఉంటాయని ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్త రాబర్ట్ నెకొలస్(Rabort Nekolus) ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రమాదం అంచున ఉన్న నగరాలు ఇవీ..
బోస్టన్, న్యూయార్క్ సిటీ, జెర్సీ సిటీ, అట్లాంటిక్ సిటీ, వర్జీనియా బీచ్, విలి్మంగ్టన్, మేర్టల్ బీచ్, చార్లెస్టన్, సవన్నా, జాక్సన్‌విల్లే, మయామీ, నేపుల్స్, మొబిల్, బిలోక్సీ, న్యూ ఓర్లీన్స్, స్లైడెల్, లేక్ చార్లెస్, పోర్ట్ ఆర్ధర్, టెక్సాస్ సిటీ, గాల్వెస్టన్, ఫ్రీపోర్ట్, కార్పస్ క్రిస్టీ, రిచ్‌మండ్, ఓక్లాండ్, శాన్ ప్రాన్సిస్కో, సౌత్ శాన్ ప్రాన్సిస్కో, ఫాస్టర్ సిటీ, శాంటాక్రూజ్, లాంగ్ బీచ్, హటింగ్టన్ బీచ్, న్యూపోర్ట్ బీచ్, శాండియాగో