Spicy Chip Challange: స్పైసీ చిప్స్ తిని యువకుడి మరణం - అసలు కారణం ఏంటంటే?
One Chip Challange: వన్ చిప్ ఛాలెంజ్ లో భాగంగా స్పైసీ చిప్స్ తిన్న ఓ యువకుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన గత సెప్టెంబర్ లో జరగ్గా.. ఆ యువకుని మరణానికి గల కారణాలు తాజాగా నిర్ధారించారు.
Massachusetts Young Man Died With Spicy Chip Challange: కొన్ని ఛాలెంజెస్ ప్రాణాలు హరిస్తుంటాయి. క్రేజ్ కోసం కొందరు యువత అలాంటి ఛాలెంజెస్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మసాచుసెట్స్ కు చెందిన 'హారిస్ వోలోబా' అనే 14 ఏళ్ల యువకుడు స్పైసీ చిరుతిండి కారణంగా చనిపోయాడు. ఈ ఘటన గత సెప్టెంబర్ లో జరగ్గా.. అతని మృతికి గల కారణాలు మాత్రం తాజాగా నిర్ధారించారు. 'వన్ చిప్ ఛాలెంజ్'లో భాగంగా అత్యంత స్పైసీ టోర్టిల్లా చిప్స్ తినాల్సి ఉంటుంది. ఈ ఛాలెంజ్ లో పాల్గొన్న తర్వాత కొంత సమయం పాటు ఆ మంటను భరించాలి. ఈ చిప్స్ ప్రపంచంలోనే హాటెస్ట్ మిరపకాయలైన.. కరోలినా రీపర్, స్కార్పియన్ నుంచి తయారు చేస్తారట. ఛాలెంజ్ లో భాగంగా ఈ చిప్స్ తిన్న 'వోలోబా' కు కొద్దిసేపటి తర్వాత అతనికి తీవ్రమైన కడుపునొప్పి రాగా.. సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఇదీ కారణం
14 ఏళ్ల వోలోబా మరణానికి గల కారణాలు ఈ నెల 16న (గురువారం) నిర్ధారించారు. ఆ నివేదిక ప్రకారం.. 'హారిస్ వోలోబా పుట్టుకతోనే గుండె లోపంతో బాధ పడుతున్నాడు. గత ఏడాది సెప్టెంబర్ లో అతను పాక్వికి సంబంధించి 'వన్ చిప్ ఛాలెంజ్'లో భాగంగా కరోలినా రీపర్, నాగా వైపర్ పెప్పర్ రెండింటినీ కలిపిన టోర్టిల్ చిప్ తీసుకున్నాడు. ఇది అత్యధికా గాఢత కలిగిన ఆహార పదార్థం. దీన్ని తినడం వల్ల కార్డియోపల్మోనరి అరెస్ట్ తో యువకుడు మృతి చెందాడు.' అని ధ్రువీకరించారు. అయితే, వన్ చిప్ ఛాలెంజ్ పెద్దలకు మాత్రమే అని పాక్వి ప్రతినిధి ఒకరు మీడియాకు చెప్పినట్లు తెలుస్తోంది. ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ఈ ఛాలెంజ్ కాదని అన్నారు.