US Mass Shooting: కాలిఫోర్నియాలో మరోసారి కాల్పుల కలకలం - ఏడుగురి మృతి
US Mass Shooting: కాలిఫోర్నియాలో మరోసారి కాల్పుల మోత మోగింది. సోమవారం రెండు వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల్లో మొత్తం ఏడుగురు మృతి చెందారు.
US Mass Shooting: అమెరికాలో కాల్పుల కలకలం కొనసాగుతూనే ఉంది. సోమవారం రోజు మరోసారి కాలిఫోర్నియాలో కాల్పులు జరిగాయి. రెండు వేర్వేరు చోట్ల జరిగిన ఈ ఘటనల్లో మొత్తం ఏరుగురి మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గయపడ్డారు. అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సాన్ మటేవో కౌంటీలోని హాల్ఫ్ మూన్ బే ప్రాంతంలో ఈ ఘటనలు జరిగాయి. సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఓ పుట్ట గొడుల ఫాం సమీపంలోని ఇంట్లోకి ప్రవేశించి దుండగుడు కాల్పులు జరిపాడు. మొత్తం నలుగురిని హత్య చేశాడు. ఆ తర్వాత కాసేపటికి ఓ టర్కీ కంపెనీ షెడ్డు వద్ద మరో ముగ్గుర్ని కాల్చి చంపాడు. ఈ ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు సాయంత్రం 5 గంటలలోగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కస్టడీకి తరలించి విచారిస్తున్నారు.
నిన్నటికి నిన్న కూడా అమెరికాలో కాల్పుల కలకలం
కాలిఫోర్నియాలోని మాంటెరీ పార్క్‌లో చైనీస్ న్యూ ఇయర్ వేడుకలో జరిగిన కాల్పుల్లో 10 మంది మరణించారు. అయితే ఈ మారణకాండకు పాల్పడినట్లు భావిస్తున్న 72 ఏళ్ల వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. షాట్ గన్ తో తనకు తానే కాల్చుకున్నట్లు అతడి శరీరంపై గాయం ఉందని పోలీసులు వివరించారు. అనుమానితుడు చైనా నుంచి వలస వచ్చిన 72 ఏళ్ల హూ కాన్ ట్రాన్ గా పోలీసులు గుర్తించారు. ట్రాన్ కాల్పులకు పాల్పడిన తర్వాత కొందరు వ్యక్తులు అతడి ఆయుధాన్ని లాక్కున్నట్లు సమాచారం. అతడు గతంలో ట్రక్కు డ్రైవర్ గా పని చేశాడు. దీంతో పాటు ట్రాన్స్ ట్రక్కింగ్ ఐఎన్సీ పేరిట వ్యాపారం చేసినట్లు తెలుస్తోంది.
కాల్పులు జరిపిన డ్యాన్స్ స్టూడియోకు ట్రాన్ తరచూ వస్తాడని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. అక్కడ అతడి మాజీ భార్యతో కలిసి సమయం గడిపేవాడని వారు చెప్పారు. అతడు 2006లోనే భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. ఘటనా స్థలానికి సమీపంలోని సాన్ గాబ్రియేల్ లో నివాసం ఉండేవాడు. స్టూడియోలోని శిక్షకులు, చాలా మంది వ్యక్తులతో అతడికి అంతగా పడేది కాదని స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు అతడికి కోపం చాలా ఎక్కువని వివరించారు. మాజీ భార్యను వెతుక్కుంటూ ట్రాన్స్ డ్యాన్స్ స్టూడియోస్ కు వచ్చినట్లు స్థానిక పత్రికలు పేర్కొన్నాయి. అక్కడ ఆమెను చూడగానే రెచ్చిపోయి విచ్చల విడిగా కాల్పులు జరిపినట్లు వెల్లడించాయి.
మాంటెరీ పార్క్‌లో సాంప్రదాయ చైనీస్ న్యూ ఇయర్ (లూనార్ న్యూ ఇయర్) వేడుకలు జరుపుకుంటున్నారు. అదే సమయంలో ఈ కాల్పులు జరిగాయి. ఘటనా స్థలానికి లాస్ ఏంజిల్స్ సిటీ హెడ్‌క్వార్టర్స్‌కు కేవలం 7 కిలో మీటర్ల దూరంలోనే ఉంది. కాల్పుల సమయంలో వేలాది మంది ప్రజలు అక్కడే ఉన్నారు. అప్పుడే అక్కడకు వచ్చిన ఓ వ్యక్తి మెషీన్ గన్ తో కాల్పులకు పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ కాల్పుల ఘటన అనంతరం పోలీసులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని అన్నారు. షూటర్ డ్యాన్స్ క్లబ్‌లోకి ప్రవేశించి, తుపాకీని తీసి కాల్పులు జరపడం ప్రారంభించాడని, ఆ తర్వాత గందరగోళం ఏర్పడిందని వెల్లడించారు. అక్కడకు వచ్చిన వారంతా గందరగోళంగా అటూఇటూ పరుగెట్టడంతో ఈ హడావుడిలోనే నిందితుడు తప్పించుకున్నాడని వివరించారు. ఈ సమయంలో కారులోకి వెళ్లిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోందని అన్నారు. అయితే ఎందుకు కాల్చాడు, ఆ తర్వాత ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో త్వరలోనే తెలుసుకుంటామన్నారు.