లండన్‌లో మీ పప్పులు ఉడకవ్, జూదులపై దాడులు చేస్తే తాట తీస్తాం - రిషి సునాక్ వార్నింగ్
Rishi Sunak Warning: లండన్‌లో జూదులపై దాడులు చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రిషి సునాక్ హెచ్చరించారు.
Rishi Sunak on Hamas Attacks:
రిషి సునాక్ హెచ్చరిక..
ఇజ్రాయేల్, హమాస్ యుద్ధంపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ స్పందించారు. బ్రిటన్‌లోని జూదులను రక్షించే బాధ్యత తమదే అని స్పష్టం చేశారు. దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టాలని చూడొద్దని హెచ్చరించారు. యూకేలో వాళ్ల పప్పులు ఉడకవని తేల్చిచెప్పారు. జూదులకు పూర్తి స్థాయిలో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికే బ్రిటన్‌లో పలు చోట్ల జూదులపై దాడులు జరిగాయి. ఇప్పటి వరకూ 105 ఘటనలు నమోదయ్యాయని లండన్ పోలీసులు వెల్లడించారు. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 12 మధ్యలోనే దాదాపు 75 ఘటనలు వెలుగులోకి వచ్చాయని వివరించారు. గతేడాది కూడా అక్కడక్కడా జూదులపై దాడులు జరిగాయి. అయితే..ఇజ్రాయేల్, హమాస్ మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి ఆ అలజడి ఇంకాస్త పెరిగింది. దాదాపు వారం రోజులుగా తరచూ ఏదో ఓ చోట ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయి. పరిస్థితులు అదుపు తప్పక ముందే పోలీసులు అన్ని చోట్లా నిఘా పెట్టారు. హింసాత్మక ఘటనల్ని ఏ మాత్రం సహించమని ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించింది.
"బ్రిటన్‌లోని జూదులకు మా పూర్తి మద్దతు ఉంటుంది. వాళ్లని రక్షించడానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటాం. అనవసరంగా విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తే ఊరుకోం. బ్రిటన్‌లో ఆ పప్పులు ఉడకవు. గత వారం నుంచి అక్కడక్కడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇది చాలా దురదృష్టకరం. ఇది ఏ మాత్రం సరికాదు. హింసను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం. కఠిన చర్యలు తీసుకుంటాం"
- రిషి సునాక్, బ్రిటన్ ప్రధాని
లండన్ పోలీసులు పని గంటలు పెంచుకుని మరీ నిఘా పెడుతున్నారు. పొరపాటున కూడా ఎక్కడా హింసాత్మక ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరో వారం రోజుల్లో అదనపు పోలీస్ ఫోర్స్‌నీ మొహరించేందుకు సిద్ధమవుతోంది ప్రభుత్వం. ఇటీవలే మార్చ్ ఫర్ పాలస్తీనా ర్యాలీ జరిగింది. ఆ సమయంలో దాదాపు వెయ్యి మంది పోలీసులు మొహరించి పహారా కాశారు.
ఇంటిలిజెన్స్‌ని పట్టించుకోని ఇజ్రాయేల్..
ఇజ్రాయేల్‌పై హమాస్ ఉగ్రవాదులు దాడి చేయడానికి కొన్ని వారాల ముందే అమెరికా వార్నింగ్ ఇచ్చింనట్టు కొన్ని రిపోర్ట్‌లు చెబుతున్నాయి. అమెరికన్ ఇంటిలిజెన్స్ Central Intelligence Agency (CIA) ముందుగానే హెచ్చరించింది. హింసాత్మకమైన ఘటనలు జరిగే అవకాశముందని వార్నింగ్ ఇచ్చింది. హమాస్ దాడులు జరగడానికి కొద్ది రోజుల ముందే అమెరికా ఇంటిలిజెన్స్ రెండు రిపోర్ట్‌లు పంపిందట. ఇజ్రాయేల్‌పై హమాస్ ఉగ్రవాదులు రాకెట్ దాడులు చేసే అవకాశముందని మొదట సెప్టెంబర్ 28వ తేదీన ఓ రిపోర్ట్ తయారు చేసింది. ఆ తరవాత మొదటి రిపోర్ట్‌కి కొనసాగింపుగా..అక్టోబర్ 5న మరో నివేదిక సిద్దం చేసింది. హమాస్ ఉగ్రవాదులు హింసకు పాల్పడే ప్రమాదముందని మరోసారి వార్నింగ్ ఇచ్చింది. నిజానికి గత ఏడాది నుంచి సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ ఈ హెచ్చరికలు చేస్తూనే ఉంది. అయితే..ఇటీవల ఇచ్చిన రెండు రిపోర్ట్‌లనూ ఇజ్రాయేల్ లైట్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
Also Read: Delhi Earthquake: ఢిల్లీలో మరోసారి కంపించిన భూమి, వరుస భూకంపాలతో వణికిపోతున్న ప్రజలు