Taliban News: అప్ఘనిస్థాన్‌లో బ్యూటీపార్లర్లపై తాలిబన్ల నిషేధం- ఉపాధిపై మహిళల ఆందోళన
Talibans News: మహిళలకు తాలిబన్లు మరోసారి షాక్ ఇచ్చారు. బ్యూటీ పార్లర్లపై నిషేధం విధించి బ్యూటీ సెలూన్ల లైసెన్సులను రద్దు చేశారు.
Talibans News: అఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు మరో కొత్త నిబంధన తీసుకొచ్చారు. కాబూల్ లోని మహిళలు ఎవరూ బ్యూటీ పార్లర్లకు వెళ్లొద్దని చెబుతూ.. బ్యూటీ పార్లర్లపై నిషేధం విధించారు. కాబూల్ తో పాటు దేశవ్యాప్తంగా ఇతర ప్రావిన్సులలో మహిళల బ్యూటీ సెలూన్‌లను నిషేధించింది. తాలిబన్ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మహమ్మద్ అకీఫ్ మహజర్ ఈ విషయాన్ని వెల్లడించారు. తాలిబన్ నాయకుడు చెప్పిన కొత్త డిక్రీని అమలులోకి తీసుకురావాలని, మహిళల బ్యూటీ సెలూన్ల లైసెన్స్‌లను రద్దు చేయాలని తాలిబన్ మంత్రిత్వ శాఖ కాబూల్ మున్సిపాలిటీ అధికారులను ఆదేశించింది.
కూడు లేక కుటుంబ సభ్యులంతా చనిపోవాల్సిందే..!
ఉద్యోగాలు లేని పరిస్థితిలో తమ కుటుంబాలను పోషించుకోవాలంటే తాము పని చేయాల్సిందేనని మేకప్ ఆర్టిస్ట్ రైహాన్ ముబారిజ్ తెలిపారు. అయితే బ్యూటీ పార్లర్లు లైసెన్లులను రద్దు చేయడంతో తమకు ఉపాధి లేకుండా పోయిందని అన్నారు. పురుషులకు ఉద్యోగాలు లేకుండా ఇంట్లోనే ఉంటే.. స్త్రీలు బయటకు రాకుండా ఉండాలని నిషేధం విధించడం వల్ల కుటుంబ సభ్యులంతా చనిపోవాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేశారు.
బాలికలు, స్త్రీలకు నిషేధం విధించడం వల్లే సమస్యలు..!
బాలికల, మహిళల పాఠశాలలు, విశ్వవిద్యాలయాలకు వెళ్లడం, ఎన్జీఓలలో పని చేయడంతో పాటు పార్కులు, సినిమాలు, ఇతర వినోద ప్రదేశాలు వంటి బహిరంగ ప్రదేశాలకు వెళ్లడాన్ని నిషేధించడం వల్లే చాలా సమస్యలకు దారి తీస్తుందని కాబూల్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాలికలు, మహిళలపై తాలిబన్లు ఆంక్షలు విధించడం సరికాదని.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిచర్యలకు దారి తీసిందని అన్నారు.
ఇటీవలే మహిళా ఉద్యోగులపై నిషేధం
తమ దేశంలో ఐక్యరాజ్య సమితి సంస్థకు చెందిన మహిళా ఉద్యోగులపై నిషేధం విధించింది. వాళ్లు పని చేయడానికి వీల్లేదంటూ తేల్చి చెప్పింది. అఫ్గనిస్థాన్‌లోని నాన్‌గర్హర్ ప్రావిన్స్‌లో ఈ బ్యాన్ విధించింది తాలిబన్ ప్రభుత్వం. దీనిపై యూఎన్‌వో తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఫిమేల్ స్టాఫ్ లేకుండా కార్యకలాపాలు కొనసాగించడం కష్టం అని వెల్లడించింది. అయితే...దీనిపై ఇంకా తాలిబన్ ప్రభుత్వం స్పందించలేదు. కేవలం ఓ ప్రావిన్స్‌కు మాత్రమే ఈ ఆంక్షలు పరిమితం చేస్తారా..? లేదంటే దేశవ్యాప్తంగా ఇదే అమలు చేస్తారా అన్నది ఇంకా స్పష్టత రాలేదు.
గతేడాదే తాలిబన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్జీవోల్లో పని చేసే మహిళా ఉద్యోగులందరిపైనా ఆంక్షలు విధించింది. అప్పటికి ఐరాస మహిళా ఉద్యోగులను టార్గెట్ చేయలేదు. అయితే...ఐక్యరాజ్య సమితి మాత్రం తమనూ టార్గెట్ చేస్తారని ఆందోళన వ్యక్తం చేసింది. అందుకు తగ్గట్టుగానే ఓ ప్రావిన్స్‌లో నిషేధం విధించారు తాలిబన్లు. ఈ నిర్ణయంపై స్పందించిన యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి నిర్ణయాలను సహించేదే లేదని తేల్చి చెప్పారు.
మహిళలపై దాడులు..
అఫ్గనిస్థాన్‌లో తాలిబన్ల పాలన వచ్చినప్పటి నుంచి అక్కడి మహిళలు నరకం చూస్తున్నారు. వాళ్లపై ఆంక్షలు విధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మహిళలకు స్వేచ్ఛ లేకుండా కట్టడి చేస్తున్నారు. షరియా చట్టాన్ని అమలు చేస్తూ...కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి బదక్షన్ ప్రావిన్స్‌లో జరిగింది. ఫైజాబాద్‌లోని ఓ గ్రౌండ్‌లో 11 మందిని ప్రజలందరూ చూస్తుండగానే దారుణంగా కొట్టినట్టు తాలిబన్ సుప్రీం కోర్టు వెల్లడించింది. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. వివాహేతర సంబంధం పెట్టుకున్నారని, చట్టానికి వ్యతిరేకంగా నడుచుకున్నారన్న ఆగ్రహంతో బహిరంగంగానే తాలిబన్లు వాళ్లను విచక్షణా రహితంగా కొట్టారు. అంతకు ముందు 16 మందిని కూడా ఇదే కారణంతో కొట్టినట్టు సుప్రీం కోర్టు తెలిపింది. నిజానికి...అక్కడ ఇలా శిక్ష విధించడం చాలా సాధారణమైపోయింది. ఏ తప్పు చేసినా సరే...నేరుగా వీధుల్లోకి తీసుకొచ్చి అందరి ముందు శిక్ష విధిస్తారు. ఇప్పటి వరకూ రకరకాల నేరాలు చేశారన్న కారణంగా 250 మందిని ఇలా కొట్టినట్టు అక్కడి మీడియా వెల్లడించింది. తాలిబన్ల ప్రభుత్వంపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నా...వాళ్లు మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. షరియా చట్టం ప్రకారమే నడుచుకుంటున్నామని చెబుతున్నారు.