Telugu News: ఊళ్లను మింగేసేందుకు సిద్ధమవుతున్న పసిఫిక్ మహాసముద్రం- మేల్కోకుంటే తప్పదు ప్రమాదం
Pacific Ocean: కాలుష్యాన్ని నియంత్రించుకోలేకపోతే మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. సముద్రం మానవాళిని ముంచేందుకు సిద్ధంగా ఉందని చెబుతోంది.
Pollution Problem on pacific ocean కాలుష్యాన్ని నియంత్రించుకోలేకపోతే మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరిస్ హెచ్చరించారు. వాతావర్ణ మార్పుల కారణంగా సముద్రం మానవాళిని ముంచేయడానికి సిద్ధంగా ఉందని ఆయన అంటున్నారు. ముఖ్యంగా పసిఫిక్ మహా సముద్ర ప్రాంతానికి ఈ ముప్పు ఎక్కువగా పొంచి ఉందని అంటున్నారు. టోంగా లో జరుగుతున్న పసిఫిక్ ఐలండ్ ఫోరమ్ లీడర్స్ సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ విషయాలను వెల్లడించారు. పెరుగుతున్న సముద్ర మట్టాలు మన జనావాసాలను చేరుకుని ముంచెత్తుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి రెండు ప్రత్యేక నివేదికలు విడుదల చేసింది.
పసిఫిక్ నైరుతి ప్రాంతానికి పొంచి ఉన్న ముప్పు
ఈ నివేదికల ప్రకారం పసిఫిక్ నైరుతి ప్రాంతం ప్రధానంగా మూడు సమస్యలను ఎదుర్కొంటోందని తెలుస్తోంది. పెరుగుతున్న సముద్ర నీటి మట్టాలు, సముద్రపు నీటిలో పెరుగుతున్న ఆమ్లీకరణ (ఎసిడిటీ), సముద్రపు నీటిలో పెరుగుతున్న వేడి అనే ఈ మూడు సమస్యలని ‘స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ ఇన్ ది సౌత్ వెస్ట్ పసిఫిక్’ నివేదిక తెలిపింది. శిలాజ ఇంధనాలను మండించడం వల్ల ఏర్పడే కర్బన ఉద్గారాల కారణంగా భూగోళం మండిపోతోందని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమస్యకు ప్రధాన కారణమని, ఈ వేడి ప్రభావం సముద్రాలపై పడిందని అని గ్యుటెరిస్ తన ప్రసంగంలో చెప్పారు. ‘మార్పుని ఎదుర్కొందాం’ అనే నినాదంతో సమావేశాలు మొదలయ్యాయి. కాగా ఈ కార్యక్రమం ప్రారంభం రోజున ఆడిటోరియంలోకి వరద నీరు పోటెత్తింది. భూకంపం కారణంగా స్థానికంగా కొన్ని ప్రాంతాలు ఖాళీ చేయాల్సి వచ్చింది. దీన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామనేదానికి ఇదే ఉదాహరణ అని, ఎలాంటి అననుకూల పరిస్తితులనైనా ఎదుర్కొనేందుకు మనం సిద్ధంగా ఉండాలని గ్యుటెరిస్ పిలుపునిచ్చారు.
పసిఫిక్ ప్రాంతంలో 15 సెంమీలు పెరిగిన నీటి మట్టం
సమద్ర మట్టాల పెరుగుదలపై ఐక్యరాజ్య సమితి యాక్షన్ టీమ్ ఒక నివేదిక విడుదల చేసింది. గత 3వేల ఏళ్లతో పోలిస్తే ప్రపంచ సముద్ర మట్టాల సగటు ఇంతకు ముందెన్నడు లేనివిధంగా పెరుగుతోందని పేర్కొంది. గత 3 వేల ఏళ్లతో పోల్చితే సముద్ర నీటి మట్టాలు గణనీయంగా పెరుగుతున్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. గడిచిన మూడు దశాబ్దాలలో సముద్ర నీటి మట్టం 9.4 సెంటీమీటర్లు పెరగ్గా, పసిఫిక్ ప్రాంతంలో మాత్ర 15 సెంటీమీటర్లు పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. ఆస్ట్రేలియా, అయోటెరోవా వంటి దేశాలు అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకతను వివరించారు. సెక్రటరీ జనరల్ గ్యుటెరిస్ అధ్యక్షతన జరిగిన ఈ పసిఫిక్ ఐలాండ్స్ ఫోరమ్ లీడర్స్ మీటింగ్‌లో ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ తోపాటు మరో 18 పసిఫిక్ దీవుల నాయకులు హాజరయ్యారు.
ఆస్ట్రేలియాను ఏకాకిని చేసిన పసిఫిక్ దీవులు
శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించడానికి బదులుగా గ్యాస్ వెలికితీత, వినియోగాలను 2050 వరకు లేదా ఆపైన కూడా కొనసాగిస్తామని ఈ ఏడాది మొదట్లో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ చెప్పారు. దీంతో ఈ సమావేశానికి హాజరైన పసిఫిక్ దీవుల అధినేతలంతా ఆస్ట్రేలియాను ఏకాకిని చేశారు. భూతాపాన్ని 1.5 డిగ్రీలు తగ్గించాలన్న 2015 నాటి పారిస్ ఒప్పందానికి ప్రపంచ దేశాలన్నీ కట్టుబడి ఉండాలని సూచించారు. ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీలు తగ్గిస్తేనే గ్రీన్‌ల్యాండ్, అంటార్కిటిక్ మంచు పొరలు కూలిపోవడాన్ని ఆపగల అవకాశాలు సజీవంగా ఉంటాయని గ్యుటెరిస్ అభిప్రాయపడ్డారు.