(Source: ECI | ABP NEWS)
Nobel Prize 2025:వైద్య శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి-రోగనిరోధక వ్యవస్థ రహస్యాలు ఛేదించిన శాస్త్రవేత్తలకు పురస్కారం
Nobel Prize 2025 Medicine: ప్రజలను పట్టిపీడిస్తున్న ఆటోఇమ్యూన్ వ్యాధుల మూల కారణాన్ని, నివారణ రహస్యాన్ని ఛేదించిన ముగ్గురు శాస్త్రవేత్తలకు 2025 సంవత్సరపు వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి దక్కింది.

Nobel Prize 2025 Medicine: ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలను పట్టిపీడిస్తున్న ఆటోఇమ్యూన్ అంటే స్వీయ రోగనిరోధక వ్యాధుల మూల కారణాన్ని, వాటి నివారణకు సంబంధించిన అత్యంత కీలకమైన రహస్యాన్ని ఛేదించిన ముగ్గురు శాస్త్రవేత్తలకు స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లోని అసెంబ్లీ 2025 సంవత్సరపు వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి దక్కింది.
ఈ ఏడాది వైద్య నోబెల్ బహుమతిని అమెరికాకు చెందిన డాక్టర్ మేరీ ఇ.బ్రంకో, డాక్టర్ ఫ్రెడ్ రామ్స్‌డెల్, జపాన్‌కు చెందిన డాక్టర్ షిమోన్ సకాగుచి సంయుక్తంగా అందుకోనున్నారు. వారి 'పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్' పై చేసిన విప్లవాత్మక ఆవిష్కరణలకుగాను ఈ గౌరవం దక్కింది. ఈ పరిశోధనలు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ తన సొంత కణజాలంపై పొరపాటున దాడి చేయకుండా ఆపడానికి ఉపయోగించే అంతర్గత మెకానిజాన్ని ప్రపంచానికి వివరించాయి.
నోబెల్ కమిటీ చైర్మన్ ఒల్లే కాంప్‌పే, ఈ ఆవిష్కరణల ప్రాముఖ్యతను ఉటంకిస్తూ, "వారి పరిశోధనలు రోగనిరోధక వ్యవస్థ ఎలా పనిచేస్తుందో, డయాబెటిస్, మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి తీవ్రమైన ఆటోఇమ్యూన్ రోగాలు ఎందుకు వస్తున్నాయో అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి" అని పేర్కొన్నారు. ఈ అవార్డు ప్రకటన వైద్య శాస్త్రంలో, ముఖ్యంగా ఇమ్యునాలజీ (రోగనిరోధక శాస్త్రం) రంగంలో సరికొత్త చికిత్సల అభివృద్ధికి, క్యాన్సర్, అవయవ మార్పిడి రంగాల్లో సరికొత్త పరిశోధనలకు దారితీసింది.
'సెక్యూరిటీ గార్డ్‌లు' లేకుండా విధ్వంసమే: సకాగుచి తొలి అడుగు
మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ అనేది నిత్యం అప్రమత్తంగా ఉండే ఒక సైన్యం వంటిది. ఇది బయటి నుంచి వచ్చే వైరస్‌లు, బ్యాక్టీరియాలను గుర్తించి వాటిని నిర్మూలిస్తుంది. ఈ సైన్యంలో అత్యంత కీలకం టి-సెల్స్ (T-cells). టి-సెల్ రిసెప్టర్లు 'సెన్సార్ల'లా పనిచేసి, శత్రువులను గుర్తిస్తాయి.
కానీ ఈ వ్యవస్థలో కమ్యూనికేషన్ లోపం వల్ల టి-సెల్స్ పొరపాటున శరీరంలోని ముఖ్యమైన కణజాలాలను (ఉదాహరణకు, ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలను లేదా కీళ్ల కణాలను) శత్రువులుగా భావించి దాడి చేస్తాయి. ఫలితంగా టైప్ 1 డయాబెటిస్, మల్టిపుల్ స్క్లెరోసిస్, రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ వంటి ఆటోఇమ్యూన్ రోగాలు సంభవిస్తాయి. ఈ విధ్వంసాన్ని అరికట్టే 'బ్రేకింగ్ మెకానిజం'ను కనుగొన్న మొదటి వ్యక్తి డాక్టర్ షిమోన్ సకాగుచి.
సకాగుచి (జపాన్): 1951లో జన్మించిన షిమోన్ సకాగుచి, క్యోటో యూనివర్సిటీ నుంచి 1976లో M.D., 1983లో Ph.D. పట్ పొందారు. ప్రస్తుతం ఆయన ఒసాకా యూనివర్సిటీలోని ఇమ్యూనాలజీ ఫ్రంటియర్ రీసెర్చ్ సెంటర్‌లో డిస్టింగ్విష్డ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
సకాగుచి 1995లోనే అత్యంత కీలకమైన ఆవిష్కరణ చేశారు: రెగ్యులేటరీ టి-సెల్స్ (Tregs). ఇవి రోగనిరోధక వ్యవస్థలో 'సెక్యూరిటీ గార్డ్‌లు' లేదా శాంతిభద్రతల దళాలుగా పని చేస్తాయి. ఇవి CD4, CD25 అనే ప్రోటీన్‌ల ద్వారా గుర్తిస్తారు. ఈ Tregs శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలపై దాడి చేయాలనుకునే హానికరమైన టి-సెల్స్‌ను అణచివేసి, కణజాలాన్ని రక్షిస్తాయి. ఆ రోజుల్లో అనేక మంది శాస్త్రవేత్తలు ఈ ఆవిష్కరణపై మొదట్లో సందేహం వ్యక్తం చేసినప్పటికీ, ఇది ఇమ్యునాలజీలో విప్లవాత్మక ఆవిష్కరణగా నిరూపితమైంది. 2003లో, Tregs అభివృద్ధికి FOXP3 అనే జీన్ అత్యంత కీలకమైనదని సకాగుచి బృందం నిరూపించింది.
బ్రంకో, రామ్స్‌డెల్ పాత్ర
సకాగుచి పునాది వేసిన Tregs పరిశోధనను, అమెరికన్ శాస్త్రవేత్తలు మేరీ బ్రంకోవ్& ఫ్రెడ్ రామ్స్‌డెల్ జన్యుపరమైన కోణంలో ధ్రువీకరించారు. వీరిద్దరూ కలిసి 2001లో రెండో ముఖ్యమైన ఆవిష్కరణ చేశారు.
ఫ్రెడ్ రామ్స్‌డెల్: 1960లో ఇల్లినాయిస్‌లో జన్మించిన రామ్స్‌డెల్, 1987లో UCLA నుంచి ఇమ్యూనాలజీలో Ph.D. పొందారు. ప్రస్తుతం ఆయన శాన్ ఫ్రాన్సిస్కోలోని సోనోమా బయోథెరప్యూటిక్స్‌కు సైంటిఫిక్ అడ్వైజర్‌గా ఉన్నారు.
మేరీ ఇ. బ్రంకోవ్: 1961లో జన్మించిన బ్రంకోవ్, ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ నుంచిPh.D. పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమె అమెరికాలోని సీటెల్‌లో ఇన్‌స్టిట్యూట్ ఫర్ సిస్టమ్స్ బయాలజీలో సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.
వీరు ఇద్దరూ కలిసి 'స్కర్ఫీ మౌస్' అనే ప్రత్యేక ఎలుక జాతిపై అధ్యయనం చేశారు. ఈ ఎలుకలు తీవ్రమైన ఆటోఇమ్యూన్ రోగాలతో బాధపడుతుంటాయి. వారి పరిశోధనలో, ఎక్స్ క్రోమాజోమ్‌పై ఉన్న FOXP3 జీన్‌లో మ్యూటేషన్ జరగడమే ఈ రోగాలకు కారణమని తేలింది. ఈ మ్యూటేషన్ Tregs లోపించడానికి దారితీస్తుంది, దీని ఫలితంగా రోగనిరోధక వ్యవస్థ నియంత్రణ కోల్పోయి శరీర కణాలపై దాడి చేస్తుంది.
మానవులలో, FOXP3 జీన్‌లో లోపం ఏర్పడినప్పుడు IPEX సిండ్రోమ్ (ఇమ్యూన్ డిస్‌రెగ్యులేషన్, పాలీఎండోక్రినోపతీ, ఎంటరోపతీ, ఎక్స్-లింక్డ్) అనే అరుదైన, ప్రాణాంతకమైన ఆటోఇమ్యూన్ వ్యాధి వస్తుంది. బ్రంకోవ్, రామ్స్‌డెల్ ఈ జన్యు మూలాన్ని స్పష్టంగా నిరూపించడం ద్వారా, ఇమ్యునాలజీలో కొత్త రంగాన్ని ఆవిష్కరించారు.
చికిత్సలో విప్లవం
ఈ ముగ్గురు శాస్త్రవేత్తల ఆవిష్కరణలు కేవలం రోగాల కారణాలను వివరించడానికే పరిమితం కాలేదు, నేడు ఆధునిక వైద్యంలో చికిత్సా విధానాలను సమూలంగా మారుస్తున్నాయి.
1. క్యాన్సర్ ఇమ్యునోథెరపీలో కీలకం
రోగనిరోధక వ్యవస్థ నియంత్రణను Tregs నిర్వహిస్తాయి. దురదృష్టవశాత్తు, క్యాన్సర్ కణాలు చాలా తెలివిగా పనిచేస్తాయి. అవి ఈ Tregsను తమ వైపు ఆకర్షించుకుంటాయి. ఫలితంగా, క్యాన్సర్ కణాల చుట్టూ ఒక బలమైన ‘రక్షణ గోడ’ ఏర్పడుతుంది. ఈ గోడ కారణంగా, రోగనిరోధక వ్యవస్థ క్యాన్సర్ కణాలను గుర్తించి దాడి చేయలేదు.
ఈ నోబెల్ విజేతల పరిశోధనల ఆధారంగా, క్యాన్సర్ ఇమ్యునోథెరపీల ప్రధాన లక్ష్యం ఏమిటంటే, ఈ Tregs రక్షణ గోడను కూల్చివేయడం. ఈ అవగాహన ద్వారా అభివృద్ధి చేసిన CAR T-సెల్ థెరపీ వంటి అత్యాధునిక చికిత్సలు ల్యుకేమియా, లింఫోమా వంటి క్యాన్సర్ల చికిత్సలో గొప్ప విజయాలు సాధిస్తున్నాయి.
2. ఆటోఇమ్యూన్ రోగాలకు టార్గెటెడ్ ట్రీట్‌మెంట్
Tregs సంఖ్య లేదా పనితీరు లోపించిన కారణంగా వచ్చే ఆటోఇమ్యూన్ వ్యాధులకు చికిత్స అందించడానికి శాస్త్రవేత్తలు ఇప్పుడు నిర్దిష్ట పద్ధతులను ఉపయోగిస్తున్నారు.
ఉదాహరణకు, ఇంటర్‌ల్యుకిన్-2 వంటి రసాయన పదార్థాలను ఉపయోగించి రోగుల శరీరంలో Tregs సంఖ్యను పెంచే ప్రయత్నాలు ప్రస్తుతం వైద్య ట్రయల్స్‌లో ఉన్నాయి. ఈ పద్ధతి IPEX సిండ్రోమ్ వంటి అరుదైన, తీవ్రమైన రోగాలకు కూడా మంచి ఫలితాలను ఇస్తోంది.
3. అవయవ మార్పిడి (ట్రాన్స్‌ప్లాంటేషన్) లో అద్భుతం
అవయవ మార్పిడి శస్త్రచికిత్సల్లో రోగి శరీరం కొత్త అవయవాన్ని 'తిరస్కరించడం' ఒక పెద్ద సమస్య. దీనిని నివారించడానికి దీర్ఘకాలికంగా ఇమ్యూనో సప్రెసివ్ మందులు వాడాల్సి ఉంటుంది.
అయితే, ఈ పరిశోధనల ఫలితంగా, శాస్త్రవేత్తలు ఇప్పుడు Tregsను ప్రత్యేకమైన 'అడ్రెస్ లేబుల్స్'తో ట్యాగ్ చేసి, మార్పిడి చేసిన అవయవం వద్దకు నేరుగా పంపించగలుగుతున్నారు. ఈ ప్రత్యేకమైన Tregs, ఆ అవయవాన్ని తిరస్కరించకుండా రోగనిరోధక వ్యవస్థను నియంత్రిస్తాయి, తద్వారా అవయవ తిరస్కరణను సమర్థవంతంగా నిరోధిస్తాయి. దీర్ఘకాలిక మందుల అవసరాన్ని తగ్గిస్తాయి. స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్లలో తలెత్తే సమస్యలను తగ్గించడానికి కూడా Tregs పరిశోధన దోహదపడుతుంది.





















