High Alert in US: ఇరాన్‌పై దాడుల ఎఫెక్ట్.. వాషింగ్టన్ సహా అమెరికాలోని పలు నగరాల్లో హై అలర్ట్
ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా దాడులు చేసింది. ఇరాన్ ప్రతిదాడులకు పాల్పడే అవకాశం ఉండడంతో అమెరికాలోని ప్రధాన నగరాల్లో ప్రభుత్వాలు హైఅలర్ట్ ప్రకటించాయి.

US Cities on High Alert: ఇరాన్‌కు అత్యంత ప్రధానమైన ఫోర్డో అణుకేంద్రంతోపాటు నతాంజ్, ఇస్ఫాహన్ అణుకేంద్రాలపై అమెరికా దాడులు చేసింది. ఈ దాడులతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇరాన్ ప్రతిదాడులకు పాల్పడే అవకాశం ఉండడంతో అమెరికాలోని ప్రధాన నగరమైన వాషింగ్టన్‌తోపాటు పలు నగరాల్లో అక్కడి ప్రభుత్వాలు హైఅలర్ట్ ప్రకటించాయి.
ఇరాన్‌లోని మూడు అణుకేంద్రాలే లక్ష్యంగా అమెరికా శనివారం తీవ్ర దాడులకు పాల్పడింది. అత్యంత శక్తివంతమైన B–2 స్పిరిట్ బాంబర్లతో ఫోర్డో అణుకేంద్రాన్ని ధ్వంసం చేశామని స్వయంగా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. అయితే ప్రతీకారంగా ఇరాన్ దాడులకు తెగబడే అవకాశం ఉండడంతో స్థానిక ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. పౌరులకు ఎలాంటి హాని జరగకుండా ఉండేందుకు ముందుగానే జాగ్రత్తపడుతున్నాయి. అందులో భాగంగా ప్రార్థనా స్థలాలు, సున్నితమైన ప్రాంతాల్లో నిఘాను పటిష్ఠం చేశాయి. వాషింగ్టన్‌తో సహా పలు నగరాల్లో హైఅలర్ట్ విధించాయి.
ఇరాన్‌లో దాడుల నేపథ్యంలో అక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు న్యూయార్క్ పోలీస్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. మతపరమైన ప్రదేశాలు, సాంస్కృతిక, దౌత్య ప్రాంతాల్లో భద్రతాపరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ‘ఇరాన్‌లో జరుగుతున్న పరిస్థితిని ట్రాక్ చేస్తున్నాం. నగరం అంతటా అదనపు బలగాలను మోహరించాం’. అని పేర్కొన్నారు. పలు శాఖల సమన్వయంతో పనిచేస్తున్నామని, న్యూయార్క్ నగరానికి ఏదైనా ప్రమాదం పొంచి ఉందో లేదో పర్యవేక్షిస్తూనే ఉన్నామని పోలీస్ విభాగం తెలిపింది.
వాషింగ్టన్ లోని మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ (MPD) కూడా ఇలాంటి ప్రకటనే విడుదల చేసింది. దాడుల సమాచారంపై స్థానిక, రాష్ట్ర మరియు సమాఖ్య చట్ట అమలు సంస్థలతో సమన్వయం చేసుకుంటూ, నిఘా సమాచారాన్ని పంచుకుంటున్నామని తెలిపింది. నివాసితులు, సందర్శకులు, వ్యాపార సంస్థల భద్రత కోసం పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటివరకు ఎలాంటి బెదిరింపులు రాకపోయినప్పటికీ.. మతపరమైన సంస్థల చుట్టూ పోలీసు భద్రతను పెంచినట్లు లేదని తెలిపిన MPD పేర్కొంది.
లాస్‌ఏంజెలెస్ మేయర్ కరన్ బాస్ కూడా ఇదే తరహా ప్రకటన చేశారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రజా భద్రతకు ముప్పు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకైతే సిటీకి బెదిరింపులేమీ రాలేదని అన్నారు. ప్రార్థనా స్థలాలు, జనసమూహ ప్రాంతాలతో సహా ఇతర సున్నితమైన ప్రదేశాల్లో భద్రతను పెంచినట్లు వెల్లడించారు. కొలంబియాలో ఎలాంటి ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు మెట్రోపాలిటన్ పోలీస్ అధికారులు తెలిపారు.
NYPD మాజీ ఇన్‌స్పెక్టర్ పాల్ మౌరో ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల వల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉన్న కమ్యూనిటీలతో ముడిపడి ఉన్న ప్రదేశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని వెల్లడించారు. ఇజ్రాయెల్‌తో ముడిపడి ఉన్న ప్రదేశాలు, షియా మసీదుల్లో గస్తీని పెంచామన్నారు. ‘ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు.. ఏం జరుగుతుందో ఊహించలేం’ అని పేర్కొన్నారు.





















