London bridge: కిందకు దిగని ఫేమస్ లండన్ బ్రిడ్జ్, దాంతో భారీగా ట్రాఫిక్ జామ్
London bridge: యూకేలోని ప్రముఖ లండన్ బ్రిడ్జి ఆ నగరంలో ట్రాఫిక్ జామ్‌కు కారణమైంది. బ్రిడ్జ్ అరగంటకు పైగా కిందకు దిగకపోవడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.
యూకేలోని ప్రముఖ లండన్ టవర్ బ్రిడ్జి ఆ నగరంలో ట్రాఫిక్ జామ్‌కు కారణమైంది. ఎందుకంటే లండన్ బ్రిడ్జ్ పడవ ప్రయాణం కోసం పైకి లేస్తుందనే సంగతి తెలిసిందే. అయితే అలా పైకి లేచినప్పుడు సాంకేతిక సమస్య తలెత్తడంతో అదే పొజిషన్‌లో బ్రిడ్జి కొద్దిసేపు ఆగిపోయింది. కిందకు దిగలేదు. దీంతో బ్రిడ్జ్‌పై వెళ్లాల్సిన వాహనాలు ఎక్కడివక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. దీంతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. గురువారం మధ్యాహ్నం 1.15 నిమిషాల సమయంలో ఈ ఘటన జరిగినట్లు అక్కడి మీడియా కథనాల్లో వెల్లడించారు.
దాదాపు అరగంట తర్వాత బ్రిడ్జ్ కిందకు దిగిందని, దీంతో వాహనాలు వెళ్లడానికి మార్గం ఏర్పడిందని అక్కడ ప్రత్యక్షంగా చూసిన వారు వెల్లడించారు. మొదట బ్రిడ్జ్ పైకి లేచి ఉండడం చూస్తున్నప్పడు మంచిగా అనిపించిందని, కానీ తర్వాత అర్థమైంది ఏదో సమస్య తలెత్తి బ్రిడ్జి తిరిగి కిందకు దిగడం లేదని తెలిసిందని ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపారు. దీని వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యిందని చెప్పారు. టూరిస్ట్ బస్సులు, వాహనాలతో పాటు పెద్ద మొత్తంలో ప్రజలు ఉండడంతో అంతా రద్దీగా మారినట్లు తెలిపారు. బ్రిడ్జి కిందకు దిగగానే చాలా మంది ఆనందంతో అరిచారని మరొకరు చెప్పారు. లండన్ బ్రిడ్జిని ముందెప్పుడూ చూడలేదని, ఈ వంతెనను చూడడం చాలా ఉత్సాహంగా అనిపించిందని, బ్రిడ్జి కిందకు దిగిన తర్వాత ముందు బైక్‌లను అనుమతించి నెమ్మదిగా ట్రాఫిక్ క్లియర్ చేసినట్లు మరొక వ్యక్తి తెలిపారు.
లండన్‌లోని థేమ్స్ నదిపై నిర్మించిన ఈ టవర్ బ్రిడ్జ్ చాలా ప్రత్యేకమైనది. నదీ రవాణాకు, రోడ్డు రవాణాకు కూడా వీలుగా ఉంటుంది. నీటిలో పడవలు వెళ్లే సమయంలో బ్రిడ్జి రెండు భాగాలు గేటు మాదిరిగా పైకి లేస్తాయి. పడవలు వెళ్లిపోయిన తర్వాత తిరిగి యథాస్థానానికి వచ్చి రోడ్డుగా మారుతుంది. ఈ బ్రిడ్జి రోడ్డుపై వాహనాలు ప్రయాణిస్తాయి. థేమ్స్ నదిపై ఈ బ్రిడ్జ్ నిర్మాణం 1894లో పూర్తిచేశారు. రెండు పెద్ద టవర్ల మధ్య నిర్మించిన ఈ బ్రడ్జి చూడడానికి ఎంతో బాగుంటుంది. రెండు టవర్లు నదికి 61మీటర్ల ఎత్తులో ఉంటాయి.
ప్రతి రోజూ వందలాది పర్యటకులు దీనిని చూడడానికి వస్తుంటారు. రెండు టవర్ల మధ్య స్కైవాక్ కూడా ఉంటుంది. దానిపై నుంచి చూస్తే రోడ్డుపై వెళ్లే వాహనాలతో పాటు నదిలో వెళ్లే పడవలు కూడా కనిపిస్తాయి. లండన్ బ్రిడ్జ్‌కి ఇలా సమస్య తలెత్తడం చాలా అరుదు. గురువారం బ్రిడ్జ్ అరగంటకు పైగాకిందకు దిగకపోవడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. పర్యాటక ప్రాంతమైనందున రద్దీ ఎక్కువగా ఉండడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీని వల్ల లండన్ నగర వీధుల్లో కూడా ట్రాఫిక్ జామ్ అయ్యింది. బ్రిడ్జి కిందకు దిగిన వెంటనే పోలీసులు ట్రాఫిక్‌ను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు.