Talibans: ఆఫ్ఘనిస్థాన్ పరిస్థితులు ఇంకా దిగజారతాయంటున్న అమెరికా.. ఆ దేశానికి మూడువేల మంది యూఎస్ బలగాలు..
ఆఫ్ఘనిస్థాన్‌లో భద్రతా బలగాలకు, తాలిబన్లకు మధ్య గొడవలు రాబోయే 30 రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని అమెరికా అంచనా వేస్తోంది. దీంతో తమ పౌరులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు చర్యలు ప్రారంభించింది.
![Talibans: ఆఫ్ఘనిస్థాన్ పరిస్థితులు ఇంకా దిగజారతాయంటున్న అమెరికా.. ఆ దేశానికి మూడువేల మంది యూఎస్ బలగాలు.. kabul Could Fall In 30 Days, US Sends 3,000 Troops To Afghanistan For Evacuations As Taliban Take Key Cities Talibans: ఆఫ్ఘనిస్థాన్ పరిస్థితులు ఇంకా దిగజారతాయంటున్న అమెరికా.. ఆ దేశానికి మూడువేల మంది యూఎస్ బలగాలు..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/13/059bfcedf90c4322c3b26819435a0796_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఆఫ్ఘనిస్థాన్‌లో గత వారం రోజుల నుంచి తాలిబన్ల ఆగడాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆ దేశంలోని పలు నగరాలను ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు.. తాజాగా కాందహార్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. దేశాన్ని కాపాడుకునేందుకు అక్కడి ప్రభుత్వం యత్నాలు చేస్తున్నా.. తాలిబన్లు స్పందించడం లేదు. ప్రతిగా అమాయకులపై దాడులకు తెగబడుతున్నారు. ఫలితంగా ఆఫ్ఘనిస్థాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్న తమ పౌరులు, సిబ్బందిని రక్షించుకునేందుకు అమెరికా సిద్ధమైంది.
రాబోయే 30 రోజుల్లో ఇంకా ఘోరం..
ఆఫ్ఘనిస్థాన్‌లో భద్రతా బలగాలకు, తాలిబన్లకు మధ్య జరుగుతోన్న గొడవలు రాబోయే 30 రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని అమెరికా అంచనా వేస్తోంది. దీంతో అక్కడ ఉన్న తమ పౌరులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగా కాబూల్‌లోని అమెరికా రాయబార కార్యాలయం నుంచి సిబ్బందిని తరలించేందుకు 3000 మంది బలగాలను పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు న్యూయర్క్ టైమ్ తన నివేదికలో వెల్లడించింది. తాలిబన్ల ఆక్రమణలు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే నెలలో అఫ్గాన్‌లో ప్రభుత్వం కూలిపోతుందని.. రాబోయే నెల రోజుల్లో అక్కడి పరిస్థితులు మరింత దిగజారతాయని అమెరికా అంచనా వేస్తోందని ఈ నివేదిక పేర్కొంది.
అఫ్గాన్ పరిస్థితులపై చర్చ..
అఫ్గానిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితుల గురించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. జాతీయ భద్రతా సలహాదారులతో సుదీర్ఘ చర్చలు జరిపారు. అమెరికాతో కలిసి పనిచేస్తోన్న అఫ్గాన్ వాసులను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వేగవంతమైన విమానాలను పంపి అక్కడ ఉన్న అమెరికావాసులను సురక్షితంగా దేశానికి తీసుకురావాలని ఆదేశించారు. అలాగే ప్రత్యేక వలస వీసాల దరఖాస్తులను పరిశీలించాలని తెలిపారు.
The US is sending 3,000 troops back to Afghanistan to begin evacuations. With the Taliban sweeping across the country, US officials say Kabul could fall in 30 days: US media
— ANI (@ANI) August 13, 2021
అమెరికన్ల భద్రతే ముఖ్యం..
ఇదే విషయానికి సంబంధించి అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ స్పందించారు. భద్రతా పరిస్థితుల నేపథ్యంలో కాబూల్‌లో ఉన్న అమెరికన్లను వెనక్కు వచ్చేయమని సూచించినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో అప్గాన్‌లో ఉన్న దౌత్యపరమైన సంబంధాలను కూడా తగ్గించే యోచనలో ఉన్నామని పేర్కొన్నారు. రక్షణ చర్యల్లో భాగంగా.. హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రక్షణ శాఖ అదనపు సిబ్బందిని కేటాయించిందని చెప్పారు.
కాబూల్‌లో ఉన్న అమెరికన్ల భద్రత గురించి అక్కడి అమెరికన్ ఎంబసీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని ప్రైస్ తెలిపారు. కాబూల్ నుంచి వెళ్లిపోవాలని అక్కడి వారికి ఇప్పటికే సూచనలు ఇచ్చినట్లు గుర్తు చేశారు. తమ రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న వారిని కాపాడుకునేందుకు చాలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. అక్కడ భద్రతా పరిస్థితిని ప్రతిరోజూ అంచనా వేస్తున్నామని.. ఇది చాలా సవాళ్లతో కూడుకున్న విషయమని అన్నారు. అయితే తమ రాయబార కార్యాలయం మాత్రం ఎప్పటికే తెరిచే ఉంటుందని స్పష్టం చేశారు.
అఫ్గాన్ అధ్యక్షుడికి ఫోన్..
అంతకుముందు అమెరికా అఫ్గాన్‌లో ఉంటున్న తమ వాసులకు కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. అఫ్గానిస్తాన్‌లో ఉన్న అమెరికన్లు తక్షణమే తమకు అందుబాటులో ఉన్న విమానాల ద్వారా అమెరికాకు వెళ్లిపోవాలని తెలిపింది. ఇక ఇదే విషయానికి సంబంధించి యూఎస్ విదేశాంగ కార్యదర్శి టోని బ్లింకెన్, కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్.. అఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనితో ఫోన్‌లో మాట్లాడారని పీటీఐ వెల్లడించింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)