ఇజ్రాయేల్ ప్రజలకు నెతన్యాహు నచ్చడం లేదట, యుద్ధమే కారణం!
PM Netanyahu: బెంజిమన్ నెతన్యాహుపై ఇజ్రాయేల్‌లో వ్యతిరేకత పెరుగుతోంది.
PM Benjamin Netanyahu:
నెతన్యాహుపై వ్యతిరేకత..
హమాస్‌తో యుద్ధం చేస్తున్న (Israel Hamas War) క్రమంలో ఇజ్రాయేల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు (Benjamin Netanyahu)పై తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది. సొంత దేశంలోనే ఆయనకు మద్దతు లభించడం లేదని కొన్ని రిపోర్ట్‌లు తేల్చి చెబుతున్నాయి. అందుకు కొన్ని ఉదాహరణలనూ సాక్ష్యంగా చూపిస్తున్నాయి. నెతన్యాహు కేబినెట్‌లోని మంత్రులు ఎక్కడికి వెళ్లినా వాళ్లపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరామర్శించడానికి వచ్చిన మంత్రులను హాస్పిటల్ గేట్ వద్దే అడ్డుకుంటున్నారు. తమను యుద్ధ వాతావరణంలోకి తోసేసిందని ప్రభుత్వంపై మండి పడుతున్నారు. అనవసరంగా గాజాలో అశాంతికి కారణమైందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని నివేదికలు చెబుతున్న దాన్ని ప్రకారం చూస్తే...నెతన్యాహు పొలిటికల్ కెరీర్‌లో ఎప్పుడూ లేనంతగా వ్యతిరేకత ఎదుర్తొంటున్నారు. వాళ్ల అసహనానికి మరో కారణం కూడా ఉంది. ఇజ్రాయేల్‌కి ఇంత మిలిటరీ పవర్ ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నారన్న కారణమొకటైతే...ఇంటిలిజెన్స్ ఫెయిల్యూర్ మరో కారణం. కొంత మంది నిఘా వర్గాలపైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తరపున చాలా మంది వాలంటీర్లు రంగంలోకి దిగి సహాయక చర్యలు కొనసాగిస్తున్నప్పటికీ..నెతన్యాహుపై కోపం మాత్రం తగ్గడం లేదు. కచ్చితంగా ఇంటిలిజెన్స్ ఫెయిల్యూర్‌ని ప్రభుత్వం అంగీకరించాలని, అవసమరైన మార్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు సాధారణ పౌరులు.
చాలా రోజులుగా అసహనం..
నిజానికి ఈ దాడులు జరగకముందు నుంచే నెతన్యాహు ప్రజల విశ్వాసం కోల్పోతూ వచ్చారు. దేశంలోని న్యాయవ్యవస్థపై పూర్తి స్థాయిలో ప్రభుత్వానిదే ఆజమాయిషీ ఉండేలా మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించుకున్నారు. చెప్పాలంటే...అక్కడి సుప్రీంకోర్టునీ అధీనంలోకి తీసుకురావాలని ప్రయత్నించారు. దీనిపైనా వేలాది మంది పౌరులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహించారు. ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నారంటూ నినదించారు. అప్పటి నుంచి ఇజ్రాయేల్ పేరు అంతర్జాతీయంగా వినబడుతోంది. ఆ తరవాత ఉన్నట్టుండి హమాస్ దాడులు మొదలయ్యాయి. ఈ రెండు ఘటనలతో బెంజిమన్ నెతన్యాహుపై ప్రజల్లో ఉన్న విశ్వాసం కొంత సన్నగిల్లింది.
హమాస్ దాడులపై (Israel Hamas Attack) తీవ్రంగా స్పందించారు ఇజ్రాయేల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు (Benjamin Netanyahu). గాజాపై చేస్తున్న దాడులు కేవలం "ఆరంభం" మాత్రమే అని స్పష్టం చేశారు. మున్ముందు దాడుల తీవ్రత మరింత పెరుగుతుందని హెచ్చరించారు. వేలాది మంది ఇజ్రాయేల్ బలగాలు గాజాను చుట్టుముట్టాయి. సొరంగాల్లో నక్కి ఉన్న హమాస్ ఉగ్రవాదులపై దాడులు చేస్తున్నాయి. బంకర్లనే లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే నెతన్యాహు ఓ స్పెషల్ వీడియో విడుదల చేశారు. రానున్న రోజుల్లో శత్రువుల మరింత భారీ మూల్యం చెల్లించుకుంటారని తేల్చి చెప్పారు. హమాస్‌ని పూర్తిగా అంతం చేస్తామని శపథం చేశారు నెతన్యాహు.
"గాజాలో ప్రస్తుతం జరుగుతున్న దాడులు కేవలం ఆరంభం మాత్రమే. మున్ముందు తీవ్రత పెంచుతాం. శత్రువులు మరింత భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఏం జరగనుందో ఇప్పుడే చెప్పలేను. కానీ దాడులు పెరుగుతాయన్నది మాత్రం నిజం. హమాస్ దురాగతాలను అసలు క్షమించం. జూదులపై జరిగిన ఈ దాడులను ప్రపంచం ఎప్పటికీ మరిచిపోదు. మా శక్తి సామర్థ్యాలకు మించి మరీ వాళ్లపై పోరాడేందుకు సిద్ధంగానే ఉన్నాం"
- బెంజిమన్ నెతన్యాహు, ఇజ్రాయేల్ ప్రధాని
Also Read: మీరు దాడులు ఆపితే మేం బందీల్ని వదిలేస్తాం, ఇజ్రాయేల్‌కి హమాస్ అల్టిమేటం