Indian Navy: బ్రిటన్ నౌకపై హౌతీల మిస్సైల్ ఎటాక్, తక్షణమే స్పందించి భారత నేవీ సాయం
INS Visakhapatnam: ఎర్ర సముద్రంలో కొనసాగుతోన్న పోరుతో ఎట్టకేలకు భారత నావికాదళం అప్రమత్తమైంది. హౌతీల దాడికి గురైన బ్రిటన్ నాకకు ఐఎన్ఎస్ విశాఖపట్నం సాయం చేసింది.
Houthi Militia: న్యూఢిల్లీ: ఎర్ర సముద్రంలో కొనసాగుతోన్న పోరుతో ఎట్టకేలకు భారత నావికాదళం (Indian Navy) అప్రమత్తమైంది. జనవరి 26 రాత్రి MV మార్లిన్ లువాండా నుంచి సాయం కావాలన్న కాల్ కు భారత నేవీ స్పందించింది. గల్ఫ్ ఆఫ్ ఏడెన్ మీదుగా వెళ్తున్న బ్రిటన్ వాణిజ్య నౌక మార్లిన్ లువాండాపై యెమన్ కు చెందిన హౌతీ మిలిటెంట్లు మిస్సైల్ దాడికి పాల్పడ్డారు. మార్లిన్ లువాండా నౌక సమీపంలోని నౌకలకు సహాయం కోసం సందేశం పంపించింది. అందుకు స్పందించిన భారత నేవీకి చెందిన గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ - INS విశాఖపట్నంను అక్కడికి పంపి సహాయం చేసింది.
#IndianNavy's Guided missile destroyer, #INSVisakhapatnam, deployed in the #GulfofAden responded to a distress call from MV #MarlinLuanda on the night of #26Jan 24.
— SpokespersonNavy (@indiannavy) January 27, 2024
The fire fighting efforts onboard the distressed Merchant Vessel is being augmented by the NBCD team along with… pic.twitter.com/meocASF2Lo
గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో క్షిపణి దాడికి గురైన మార్లిన్ లువాండాలో మంటల్ని ఐఎన్ఎస్ విశాఖపట్నం ఆర్పివేసిందని భారత నావికాదళం శనివారం తెలిపింది. బ్రిటన్ ఆయిల్ ట్యాంకర్ మార్లిన్ లువాండాలో 22 మంది భారతీయులు, ఒక బంగ్లాదేశ్ స్టాఫ్ ఉన్నారని సమాచారం. INS విశాఖపట్నం NBCD బృందం, అగ్నిమాపక పరికరాలతో పాటుగా, నౌకలో చిక్కుకున్న సిబ్బందికి సహాయం చేసినట్లు ట్విట్టర్ లో వెల్లడించారు.
భారతీయ నావికాదళం పటిష్టంగా ఉందని, వ్యాపార నౌకలను రక్షించడానికి సైతం వెనుకాడదని ఈ ఘటన నిరూపించింది. సముద్రంలో రక్షణ కోసం తమ వంతు పాత్రను ఇండియన్ నేవీ పోషిస్తోంది. అయితే బ్రిటన్ వ్యాపార నౌకపై దాడికి పాల్పడింది తామేనని యెమెన్ హౌతీ రెబెల్స్ ప్రకటించుకున్నారు. ది గార్డియన్ ప్రకారం.. గల్ఫ్ ఆఫ్ అడెన్‌లో బ్రిటన్ కు చెందిన ఆయిల్ ట్యాంకర్ మార్లిన్ లువాండాను లక్ష్యంగా చేసుకుని హౌతీ తిరుగుబాటుదారులు దాడికి పాల్పడ్డారు. బ్రిటన్ నౌక ఎమర్జెన్సీ మెస్సేజ్ తో అలర్ట్ అయిన భారత నేవీ తక్షణమే రంగంలోకి దికి మంటల్ని ఆర్పివేయడంతో పాటు అందులో ఉన్న పౌరులను రక్షించడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Houthis Strike M/V Marlin Luanda Operating in the Gulf of Aden
— U.S. Central Command (@CENTCOM) January 27, 2024
On Jan. 26, at approximately 7:45 p.m. (Sanaa time), Iranian-backed Houthi terrorists fired one anti-ship ballistic missile from Houthi-controlled areas of Yemen and struck the Marshall Islands-flagged oil tanker M/V… pic.twitter.com/Mw3Mg138cy
బ్రిటన్ వాణిజ్య నౌకపై నావికా క్షిపణులతో నేరుగా దాడి జరిగిందని హౌతీ ఆర్మిక ప్రతినిధి యాహ్యా సరియా ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. MV మార్లిన్ లువాండా నౌకపై హౌతీల దాడిని అమెరికా కూడా నిర్ధారించింది. జనవరి 26న రాత్రి 7:45 గంటలకు ఇరాన్ కు మద్దతుగా హౌతీ మిలిటెంట్లు యాంటీ-షిప్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు. USS కార్నీ (DDG 64)తో పాటు ఇతర నౌకలు ఈ ఘటనపై స్పందించి, సాయం చేయడానికి బ్రిటన్ నౌక మార్లిన్ లువాండ్ వద్దకు చేరుకున్నాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఎర్ర సముద్రం, అరేబియా సముద్రంలో వ్యాపార నౌకలపై జరిగిన తాజా దాడి ఇది. మరోవైపు ఇండియన్ నేవీ ఇలాంటి సమస్యాత్మక ప్రాంతంలో నిఘా పెంచింది. భారత్ కు వచ్చే వాణిజ్య నౌకలపై దాడులు జరుగుతుండటంతో దాదాపు 10 యుద్ధనౌకలతో కూడిన బృందాలను నేవీ మోహరించింది. కాగా, గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్- హమాస్ వివాదం ప్రారంభమైన తర్వాత హౌతీ తిరుగుబాటుదాడులు డ్రోన్, క్షిపణి దాడులతో విధ్వంసానికి పాల్పడుతున్నారు. ఎర్ర సముద్రంలో వాణిజ్య రవాణాను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. కొన్ని కంపెనీలు ఈ సముద్రంలో ఆయిల్ రవాణాను సైతం తాత్కాలికంగా నిలిపివేశాయి. సముద్రంలో రవాణాకు ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషణ కొనసాగుతోందని తెలిసిందే.