క్యాన్సర్.. ప్రపంచ ఉమ్మడి శత్రువు.. ఏం చేయాలి.. ఎలా ఎదుర్కోవాలి?
Cancer: ప్రపంచ దేశాలకు ఉమ్మడి శత్రువుగా క్యాన్సర్ ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెల్లడించింది.
World Common Enemy Cancer: ప్రపంచ దేశాల(World countries)కు ఉమ్మడి శత్రువు ఏదీ అంటే.. నిన్న మొన్నటి వరకు ఎక్కువగా వినిపించిన మాట ఉగ్రవాదం(Terrorism). అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు ప్రపంచ దేశాలు ఏకతాటిపైకి వచ్చాయి. ఉగ్రవాదులను అప్పగించడం.. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చే సంస్థలను ఏరేయడం.. ఆయుధాలు అందకుండా చేయడం ఇలా అనేక రూపాల్లో ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఇలానే ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఉమ్మడి శత్రువుగా.. పరిణమించిన మహమ్మారి క్యాన్సర్. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ఏడాదికి 9.6 మిలియన్ల(96 లక్షలు) మంది ప్రజలు క్యాన్సర్‌తో మరణిస్తున్నారు.
క్యాన్సర్‌లో పలు రకాలు..
ఈ క్యాన్సర్(Cancer) వివిధ రూపాల్లో ఉండడం గమనార్హం. పురుషుల్లో(Men) నోటి(Mouth) (లిప్, ఓరల్ క్యావిటీ) క్యాన్సర్(మొత్తం క్యాన్సర్ కేసుల్లో 15.3%), ఊపిరితిత్తుల క్యాన్సర్ (8.5%) ఉండగా, మహిళల్లో(Women) రొమ్ము (27%), గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులు(18%) ఎక్కువగా నమోదవుతున్నాయి. వీటి వల్ల ప్రపంచ వ్యాప్తంగా మరణాలు కూడా పెరుగుతున్నాయి. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు చెందిన క్యాన్సర్ విభాగం ‘ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రిసెర్చ్ ఆన్ క్యాన్సర్ (ఐఏఆర్‌సీ) వెల్లడించింది.
అసలేంటీ క్యాన్సర్?
అసలు క్యాన్సర్ అంటే ఏంటి? అనేది తరచుగా తలెత్తే సందేహం. తెలుగులో దీనిని `రాచపుండు` అని పిలుస్తారు. శరీరంలోని సాధారణ కణాల సమూహంలో మార్పులు వల్ల అనియంత్రిత, అసాధారణ పెరుగుదలకు దారితీసినప్పుడు సంభవించే ఒక వ్యాధినే క్యాన్సర్ గా పేర్కొంటారు. శరీరంలో ఇది కణితి వంటి భాగాన్ని ఏర్పాటు చేస్తుంది. చికిత్స చేయకుండా వదిలేస్తే కణితులు పెరుగుతాయి. శరీరంలోని ఇతర భాగాలకు వ్యాప్తి చెందుతాయి. జీర్ణ, నాడీ, ప్రసరణ వ్యవస్థలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. చివరకు ఇది వ్యక్తుల మరణాలకు కూడా కారణమవుతుంది.
ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం..
క్యాన్సర్ అనేది ఏ ఒక్క దేశానికో పరిమితం కాలేదు. ముఖ్యంగా దక్షిణాఫ్రికన్(South affrican countries) దేశాలు క్యాన్సర్ రోగుల విషయంలో ముందున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. తర్వాత.. స్థానం అగ్రరాజ్యం అమెరికా(America), బ్రిటన్(Briton), రష్యాలదేనని పేర్కొంది. ఇక, క్యాన్సర్ రోగులు పెరుగుతున్న దేశాల్లో భారత్ ముందుండడం గమనార్హం. మన దేశంలో 2022లో 20 లక్షల కేసులు నమోదు కావడం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం కొత్త క్యాన్సర్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉండడం మరింత విషాదం. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కేసులను గమనిస్తే.. 1990లో 81 లక్షలు, 2000లో కోటి, 2008లో కోటీ 24 లక్షలు, 2012లో కోటీ 41 లక్షల కేసులు నమోదయ్యాయి. అంటే.. ఈక్యాన్సర్లు ఎంత వేగంగా అబివృద్ది చెందుతున్నాయనేది తెలుస్తోంది.
మన దేశంలో పరిస్థితి ఇదీ..
దేశంలో క్యాన్సర్ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. ఒక్క 2022లోనే 14 లక్షల క్యాన్సర్ కేసులు.. 9.1 లక్షల క్యాన్సర్ మరణాలు నమోదయ్యాయి. 75 ఏళ్లలోపు వారు క్యాన్సర్ బారిన పడే ముప్పు 10.6 శాతం, ఆ మహమ్మారి కారణంగా మరణించే ముప్పు 7.2 శాతంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అంతర్జాతీయంగా ఈ రెండింటి సగటు వరుసగా 20 శాతం, 9.6 శాతం ఉన్నాయని ఐఏఆర్‌సీ వివరించింది. అంటే.. మన దేశంలోనే ఎక్కువగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 2కోట్ల క్యాన్సర్ కేసులు, 97 లక్షల మరణాలు నమోదు అవుతున్నాయని వెల్లడించింది. కాగా, క్యాన్సర్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సాంకేతిక ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నట్టు కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్ ఇటీవల పార్లమెంటులో వెల్లడించారు. అదేవిధంగా ఇటీవల ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్‌లోనూ గర్భాశయ ముఖ ద్వార కేన్సర్‌కు సంబంధించి ముందస్తు నివారణగా వ్యాక్సిన్లను దేశవ్యాప్తంగా విరివిగా పంపిణీ చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా చెప్పారు.
ఎలా నివారించాలి..?
క్యాన్సర్లను ఎలా నివారించాలనేది ప్రశ్న. వీటిని ముందస్తుగా గుర్తించడం చాలా అవసరం. అలాగే చికిత్స కోసం తగిన వ్యూహాలను అమలుచేయడం ద్వారా ప్రతి సంవత్సరం మిలియన్ల మంది జీవితాలను రక్షించవచ్చు. 21వ శతాబ్దంలో క్యాన్సర్ అవగాహన పెరుగుతోంది. రోగ నిర్ధారణ, చికిత్సలో అనేక పురోగతులు ఉన్నప్పటికీ -వ్యాధి క్షీణతకు దోహదపడే కారకాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. నివారణ, గుర్తింపును, చికిత్సను ప్రోత్సహించేందుకు ప్రతి ఏటా ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం నిర్వహిస్తున్నారు.