(Source: ECI/ABP News/ABP Majha)
పశువైద్యుడు గుర్తించలేకపోయాడు- చాట్‌జీపీటీ పెంపుడు కుక్క ప్రాణాలు కాపాడింది
పశువైద్యులు కూడా నిర్ధారించలేని అనారోగ్యాన్ని గుర్తించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ ChatGPT తన కుక్క ప్రాణాన్ని కాపాడిందని కూపర్ అనే వ్యక్తి ట్విట్టర్లో పేర్కొన్నాడు.
ChatGPT: పశువైద్యులు కూడా నిర్ధారించలేని రక్త పరిస్థితిని నిర్ధారించడం ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ ChatGPT తన పెంపుడు కుక్క ప్రాణాన్ని కాపాడిందని కూపర్ (@peakcooper) అనే ట్విట్టర్ వినియోగదారు పేర్కొన్నారు.
సాసీ అనే తన పెంపుడు కుక్కకు టిక్ ద్వారా వచ్చే వ్యాధి ఉన్నట్టు నిర్ధారణ అయిందని కూపర్ తెలిపాడు. ఈ నేపథ్యంలో తీవ్రమైన రక్తహీనత ఉన్నప్పటికీ పశువైద్యుడు చికిత్సను ప్రారంభించాడని, సాసీ పరిస్థితి మెరుగుపడినట్టు అనిపించిందని పేర్కొన్నాడు. అయితే, కొన్ని రోజుల తర్వాత పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చిందని, వైద్యుడు సూచించిన చికిత్స అందించినప్పటికీ తన పెంపుడు కుక్కలో అనారోగ్య లక్షణాలు తీవ్రమయ్యాయని వెల్లడించాడు.
సాసీ చిగుళ్ళు చాలా లేతగా ఉన్నాయని గమనించి వెంటనే మళ్లీ పశువైద్యుడి దగ్గరకు తీసుకువెళ్లామని కూపర్ చెప్పాడు. ఈ సందర్భంగా రక్త పరీక్ష నిర్వహించగా, మరింత తీవ్రమైన రక్తహీనత ఉన్నట్టు వెల్లడైందని.. సాసీని మొదటిసారి తీసుకువచ్చినప్పటి కంటే పరిస్థితి అధ్వాన్నంగా ఉందని తెలిపాడు. పశువైద్యుడు టిక్-బర్న్ వ్యాధులతో సంబంధం కలిగిన ఇతర ఇన్ఫెక్షన్‌లను నిర్థారించేందుకు మరిన్ని పరీక్షలను నిర్వహించాడని, అయితే ఫలితం నెగటివ్‌గా వచ్చిందని కూపర్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.
పశువైద్యుడు తన పెంపుడు కుక్క ఆరోగ్య పరిస్థితిని సరిగా నిర్థారించలేకపోయాడని.. అయితే అనారోగ్యంతో ఉన్న కుక్క లక్షణాలను టైప్ చేసినప్పుడు, అర్హత కలిగిన వైద్యులు కూడా చేయలేని పనిని చాట్‌జిపిటి చేసిందని తెలిపాడు. కుక్క ఆరోగ్య పరిస్థితిని నిర్ధారించిందని వెల్లడించాడు. సాసీ రక్త ప్రసరణ రోగ లక్షణాలు.. రోగనిరోధక-మధ్యవర్తిత్వ హీమోలిటిక్ అనీమియా (IMHA)ని సూచిస్తాయని చాట్‌జీపీటీ వివరించింది.
చాట్‌జీపీటీ అందించిన సమాచారంతో, కూపర్ సాసీ చికిత్స కోసం మరో పశువైద్యుడిని సంప్రదించాడు. ఆయన దాని వ్యాధికి తగిన చికిత్స చేయడం ప్రారంభించాడు. సాసీ దాదాపు పూర్తిగా కోలుకుందని రోగ నిర్ధారణ, చికిత్స వివరాలు అందించిన చాట్‌జీపీటీకి ధన్యవాదాలు అంటూ కూపర్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. కాగా.. కూపర్ చేసిన ట్వీట్ తక్కువ సమయంలోనే ఎనిమిది మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్ సాధించి వైరల్‌గా మారింది. పెంపుడు జంతువు యజమానికి చాట్‌జీపీటీ ఎలా సహాయం చేసిందో తెలుసుకుని చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే OpenAI ఆధారిత ChatGPT ఇప్పటికే కొన్ని కష్టతరమైన పరీక్షలలో ఉత్తీర్ణత సాధించినందున ఈ ఘటన ఆశ్చర్యం కలిగించదని మరికొందరు పేర్కొంటున్నారు.