Suella Braverman: బ్రిటన్ రాజకీయాల్లో అరుదైన ఘటన, మాజీ ప్రధానిని కేబినెట్‌లోకి తీసుకున్న రిషి సునాక్
Suella Braverman: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్‌లో సీనియర్ అయిన సుయెల్లా బ్రేవర్మన్‌ను దేశ హోం మంత్రి పదవి నుంచి తొలగించారు.
Suella Braverman: బ్రిటన్ (Britain) ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak) కీలక నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్‌లో సీనియర్ అయిన సుయెల్లా బ్రేవర్మన్ (Suella Braverman)ను దేశ హోం మంత్రి పదవి నుంచి తొలగించారు. ఇటీల లండన్‌లో పాలస్తీనా మద్దతుదారులు (Palestine Supporters) భారీ ర్యాలీ చేపట్టారు. నిరసన కారులను నియంత్రించడంలో పోలీసులు విఫలం అయ్యారని సుయెల్లా బ్రేవర్మన్ విమర్శలు చేశారు. ఇతరులను రెచ్చగొట్టే విధంగా కథనాన్ని ప్రచురించారని ఆమెపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
లండన్ వీధుల్లో పాలస్తీనాకు మద్దతుగా ఆందోళన
సుయెల్లా కథనంతోనే పాలస్తీనా మద్దతుదారులు పెద్ద ఎత్తున లండన్ వీధుల్లోకి వచ్చారని, ఆమెను పదవి నుంచి తొలగించాలని పెద్ద ఎత్తున డిమాండ్‌లు పెరిగాయి. దీంతో బ్రేవర్మన్‌ను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ సోమవారం ప్రధాని సునాక్ నిర్ణయం తీసుకున్నారు. గతంలో మాజీ ప్రధాని లిజ్ ట్రస్ మంత్రివర్గంలో సుయెల్లా పనిచేశారు. అప్పట్లో లిజ్ ట్రస్ ప్రభుత్వం గందరగోళ సమయాన్ని ఎదుర్కొంటోందని విమర్శలు చేశారు.
తరచూ వివాదాలు
వలసదారులపై ఆమె చేసిన విమర్శలు తీవ్ర దుమారం రేపాయి. అలాగే మైగ్రేషన్ అంశంపై అధికారిక పత్రాలకు సంబంధించి నిబంధనలను ఉల్లఘించినందుకు బాధ్యత వహిస్తూ.. ఆమె తన పదవికి రాజీనామా చేశారు. రిషి సునాక్ ప్రధానిగా అయ్యాక ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇంటీరియర్ మినిస్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. అయితే తాజాగా ఆమె ప్రచురించిన కథనం వివాదాస్పదం అయ్యింది. దీంతో ఆమె మరోసారి పదవి కోల్పోయారు.
మాజీ ప్రధానికి విదేశాంగ శాఖ
సుయెల్లా బ్రేవర్మన్ స్థానంలో ప్రస్తుతం విదేశాంగ మంత్రిగా పని చేస్తున్న జేమ్స్ క్లేవర్లీ (James Cleverly)కి హోం మంత్రిత్వ బాధ్యతలను రిషి సునాక్ అప్పగించారు. విదేశాంగ శాఖ బాధ్యతలను మాజీ ప్రధాని డేవిడ్ కామెరాన్ (David Cameron)కు కేటాయించారు. ప్రస్తుతం ఆయన ఏ చట్టసభకు ప్రాతినిధ్యం వహించడం లేదు. దీంతో ఆయన్ను ఎగువ సభకు నామినేట్ చేయనున్నారు. ప్రధాని పదవికి రాజీనామా చేసిన దాదాపు ఏడేళ్ల తర్వాత, కామెరాన్ మళ్లీ యూకే ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టబోతున్నారు.
ఇదీ కామెరూన్ చరిత్ర
డేవిడ్ కామెరాన్ 2010 నుంచి 2016 వరకు బ్రిటన్ ప్రధానిగా పనిచేశారు. 2016లో ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ వైదొలిగే అంశంపై మూడు రెఫరండమ్‌లు తీసుకొచ్చి ఓటింగ్ నిర్వహించారు. ప్రజలు బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటేశారు. కానీ కామెరూన్ మాత్రం బ్రిటన్ ఈయూలోనే కొనసాగాలని ప్రచారం చేశారు. కానీ మెజారిటీ ప్రజలు దాన్ని వ్యతిరేకించారు. దీంతో 2016 జూన్‌లో కామెరాన్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు.
ఇజ్రాయెల్‌కు మద్దతు తెలిపిన రిషి సునాక్
ఇజ్రాయెల్, హామాస్ యుద్ధం నేపథ్యంలో రిషి సునాక్ ఇజ్రాయెల్‌కు మద్దతు తెలిపారు. పాలస్తీనా ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు, సెల్ఫ్ డిఫెన్స్ చేసుకునే హక్కు ఇజ్రాయేల్‌కి ఉందని తేల్చి చెప్పారు. ఈ ఉగ్రదాడుల్లో చిక్కుకున్న బ్రిటీష్ పౌరులను సురక్షితంగా ఉంచడమే కాకుండా వాళ్లకు కావాల్సిన సాయం అందించినందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వానికి సునాక్ థాంక్స్ చెప్పారు.
ఈ సంక్షోభ సమయంలో మానవతా సాయం అందించాల్సిన అవసరాన్ని గుర్తించామని రిషి సునాక్ వెల్లడించారు. హమాస్ ఉగ్రవాదుల చేతుల్లో చాలా మంది బందీలయ్యారు. బాధితుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఉగ్రవాదులు చిన్నారులనూ ఎత్తుకెళ్లారని, తల్లిదండ్రులకు ఇంతకన్నా నరకం మరోటి ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు.