Johnny Depp Defamation Case: మాజీ భార్యపై పరువు నష్టం కేసు, గెలిచిన హీరో జానీ డెప్ - కోర్టు కీలక ఆదేశాలు
Amber Heard Johnny Defamation: కోర్టు తీర్పుపై అంబర్ హర్డ్ నిరాశ వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం మహిళలకు ఎదురుదెబ్బ లాంటిదని అన్నారు. హర్డ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కోర్టు నిర్ణయంపై తన స్పందనను రాశారు.
Amber Heard defamed Johnny Depp: ప్రముఖ హాలీవుడ్ నటుడు జానీ డెప్ తన మాజీ భార్యపై వేసిన పరువు నష్టం దావా కేసులో విజయం సాధించారు. జానీ డెప్ మాజీ భార్య, నటి అంబర్ హర్డ్‌పై పరువు నష్టం దావా కేసులో డెప్‌కు అనుకూలంగా బుధవారం (జూన్ 1) కోర్టు తీర్పు చెప్పింది. వర్జీనియాలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం జానీ డెప్‌కు 15 మిలియన్ డాలర్ల (రూ.1,16,33,46,750) నష్ట పరిహారం చెల్లించాలని, హర్డ్ 2 మిలియన్లు అందుకోవాలని పేర్కొంది.
58 ఏళ్ల 'పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్' సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన జానీ డెప్ 2018 డిసెంబర్ లో అమెరికాలోని ఫెయిర్‌ఫాక్స్ కౌంటీ సర్క్యూట్ కోర్టులో తన మాజీ భార్యపై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. వాషింగ్టన్ పోస్ట్ పత్రికలో అంబర్ హర్డ్ రాసిన కథనానికి వ్యతిరేకంగా ఆయన దావా వేశారు. అదే సమయంలో 36 ఏళ్ల నటి అంబర్ హర్డ్.. తన మాజీ భర్త జానీ డెప్ ఆరోపణలు బూటకమని పేర్కొంటూ 100 మిలియన్ డాలర్లకు దావా వేశారు.
తాజా తీర్పు జానీకి అనుకూలంగా రావడంతో తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో జానీ ఒక పోస్ట్ చేశారు. కోర్టు నాకు జీవితాన్ని తిరిగి ఇచ్చింది అని జానీ డెప్ రాశారు.
అంబర్ హర్డ్ నిరాశ
అదే సమయంలో, కోర్టు తీర్పుపై అంబర్ హర్డ్ నిరాశ వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం మహిళలకు ఎదురుదెబ్బ లాంటిదని అన్నారు. హర్డ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కోర్టు నిర్ణయంపై తన స్పందనను రాశారు. ‘‘ఈ రోజు నాకు బాధగా ఉంది. నేను మాటలలో వర్ణించలేను’’ అని రాశారు.
పెద్ద సంఖ్యలో అభిమానులు
తీర్పును వెలువరిస్తున్నప్పుడు, కోర్టు బయట పెద్ద సంఖ్యలో జానీ అభిమానులు గుమిగూడారు. తమ అభిమాన నటుడికి మద్దతుగా ప్రజలు తమ చేతుల్లో బ్యానర్లు పట్టుకొని నిలబడి ఉన్నారు. ‘‘ఈ రోజు ఏం తీర్పు వచ్చినా? జానీ, మీరు విజేత. ప్రపంచం మొత్తానికి నిజం తెలుసు.’’ అని బ్యానర్లపై రాసి ప్రదర్శించారు.
డెప్, హర్డ్ 2011లో 'ది రమ్ డైరీ' అనే సినిమా షూటింగ్ సమయంలో కలుసుకున్నారు. అలా జానీ డెప్, అంబర్ హర్డ్ పెళ్లి చేసుకున్న రెండు సంవత్సరాల తర్వాత మాత్రమే విడాకులు తీసుకున్నారు. హియర్డ్ - డెప్ 2015లో వివాహం చేసుకున్నారు. మే 2016లో హర్డ్.. డెప్ గృహ హింసకు పాల్పడ్డాడని ఆరోపించారు. ఆ తర్వాత ఈ జంట 2017లో విడాకులు తీసుకున్నారు. డెప్ బలవంతంగా సెక్స్, మాదకద్రవ్యాల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు చేశారు.. హర్డ్.