Republic Day 2025 : చరిత్రలో తొలిసారి - గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో భాగం కానున్న మహిళా అగ్నివీరులు
Republic Day 2025 : జనవరి 26, 2025న చారిత్రాత్మకంగా తొలిసారిగా 76వ గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో మహిళా అగ్నివీరులు భారత నావికాదళ బ్యాండ్‌లో భాగం కానున్నారు.

Republic Day 2025 : దేశవ్యాప్తంగా జరుపుకునే రిపబ్లిక్ డే వేడుకల కోసం భారత్ సిద్ధమవుతోంది. జనవరి 26న ఢిల్లీలో ఉ.10 గంటలకు ప్రారంభమయ్యే గణతంత్ర వేడుకల్లో ఈ సారి మరోసారి కేంద్ర ప్రభుత్వం మహిళా శక్తిని చాటనుంది. ఈ ఏడాది నిర్వహించే రిపబ్లిక్ డే పరేడ్ లో సైనిక శక్తిని చాటడంతో పాటు పలు సాంస్కృతిక ప్రదర్శనలు అలరించనున్నాయి. 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సిబ్బందితో మినీ ఇండియాకు ప్రాతినిథ్యం వహిస్తోన్న144మంది అధికారులు, సిబ్బంది నేవీ కవాతు బృందంలో భాగం కానున్నారు. ఇందులో పాల్గొనే వారి సగటు వయసు 25 సంవత్సరాలే కావడం గమనార్హం. వీరు 2 నెలల కఠోర శిక్షణ తర్వాత కవాతులో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉన్నారు. లెఫ్టినెంట్ కమాండర్ సాహిల్ అహ్లువాలియా నాయకత్వంలో.. క్రమశిక్షణ, వైవిధ్యం, అంకితభావాల సమ్మేళనాన్ని ప్రతిబింబిస్తూ ప్రదర్శన చేయనున్నారు.
నేవీ బ్యాండ్ స్పెషల్ అట్రాక్షన్
ఈ ఏడాది రిపబ్లిక్ పరేడ్‌లో ఓ చారిత్రాత్మక ఘట్టం చోటు చేసుకోనుంది. సంప్రదాయ అడ్డంకులను ఛేదిస్తూ.. నేవీ బ్యాండ్‌లో తొలిసారిగా అగ్నివీరులైన ఆరుగురు మహిళా సంగీత విద్వాంసులు భాగం కానున్నారు. 80 మంది సంగీతకారులతో కూడిన ఈ బృందం సామరస్యం, వృత్తి నైపుణ్యానికి ప్రతీకగా ప్రదర్శనలో పాల్గొననుంది.
#WATCH | Delhi: Indian Navy women Agniveers playing the tune 'Jai Jai Bharati' at the 76th Republic Day parade preview today. This is the first time ever that women would be part of the Navy band at the Republic Day parade pic.twitter.com/NddmSMp83G
— ANI (@ANI) January 22, 2025
నేవీ శక్తిని చూపే శకటం ప్రదర్శన
జనవరి 26, 2025న నిర్వహించే రిపబ్లిక్ పరేడ్ లో భారత నావికా దళం ప్రత్యేకమైన శకటాన్ని ప్రదర్శించనుంది. మూడు ప్రసిద్ధ యుద్ద నౌకలైన.. యుద్ధనౌక ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, జలాంతర్గామి ఐఎన్ఎస్ వాఘ్‌షీర్‌లను ప్రదర్శించనుంది. అదే సమయంలో నేవీకి చెందిన మిక్స్‌డ్ కవాతు బృందం, బ్యాండ్ కూడా కవాతులో పాల్గొంటాయని అధికారులు తెలిపారు.
గణతంత్ర దినోత్సవ వేడుకలకు రిహార్సల్స్
రాబోయే గణతంత్ర దినోత్సవ వేడుకలకు సన్నాహాల్లో భాగంగా ఈ రోజు ఫుల్ డ్రెస్ రిహార్సల్ ప్రారంభమైంది. ఇకపోతే ఈ సంవత్సరం పరేడ్ కు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కర్తవ్య మార్గ్ లో జరిగే కవాతులో భారత సాయుధ దళాలతో పాటు ఇండోనేషియా నుంచి 160 మంది కవాతు బృందం, 190 మంది సభ్యుల బ్యాండ్ బృందం పాల్గొంటుందని రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు.
Also Read : Bill Gates : నాలుగో తరగతిలో బిల్ గేట్స్ రాక్స్ - టీచర్ షాక్స్ - ఆవు మూత్రపిండాలు తీసుకెళ్లాడట మరి !





















