Duvvada Srinivas : దువ్వాడ శ్రీనివాస్, స్నేహితురాలు మాధురి చెప్పిన అడల్టరీ అంటే ఏంటీ? చట్టాలు ఏం చెబుతున్నాయి?
What is Adultery : సుప్రీంకోర్టు తమకు అడల్టరీని హక్కుగా ఇచ్చిందని అందుకే కలిసి ఉంటున్నామని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, అతని స్నేహితురాలు దివ్వెల మాధురి చెబుతున్నారు. అడల్టరీ అంటే ఏమిటి ?
Is adultery legal in India : వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను కుటుంబ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. మాధురి అనే వ్యక్తితో దువ్వాడ శ్రీను ఉంటూ తమను పట్టించుకోవడం లేదని భార్య కుమార్తెలు ఆరోపణలు చేశారు. వారి ఆరోపణలపై ప్రెస్ మీట్ పెట్టిన మాధురి చాలా హాట్ కామెంట్స్ చేశారు. దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి ఉంటానని చెప్పేశారు. ఇద్దరికీ పెళ్లి అయిందని వారికి విడాకులు ఇవ్వకుండా కలిసి ఉండటం ఎలా కుదురుతుందని మీడియా ప్రశ్నిస్తే ఆమె చెప్పిన సమాధానికి అందరి మైండ్ బ్లాంక్ అయింది. ఇద్దరం మంచి స్నేహితులమని, ఆయన తనకో గైడ్, ఫిలాసఫర్ అంటూ చెప్పుకొచ్చారు. సహజీవనం చేస్తారా అంటే... పెళ్లి కాని వాళ్లు చేస్తే సహజీవం అని అదే పెళ్లి అయిన వాళ్లు చేస్తే అడల్టరీ అంటూ చెప్పుకొచ్చారు.
దివ్వెల మాధురీ చెబుతున్న అడల్టరీ అంటే ఏమిటి ?
మాధురి చెప్పినప్పటి నుంచి అడల్టరీ అంటే ఏంటో అన్ని నెటిజన్లు గూగుల్ చేస్తున్నారు. అయితే దీనికి వేర్వేరు డిక్షనరీలు వేర్వేరు అర్థాలు చెబుతున్నప్పటికీ వివాహేతర సంబంధానికి రిలేటెడ్‌గానే ఉన్నాయి. పెళ్లైన మహిళ, పురుషుడు కలిసి ఉండటాన్నే అడల్ట్రీగా చెబుతున్నాయి. భాష ప్రకారం చూస్తే అడల్టరీని వివాహేతర బంధంగానే చెప్పవచ్చు.
అడల్టరీపై సుప్రీంకోర్టు ఏం చెప్పింది ?
వివాహితుడైన వ్యక్తి, వివాహం చేసుకున్న మరో మహిళతో శారీరక సంబంధం పెట్టుకోవడం అడల్టరీ.. అది శిక్షార్హమైన నేరం కాదని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. అయితే వివాహం రద్దు చేసుకోవడానికి మాత్రం దీన్ని కారణంగా చూపించవచ్చని తీర్పు చెప్పింది. ఇండియన్ పీనల్ కోడ్‌లోని అడల్టరీకి సంబంధించిన సెక్షన్ 497 రాజ్యాంగ విరుద్ధమని 2018 సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో స్పష్టం చేసింది. ధర్మాసనంలో అప్పటి చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్, ఏఎం ఖాన్‌విల్కర్, డీవై చంద్రచుద్, ఇందు మల్హోత్రాలు ఉన్నారు. సుప్రీంకోర్టు 2018లో ఈ తీర్పు చెప్పక ముందు వరకూ తన భార్యతో కాకుండా మరో వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం నేరం. అంటే అడల్టరీ అంతకు ముందు నేరం. తన భర్తకు మరో మహిళతో సంబంధం ఉందని భార్య కేసు పెడితే అతణ్ని ఐదేళ్లపాటు జైలుకు పంపొచ్చు. స్త్రీ పురుషులిద్దరూ ఇలాంటి చర్యకు పాల్పడితే.. సెక్షన్ 497 ప్రకారం కేవలం పురుషుణ్ని మాత్రమే శిక్షించే వీలుంది. వివాహేతర సంబంధంలో ఇద్దరికీ సమాన పాత్ర ఉన్నప్పుడు సెక్షన్ 497 చట్టబద్ధం కాదని సుప్రీంకోర్టు తెలిపింది.
అడల్టరీపై సుప్రీంకోర్టు తీర్పులో మరికొన్ని కీలక విషయాలు
అడల్టరీ అనేది శిక్షార్హమైన నేరం కాదు, కానీ ఆ కారణంతో విడాకులు తీసుకోవచ్చు. ఈ అడల్టరీ కారణంగా భాగస్వామి ఆత్మహత్యకు పాల్పడితే.. దానికి సాక్ష్యం చూపించగలిగితే.. ఆత్మహత్యకు ప్రేరేపించిన కారణంగా చీటింగ్ చేసిన భాగస్వామిపై కేసు నమోదు చేయొచ్చు. అయితే ఈ అడల్టరీ నైతికంగా కరెక్ట్ కాదని.. వివాహ వ్యవస్థను ముగింపు పలికే తప్పుడు చర్యగా అడల్టరీని సుప్రీంకోర్టు అభివర్ణించింది.
అంతిమంగా చట్టం ప్రకారం నేరం కాదు.. కానీ నైతికంగా మాత్రం దిగజారుడే !
తాము కలిసి ఉండటం.. శారీరక సంబంధం కొనసాగించడాన్ని అడల్టరీగా చెప్పుకుని.. చట్ట పరంగా సమస్యలు లేకుండా మాధురీ, దువ్వాడ శ్రీను చూసుకుంటున్నారు. కానీ నైతికంగా చూస్తే ఇద్దరికీ వేర్వేరు కుటుంబాలు ఉన్నాయి. అయినా వీరిద్దరూ ఇలా చేయడం విలువలతో కూడిన మన సమాజం .. నైతికంగా నేరం చేసినట్లే భావిస్తుంది.