West Bengal SSC Scam: అర్పిత ముఖర్జీ ఇంట్లో మళ్లీ నోట్ల కట్టలు, స్వాధీనం చేసుకున్న ఈడీ
West Bengal SSC Scam: బెంగాల్‌లో ఎస్ఎస్‌సీ స్కామ్‌లో ఈడీ అదుపులోకి తీసుకున్న అర్పిత ముఖర్జీ మరో ఇంట్లో రూ.29 కోట్ల నగదు దొరికినట్టు అధికారులు వెల్లడించారు.
West Bengal SSC Scam:
మరో రూ.29 కోట్లు దొరికాయ్..
పశ్చిమ బెంగాల్‌లో స్కూల్ సర్వీస్ కమిషన్ స్కామ్ అలజడి కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో సంబంధం ఉన్న అందరి ఇళ్లలోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మంత్రి పార్థ ఛటర్జీ సన్నిహితురాలైన అర్పిత ముఖర్జీ ఇంట్లో ఇప్పటికే రూ.20 కోట్ల నగదును ఈడీ స్వాధీనం చేసుకుంది. అయితే అర్పిత ముఖర్జీకి చెందిన నార్త్-24 ప్రగనాస్‌లోని ఓ రెసిడెన్స్‌లో మరోసారి రూ.29 కోట్ల నగదు లభించినట్టు ఈడీ తెలిపింది. ఆ నగదుని జప్తు చేసినట్టు వెల్లడించింది. టీచర్ రిక్రూట్‌మెంట్‌లో స్కామ్‌కు పాల్పడిన కేసులో మొదటి నుంచి అర్పిత ముఖర్జీ పేరు వినిపిస్తూనే ఉంది. ఇప్పటి వరకూ రెండు ఇళ్లలో సోదాలు నిర్వహించిన ఈడీ..మొత్తంగా రూ.49 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. పెద్ద ట్రంకు పెట్టెల్లో నగదునంతా నింపి వాటిని ఈడీకి చెందిన వాహనంలో పెడుతున్న ఫోటోలను ANI షేర్ చేసింది.
ఆ పాకెట్ డైరీలో ఏముంది..?
నగదుతో పాటు విలువైన బంగారు ఆభరణాలూ స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 18 గంటల పాటు సోదాలు నిర్వహించి ఈ నగదుని జప్తు చేసింది ఈడీ. బెల్గోరియాలోని రెండు ఇళ్లలోనూ ఈడీ సోదాలు చేశారు. ఈడీ విచారణలో అర్పిత ముఖర్జీ ఓ ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. "నా ఇంటిని పార్థ ఛటర్జీ లిటిల్ బ్యాంక్‌గా పిలిచేవారు" అని ఆమె సమాధానం చెప్పినట్టు ఈడీ తెలిపింది. మంత్రి పార్థ ఛటర్జీకి సన్నిహితురాలైన అర్పిత ముఖర్జీ ఈ మనీ లాండరింగ్‌లో కీలక పాత్ర పోషించి ఉంటారని ఈడీ భావిస్తోంది. ఇప్పటికే ఆమెను అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఆమె ఇంటి నుంచి ముఖ్యమైన డాక్యుమెంట్లతో పాటు రెండు జర్నల్స్‌ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె ఇంట్లో దొరికిన పాకెట్ డైరీలో ఏమైనా ఆధారులు దొరుకుతుండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ రెండు జర్నల్స్‌లోనూ కొన్ని కోడ్స్ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఎస్‌ఎస్‌సీ స్కామ్‌కు సంబంధించిన లావాదేవీలకు సంబంధించిన కోడ్స్ అయ్యుంటాయని భావిస్తున్నారు.
WB SSC recruitment scam | North 24-Parganas: ED officials leave the Belgharia residence of Arpita Mukherjee, close aide of WB Minister Partha Chatterjee, after filling 10 trunks with cash amounting to approx Rs 29cr found there; a total of Rs 40cr found from her premises so far. pic.twitter.com/t9gEIHyb08
— ANI (@ANI) July 28, 2022