ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి రిలీఫ్- తెలంగాణలో మరో రోజు వణికిపోవాల్సిందే!
వారం రోజుల పాటు చలికి వణికిపోయిన ప్రజలకు వాతావరణ శాఖ చాలా రిలీఫ్ ఇచ్చే న్యూస్ చెప్పింది. ఇవాళ్టి నుంచి చాలా ప్రాంతాల్లో చలి తీవ్రత తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజుల నుంచి చలి తీవ్రత పెరిగింది. చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. గత మూడు రోజులుగా అరకు వ్యాలీ, రాయలసీమ, ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా చలి చంపేస్తోంది. ముఖ్యంగా పాడేరు, లంబసింగి, చింతపల్లి, ఆదిలాబాద్ లాంటి అటవీ ప్రాంతాల్లో చలి తీవ్రత చాలా దారుణంగా ఉంది. కొన్ని చోట్ల తెల్లవారి కురిసిన మంచు గడ్డ కట్టే పరిస్ధితులు కూడా కనిపించాయి. ఈ చలి గత మూడు సంవత్సరాల్లోనే అత్యధికంగా వాతావరణ శాఖ చెబుతోంది.
వారం రోజుల పాటు చలికి వణికిపోయిన ప్రజలకు వాతావరణ శాఖ చాలా రిలీఫ్ ఇచ్చే న్యూస్ చెప్పింది. ఇవాళ్టి నుంచి చాలా ప్రాంతాల్లో చలి తీవ్రత తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పొడిగాలులు క్రమంగా కర్ణాటక వైపు కదులుతున్నాయి. దీని కారణంగా చలి తీవ్రత మెల్లిగా తగ్గుతోంది.
ఇన్నాళ్లు, తెలంగాణ, ఆంధ్రాను వణికించిన చలి... ఇప్పుడు సీమ జిల్లాల్లో ముఖ్యంగా కర్ణాటకకు సరిహద్దున ఉండే ప్రాంతాలను వణికించనుంది. అందుకే అక్కడి ప్రజలకు చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
తెలంగాణలో వాతావరణం...
ఉత్తరాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో ఉన్న చలి వాతావరణం మెల్లగా రాయలసీమ వైపు ప్రవేశిస్తోంది. ఇక్కడ ఉన్న పొడి వాతావరణం రాయలసీమ, కర్ణాటక సరిహద్దు ప్రాంతాలకు చేరుకుంటుంది. అందుకే తెలంగాణలో చలి తీవ్రత తగ్గే ఛాన్స్ ఉంది. మరో 24 గంటల పాటు హైదరాబాద్ మినహా మిగిలిన ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. కానీ నిన్నటితో పోలిస్తే మాత్రం తక్కువగా ఉంటుంది.
ప్రస్తుతానికి తెలంగాణను ఆనుకొని ఉన్న తీవ్రమైన పొడిగాలుల ప్రభావంతోనే చలి తీవ్రత ఇలా ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఈ సాయంత్రం నుంచి తెలంగాణలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే ఛాన్స్ ఉంది. కొమ్రుంభీం జిల్లా, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పది నుంచి పదిహేను డిగ్రీలు మధ్య నమోదు అయ్యే అవకాశం ఉంటుంది. మెయిన్ హైదరాబాద్ సిటీలో చలి తీవ్రత తక్కువగా ఉంటుంది. హైదరాబాద్ చుట్టుపక్కల చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆంధ్రాకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో వెచ్చగా ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం చూస్తే..
కోస్తాంధ్ర, గోదావరి జిల్లాల్లో కూడా చలి తీవ్రత తగ్గుముఖం పడుతుంది. సీమ జిల్లాల్లో ముఖ్యంగా కర్ణాటకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో చలి తీవ్రత పెరగనుంది. కోస్తా ఆంధ్రలో చలి తక్కువగా ఉంది. కోస్తా ఆంధ్రలో వ్యాపించి ఉన్న ఈ పొడిగాలులు ఇవాల్టి నుంచి సీమ వైపు వెళ్తనున్నాయి కాబట్టి ఇక్కడ చలి తగ్గి సీమ జిల్లాల్లో పెరగనుంది.
పొడిగాలుల ప్రభావంతో విశాఖ, దాని పరిసరప్రాంతాల్లో 12 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అరకు, చింతపల్లి, పాడేరు చలి తీవ్రత నేటి నుంచి తగ్గనుంది. రానున్న రోజుల్లో ఈ ప్రాంతాల్లో వాతావరణంలో చాలా మార్పులు కనిపిస్తాయి. ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు పది డిగ్రీల కంటే ఎక్కువ నమోదు అవుతాయి.
ప్రస్తతం ఉన్న వాతావరణం చూస్తే మరో రెండు వారాలు పాటు వర్ష సూచన లేనే లేదు.