Zelensky On Putin: పుతిన్‌కు రోజులు దగ్గర పడ్డాయి, దగ్గరి వాళ్లే ఆయన్ని చంపేస్తారు - జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు
Zelensky On Putin: పుతిన్‌ను సన్నిహితులే చంపేస్తారని జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Zelensky On Putin:
డాక్యుమెంటరీ
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను సన్నిహితులే చంపేస్తారని తేల్చి చెప్పారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై ఏడాది అయిన సందర్భంగా Year పేరిట ఓ డాక్యుమెంటరీ రూపొందించారు. ఇందులోనే జెలెన్‌స్కీ పుతిన్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పుతిన్ పూర్తిగా బలహీనపడే సమయం త్వరలోనే వస్తుందని, ఆయన సన్నిహితులే ఆయనకు వ్యతిరేకంగా నడుచుకుంటారని జోస్యం చెప్పారు.
"పుతిన్ పాలన ఎప్పుడో అప్పుడు అంతం కాక తప్పదు. రష్యా ప్రజలే ఆయనను వ్యతిరేకించే సమయం తప్పకుండా వస్తుంది. ఇన్ని హత్యలు చేస్తున్న పుతిన్‌నే హత్య చేసే వాళ్లుంటారు. ఏదో ఓ కారణం చూపించి పుతిన్‌ను హతమార్చుతారు. ఆ రోజు నేను చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటారు. ఇది కచ్చితంగా జరుగుతుందా అని నన్ను అడిగితే అవును అనే సమాధానమే ఇస్తాను. కానీ ఎప్పుడు..? అంటే మాత్రం నేను చెప్పలేను"
-జెలెన్‌స్కీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు
నిజానికి రష్యాలోనే పుతిన్‌పై వ్యతిరేకత పెరుగుతోందన్న వార్తలు చాన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. ఆయన సన్నిహితులే ఆయనపై తీవ్రం అసహనంతో ఉన్నట్టు ఈ మధ్యే వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. ఉక్రెయిన్‌లో తలపడుతున్న రష్యన్ సైనికులు కొందరు అకారణంగా దాడులు చేయలేకపోతున్నారని, కొందరైతే భావోద్వేగానికి లోనై ఏడుస్తున్నారని తెలిపింది. ఈ క్రమంలోనే జెలెన్‌స్కీ చేసిన వ్యాఖ్యలు సంచలనమవుతున్నాయి.
"ఇది మా నేల. వీళ్లంతా మా ప్రజలు. ఈ దేశానికో చరిత్ర ఉంది. త్వరలోనే ఉక్రెయిన్ నలుమూలలా మళ్లీ మా జెండా ఎగిరేలా చేస్తాం"
-జెలెన్‌స్కీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు
సభ్యత్వం రద్దు..
FATF (ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్) రష్యా సభ్యత్వాన్ని రద్దు చేసింది. గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్ భద్రత, సమగ్రతకు రష్యన్ ఫెడరేషన్ చర్యలు ఆమోదయోగ్యంగా లేవని FATF తెలిపింది. ఈ మేరకు రష్యా సభ్యత్వాన్ని నిలిపివేయాలని నిర్ణయించినట్లు FATF ఓ ప్రకటనలో తెలిపింది. ఉక్రెయిన్‌లో మాస్కో యుద్ధం కొనసాగించడం ఎఫ్ఏటీఎఫ్ సూత్రాలను ఉల్లంఘించిందని పేర్కొంటూ గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైమ్ వాచ్‌డాగ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) రష్యా సభ్యత్వాన్ని సస్పెండ్ చేసింది. "రష్యన్ ఫెడరేషన్ చర్యలు భద్రత, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సమగ్రతను ప్రోత్సహించే లక్ష్యంతో ఏర్పాటుచేసిన FATF ప్రధాన సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయి" అని ప్యారిస్ ఆధారిత గ్రూప్ ఎఫ్ఏటీఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. రష్యా సభ్యత్వాన్ని రద్దు చేయాలని గత ఏడాది ఉక్రెయిన్ పలుమార్లు కోరింది. రష్యా ఇప్పుడు సస్పెండ్ అయినప్పటికీ సభ్యదేశంగా ఉంటుంది. "FATF ప్రమాణాలను అమలు చేయడానికి రష్యన్ ఫెడరేషన్ బాధ్యత వహిస్తుంది. రష్యన్ ఫెడరేషన్ తన ఆర్థిక బాధ్యతలను నెరవేర్చడం కొనసాగించాలి" అని FATF పేర్కొంది. ప్రతి ప్లీనరీ సమావేశాల్లోనూ పరిస్థితిని సమీక్షిస్తామని తెలిపింది. FATF అనేది అంతర్జాతీయ ప్రమాణాలను నెలకొల్పడం, దేశాలు వాటిని గౌరవిస్తున్నాయో లేదో తనిఖీ చేయడం ద్వారా మనీలాండరింగ్ టెర్రరిజం ఫైనాన్సింగ్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్.