Aurora Venkateswara Swamy Temple Mass Shooting Plot: అమెరికాలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో మారణకాండకు కుట్ర - 19 ఏళ్ల శ్వేతజాతి ఉన్మాది అరెస్ట్!
US Hindu Temple Attack News : ఇల్లినాయిస్ ఆరోరా వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద దారుణ దాడికి కుట్ర పన్నిన 19 ఏళ్ల అలెగ్జాండ్రోస్ పాపోరాకిస్ ను అరెస్ట్ చేశారు. తుపాకీ జామ్ కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

Indian Diaspora Security US : అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రం, ఆరోరా నగరంలో ఉన్న ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయాన్ని టార్గెట్ చేస్తూ ప్లాన్ చేసిన భారీ కాల్పుల కుట్రను పోలీసులు సమర్థవంతంగా తిప్పికొట్టారు. నవరాత్రి ఉత్సవాల తొలిరోజే భారతీయ సంతతికి చెందిన వందలాది మంది భక్తులను లక్ష్యంగా చేసుకుని ఈ ఘాతుకానికి పాల్పడాలని భావించిన 19 ఏళ్ల అలెగ్జాండ్రోస్ పాపోరాకిస్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమెరికాలోని అత్యంత పురాతనమైన, ప్రసిద్ధి చెందిన హిందూ ఆలయాలలో ఒకటైన ఈ గుడి వద్ద జరగాల్సిన పెద్ద ముప్పు తృటిలో తప్పింది.
రైఫిల్‌తో ఆలయానికి వచ్చిన ఉన్మాది
నిందితుడు పాపోరాకిస్ పాలాటైన్ పట్టణం నుంచి మోడిఫై చేసిన ఏఆర్-స్టైల్ రైఫిల్‌తో ఆరోరా ఆలయ పరిసరాలకు చేరుకున్నాడు. పూజల్లో పాల్గొంటున్న భారతీయుల్ని టార్గెట్ చేశాడు. ఎంత మందిని దొరికితే అంత మందిని చంపాలనుకున్నాడు. అయితే సాంకేతిక లోపం వల్ల అతడు ఉపయోగించాలనుకున్న గన్ జామ్ కావడంతో నేరుగా దాడి జరపలేక అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం తన ఇంట్లో ఆయుధాన్ని బాగుచేసుకునేందుకు ఆన్లైన్ ద్వారా శోధించడమే కాకుండా, తుపాకీకి సంబంధించిన వీడియోను తన సహద్యోగికి పంపాడు. ఈ విచిత్ర ప్రవర్తనతో అనుమానం వచ్చిన సహోద్యోగి వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో నిందితుడి కుట్ర బయటపడింది.
గన్ పని చేయకపోవడంతో తప్పిన ముప్పు
పోలీసులు, ఎఫ్‌బీఐ బృందాలు సంయుక్తంగా జరిపిన తనిఖీల్లో నిందితుడి ఇల్లు, డిజిటల్ పరికరాల నుంచి కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. నిందితుడు తీవ్రమైన శ్వేతజాతి ఆధిక్యతా భావజాలం కలిగినవాడని, ప్రత్యేకంగా భారతీయ సంతతికి చెందిన ప్రజలు, హిందూ ధార్మిక స్థలాలపై ద్వేషంతో ఉన్నాడని గుర్తించారు. ఆ యువకుడు “Why I Fought: A.K.A. (Aurora Shooter's Manifesto)” పేరిట ఎనిమిది పేజీల మ్యానిఫెస్టోను కూడా సిద్ధం చేసినట్లు విచారణలో తేలింది. అతని వద్ద నుంచి సీరియల్ నంబర్ లేని నిషేధిత ఆయుధం, బాడీ ఆర్మార్, వందలాది రౌండ్ల బుల్లెట్లను రికవర్ చేశారు.
"Mass shooting of Indian people" First day of Navratri. Mass shooting foiled at Aurora Venkateswara Swamy Temple in Aurora, Illinois. One of the oldest Hindu temples in the USA. 19-year-old Alexandros Paporakis arrested. He plotted a mass shooting targeting Indian worshippers. Drove from Palatine with a modified AR-style rifle. The weapon jammed. He fled the scene. He searched online for a fix and sent a video to a colleague. The colleague called the police. Paporakis held white supremacist views and prepared a manifesto. This follows an attack on a Hindu temple in Ohio two weeks earlier.
— Subodh Kumar (@kumarsubodh_) October 15, 2026
భారతీయులపై ద్వేషమే కారణం
ఈ ఘటన కేవలం ఒక ప్రాంతానికి పరిమితమైనది కాదని, రెండు వారాల క్రితం ఒహియోలోని మరొక హిందూ దేవాలయంపై కూడా దాడి యత్నం జరిగిందని ఎఫ్‌బీఐ అధికారులు గుర్తుచేశారు. ఇటీవల కాలంలో అమెరికాలో పెరుగుతున్న మతపరమైన ద్వేషపూరిత నేరాలు, శ్వేతజాతి తీవ్రవాద పోకడలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిందితుడిపై ఉగ్రవాద బెదిరింపులు, అక్రమ ఆయుధ సేకరణ వంటి తీవ్రమైన నేరారోపణల కింద కేసులు నమోదు చేసి, బెయిల్ లేకుండా నిర్బంధంలో ఉంచినట్లు రోలింగ్ మేడోస్ కోర్టు స్పష్టం చేసింది.
నవరాత్రి , దీపావళి పండుగల వేళ అమెరికా వ్యాప్తంగా ఉన్న హిందూ దేవాలయాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ఎఫ్‌బీఐ , స్థానిక పోలీసు యంత్రాంగానికి హిందూ సంఘాలు విజ్ఞప్తి చేశాయి.
ట్రెండింగ్ వార్తలు






















