Nitin Gadkari: యూపీ రహదారులు అమెరికా రోడ్లలాగా మెరిసిపోతాయని హామీ ఇస్తున్నా - కేంద్రమంత్రి గడ్కరీ
Nitin Gadkari: యూపీలోని రహదారులు అమెరికాను తలపించే విధంగా మెరిసిపోతాయని నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు.
Nitin Gadkari on UP Roads:
లక్నో సమావేశంలో..
ఉత్తర్‌ప్రదేశ్‌లో మౌలిక వసతులు అమెరికాను తలపించే విధంగా తీర్చిదిద్దుతామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఇదే హామీని సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఇచ్చానని చెప్పారు. 2024లోగా ఈ లక్ష్యం చేరుకుంటామని స్పష్టం చేశారు. యూపీలోని లక్నోలో Indian Roads Congress సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. "2024 చివరి నాటికి యూపీలోని రోడ్లను అమెరికా రోడ్లకు సమానంగా తీర్చి దిద్దుతామని ఆదిత్యనాథ్‌కు హామీ ఇచ్చాను" అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు. 2024 ముగిసే నాటికి రూ.5 లక్షల కోట్ల విలువైన రోడ్ ప్రాజెక్ట్‌లు చేపడతామని హామీ ఇచ్చినట్టు గుర్తు చేశారు. అందులో భాగంగా...ముందుగా రూ.8 వేల కోట్ల విలువైన ప్రాజెక్ట్‌లను ప్రకటించారు గడ్కరీ. రహదారులు నిర్మించేందుకు కేంద్రం వద్ద నిధుల కొరత ఎప్పటికీ రాదని స్పష్టం చేశారు. ఇప్పుడే కాదు. గతంలోనూ గడ్కరీ రాజ్యసభ సాక్షిగా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. మూడేళ్లలో దేశవ్యాప్తంగా 26 గ్రీన్ ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మిస్తామని ప్రకటించారు. 2024 నాటికి భారత్‌లోని రహదారులు...అమెరికా రోడ్లను తలపిస్తాయని వెల్లడించారు. క్వశ్చన్ అవర్‌లో సమాధానాలిచ్చే క్రమంలో ఈ విషయం చెప్పారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)కు నిధుల కొరత ఏమీ లేదని, దానికి AA రేటింగ్ ఉందని స్పష్టం చేశారు. ఆర్థికంగా ఆ సంస్థ బలంగానే ఉందని చెప్పారు గడ్కరీ.
బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే
ఏడాదికి 5 లక్షల కిలోమీటర్ల రహదారులు నిర్మించే సామర్థ్యం NHAIకి ఉందని రాజ్యసభలో గడ్కరీ తెలిపారు. దిల్లీ నుంచి డెహ్రడూన్, జైపూర్, హరిద్వార్‌కు కేవలం 2 గంటల్లో చేరుకునేలా ఎక్స్‌ప్రెస్ వే నిర్మించనున్నట్టువివరించారు. ఈ ఎక్స్‌ప్రెస్ వే లు అందుబాటులోకి వస్తే దిల్లీ నుంచి ఛండీగఢ్‌కు రెండున్నర గంటల్లో, దిల్లీ నుంచి అమృత్‌సర్‌కు నాలుగు గంటల్లో చేరుకోవచ్చని చెప్పారు. దిల్లీ నుంచి కత్రాకు 6 గంటల్లో, చెన్నై నుంచి బెంగళూరుకు 2 గంటల్లో చేరుకునేందుకు వీలవుతుందని అన్నారు. గతంలో మీరట్ నుంచి దిల్లీకి వెళ్లాలంటే కనీసం నాలుగున్నర గంటల సమయం పట్టేది. కానీ...ఇప్పుడు 40 నిముషాల్లోనే ప్రయాణం పూర్తవుతోందని వెల్లడించారు. "ప్రధాని మోదీ నేతృత్వంలో 2024కి ముందే భారత్‌లోని రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, అమెరికాను తలపిస్తుందని హామీ ఇస్తున్నాను. నిధులకు ఎలాంటి కొరత లేదు" అని స్పష్టం చేశారు. దేశంలోని మౌలిక వసతుల స్థితిగతులు మార్చివేస్తామని తెలిపారు.
ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ యూపీలోని జలౌన్ జిల్లాలో బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభించారు. ఈ 296 కిలోమీటర్ల ఫోర్ లేన్ రహదారి నిర్మాణానికి రూ.14,850 కోట్లు ఖర్చు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఎక్స్‌ప్రెస్ వేతో స్థానికంగా పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటవటమే కాకుండా కనెక్టివిటీ కూడా పెరగనుంది. చిత్రకూట్‌ను లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేతో అనుసంధానించే ఈ నాలుగు వరుసల రహదారికి 2020 ఫిబ్రవరి 29న ఫౌండేషన్ స్టోన్ వేశారు ప్రధాని మోదీ. ఉత్తర్‌ప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ వేస్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ(UPEIDA) నేతత్వంలో ఈ రహదారి నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతానికి 4 లేన్ హైవే అయినప్పటికీ...భవిష్యత్‌లో దీన్ని ఆరు వరుసలకు విస్తరించాలని చూస్తున్నారు.
Also Read: Thackeray vs Shinde: నిజం మా వైపే ఉంది, తప్పక గెలిచి తీరతాం - ఈసీ నిర్ణయంపై ఆదిత్య ఠాక్రే