Viral News : రూ.20 కోసం రైల్వే శాఖపై పోరాటం- 22 ఏళ్ల తర్వాత విజయం
యూపీకి చెందిన ఓ వ్యక్తి వద్ద టిక్కెట్ల ధరను మించి రూ. 20 అదనంగా వసూలు చేశారు రైల్వే క్లర్క్. ఆయన వదిలి పెట్టలేదు. కోర్టుకెళ్లారు. 22 ఏళ్ల తర్వాత తీర్పు వచ్చింది.
Viral News : అక్కడ మన దగ్గర దోచుకుంది.. రూపాయా..? అర్థరూపాయా ? అన్నది కాదు ముఖ్యం. మనం దోపిడికి గురయ్యాయి.. ఎందుకు సహించారన్నది ముఖ్యం. పోరాటం చేయాలన్నది కీలకం. ఈ పోరాట పటిమ చాలా మంది వద్ద ఉండదు.కానీ తుంగనాథ్ చతుర్వేది అనే పెద్దాయన వద్ద టన్నుల కొద్దీ ఉంది. టిక్కెట్ మీద అసలు రేటు కన్నా ఇరవై రూపాయలు ఎక్కువ వసూలు చేశారని కోర్టుకెళ్లాడు. 22 ఏళ్ల పాటు పోరాడాడు. ఇప్పుడు అనుకున్న విధంగా ఫలితం పొందాడు. రైల్వేదే తప్పని నిరూపించాడు.
రూ. 20 ఎక్కువ తీసుకున్న రైల్వే టిక్కెటింగ్ క్లర్క్
1999లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని మధుర కంటోన్మెంట్ రైల్వే స్టేషన్‌లో తుంగనాథ్ చదుర్వేది అనే ప్రయాణికుడు మధుర నుంచి మొరాదాబాద్ ప్రయాణించటానికి రెండు టిక్కెట్లు కొన్నారు. టికెట్ల అసలు ధర కన్నా 20 రూపాయలు ఎక్కువ చార్జీ వసూలు చేశారు. ఒక్కో టికెట్ ధర 35 రూపాయలు. రెండు టికెట్లకు కలిపి 70 రూపాయలు. చతుర్వేది సదరు క్లర్కుకు 100 రూపాయలు ఇచ్చారు. కానీ ఆ క్లర్కు 10 రూపాయలు మాత్రమే తిరిగి ఇచ్చారు. అంటే 20 రూపాయలు అదనంగా చార్జీ వసూలు చేశారు. ఇలా ఎందుకు తీసుకున్నారని ప్రశ్నిస్తే టిక్కెట్ ఇచ్చిన ఉద్యోగి దిక్కున్న చోట చెప్పుకోమన్నాడు. దీంతో చతుర్వేది ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయదల్చుకోలేదు. నార్త్ ఈస్ట్ రైల్వే (గోరఖ్‌పూర్) మీద, బుకింగ్ క్లర్కు మీద మధురలోని వినియోగదారుల కోర్టులో కేసు వేశాడు.
వినియోగదారుల కోర్టులో కేసు వేసిన తుంగనాథ్ చతుర్వేది
అప్పట్నుంచి ఈ కేసు విచారణ జరుగుతూనే ఉంది. ఈ కేసుకు సంబంధించి దాదాపుగా వందసార్లకుపైగా చతుర్వేది విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు ఆయన వయసు 66 ఏళ్లు వచ్చాయి. ఈ పోరాటంపై తాను కేటాయించిన సమయం.. శక్తి చాలా ఎక్కువ అని చతుర్వేది చెబుతున్నారు. 'రైల్వేశాఖ కూడా ఈ కేసును కొట్టివేయాలని చూసింది. రైల్వేల మీద ఫిర్యాదులను రైల్వే ట్రైబ్యునల్‌కు పంపించాలి. కానీ వినియోగదారుల కోర్టుకు పంపించరాదని రైల్వేశాఖ చెప్పింది. కానీ చతుర్వేది మాత్రం పోరాడారు. చివరకు అనుకున్నది సాధించారు.
22 ఏళ్ల తర్వాత చతుర్వేదికి అనుకూలంగా తీర్పు
సుదీర్ఘ పోరాటం తర్వాత..రైల్వేశాఖ రూ.15,000లను చతర్వేదికి జరిమానాగా చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పింది. ఆయన వద్ద నుంచి అదనంగా వసూలు చేసిన 20 రూపాయలను 1999 నుంచి 2022 వరకూ ఏడాదికి 12 శాతం వడ్డీ చొప్పున లెక్కగట్టి తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. తాను చేసిన పోరాటానికి తనకు లభించిన పరిహారం చాలా తక్కువ అని.. ముఖ్యమైన విషయం డబ్బు కాదు. ఇది న్యాయం కోసం పోరాటం. అవినీతి మీద పోరాటం. కాబట్టి ఈ పోరాటం చేయటం ఉపయోగకరమైనదేనని ఆయన చెబుతున్నారు.
చతుర్వేది పోరాటం.. ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. తమకు సేవల్లో.. వస్తువుల్లో సరైన విధంగా సేవలు అందించకుండా .. అధికంగా డబ్బులు వసూలు చేసే వారికి చతుర్వేది తరహాలో బుద్ది చెప్పినప్పుడే.. ఆయా సంస్థలు జాగ్రత్తగా ఉంటాయి.