Union Budget 2024: కామన్ మేన్‌పై బడ్జెట్ ఎఫెక్ట్ ఎలా ఉండనుంది? వేటి ధరలు పెరుగుతాయ్, ఏవి తగ్గుతాయ్?
Budget 2024 Cheaper Goods List: కేంద్ర బడ్జెట్‌లో సాధారణ పౌరులకు కొంత ఊరట లభించింది. మొబైల్ ఫోన్స్‌తో పాటు విడి భాగాలపై కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.
Union Budget Highlights 2024: ఈ బడ్జెట్ సాధారణ పౌరులకు పెద్ద ఊరట లభించింది. కీలక వస్తువులు,మందులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ జాబితాలో మొబైల్ ఫోన్స్‌తో పాటు క్యాన్సర్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి. ఇకపై రిటైల్ మార్కెట్‌లో వీటి ధరలు తగ్గనున్నాయి. దిగుమతి చేసుకున్న బంగారం, వెండి, లెథర్ వస్తువులపైనా కస్టమ్స్ సుంకం తగ్గించింది కేంద్రం. ఫలితంగా వీటి ధరలూ తగ్గుతాయి. ఇక సీఫుడ్‌పైనా పన్ను తగ్గిస్తున్నట్టు వెల్లడించింది.
"క్యాన్సర్ చికిత్సకు వినియోగించే మూడు డ్రగ్స్‌పై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నాం. అంతే కాదు. మొబైల్ ఫోన్స్, ఛార్జర్‌లు సహా మిగతా మొబైల్ విడిభాగాలపైనా ఈ సుంకం తగ్గించాలని నిర్ణయించుకున్నాం"
- నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి
బంగారం, వెండి, ప్లాటినంపై దిగుమతి సుంకాన్ని 6%కి తగ్గిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ నిర్ణయంతో మార్కెట్‌లో వీటికి డిమాండ్ మరింత పెరిగే అవకాశముంది. పైగా ప్రపంచంలో బంగారం,వెండిని భారీగా దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. ఈ మధ్య కాలంలో బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పుడు ఈ సుంకం తగ్గించడం ద్వారా కొంత వరకూ ఊరట లభించనుంది. వీటితో పాటు సోలార్ ప్యానెల్స్, సోలార్ సెల్స్, ఈవీలు, లెదర్ చెప్పుల ధరలు తగ్గనున్నాయి.
వీటి ధరల్లో పెరుగుదల..
అమ్మోనియం నైట్రేట్‌పై కస్టమ్స్ డ్యూటీని 10% మేర పెంచింది. దీంతో పాటు నాన్ బయోగ్రేడబుల్ ప్లాస్టిక్‌పై 25% సుంకం వేసింది. ఇక టెలికాం ఉత్పత్తులూ ప్రియం కానున్నాయి. టెలికామ్ పరికరాలపై కస్టమ్స్ డ్యూటీని 10-15% వరకూ పెంచింది. ప్లాస్టిక్ ఉత్పత్తుల ధరలు భారీగా పెరగనున్నాయి.