Ugadi Wishes: తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు చెప్పిన సీఎంలు, దేశాభివృద్ధికి పాటుపడాలని సూచన
Ugadi 2023: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్ లు ప్రతీ ఒక్కరికీ ఉగాది శుక్షాకాంక్షలు తెలిపారు.
Ugadi 2023: ఉగాది పండుగను పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ లు శ్రీ శోభకృత్ నామ సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికి శుభాకాంక్షలు తెలిపారు.
షడ్రుచుల సమ్మేళనంతో ప్రారంభమయ్యే ఉగాది.. తెలుగు లోగిళ్లలో నూతన సంవత్సర శోభను తెస్తూ, కొత్త లక్ష్యాలకు, కొత్త ఆలోచనలకు నాంది కావాలని ఏపీ సీఎం జగన్ ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరి ఉజ్వల భవిష్యత్తుకు, తద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడాలని అన్నారు. అలాగే శోభకృత్ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు జరగాలని, సమృద్ధిగా వానలు కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులకు మేలు కలగాలని, సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలని కోరుకున్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని ముఖ్యమంత్రి అభిలషించారు. అంతేకాకండా శోభకృత్ నామ సంవత్సరంలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలని ఆకాంక్షించారు.
కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు..
రాష్ట్ర ప్రజలకు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ‘శోభకృత్’ నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియ జేశారు. వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఈ ఉగాది.. రైతులకు, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చనున్నదని సీఎం కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. సాగునీరు, తాగునీరు, పచ్చని పంటలతో తెలంగాణలో నిత్య వసంతం నెలకొన్నదని సీఎం తెలిపారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా దాని అనుబంధ రంగాలు, వృత్తులు బలపడి, తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైందని అన్నారు. తెలంగాణ సాధించిన ప్రగతి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. 'శోభకృత్’ నామ సంవత్సరం లో తెలంగాణతో పాటు భారతదేశం మరింత గొప్పగా అభివృద్ధి సాధించాలని సిఎం కేసీఆర్ ఆకాంక్షించారు.