Turkey Syria Earthquake: టర్కీలో ఇప్పటి వరకు 435 భూ ప్రకంపనలు - 8 వేలకు పైగా మరణాలు
Turkey Syria Earthquake: టర్కీని ప్రకృతి విపత్తు శవాల దిబ్బగా మార్చింది. 2 రోజుల వ్యవధిలో ఏకంగా 435 భూకంపాలు సంభవించింది. ఇప్పటి వరకు 8 వేల మంది చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరగనున్నట్లు అంచనా.
![Turkey Syria Earthquake: టర్కీలో ఇప్పటి వరకు 435 భూ ప్రకంపనలు - 8 వేలకు పైగా మరణాలు Turkey syria Earthquake Turkey Suffering Tremors Earthquake Death Toll Nears 8000 Turkey Syria Earthquake: టర్కీలో ఇప్పటి వరకు 435 భూ ప్రకంపనలు - 8 వేలకు పైగా మరణాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/08/c9dd4e65b027e08f3640bd68f0a1ca991675836843211519_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Turkey Syria Earthquake: టర్కీ - సిరియా సరిహద్దు ప్రాంతాలు శవాల దిబ్బగా మారిపోయింది. శిథిలాల నుంచి వేలాది మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీస్తున్నాయి. ఈ భారీ ప్రకృతి విలయంలో ఇప్పటి వరకు 8 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. సోమవారం అంటే ఫిబ్రవరి 6వ తేదీన మొదటిసారి భూమి కంపించగా.. ఈ రెండు రోజుల్లో ఇప్పటి వరకు మొత్తం 435 సార్లు భూమి తీవ్రంగా కంపించింది. ఈ ఘోర విపత్తులో మరణాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. శిథిలాల కింద వేలాది మంది మృతదేహాలు ఉండొచ్చని అంటున్నారు. టర్కీలోనే దాదాపు 6 వేల మంది వరకు మరణించగా.. సిరియాలో 2 వేల మంది వరకు మృత్యువాత పడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరో 20 వేల మందికి పైగా గాయపడ్డట్లు తెలుస్తోంది.
ఒకటీ రెండూ కాదు ఏకంగా 435 భూకంపాలు..
ఫిబ్రవరి 6న కహ్రామన్‌మరాస్ ప్రాంతంలో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత, ఇప్పటి వరకు మొత్తం 435 భూకంపాలు నమోదయ్యాయని టర్కీ విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. భూకంపం సంభవించినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 60,217 మంది సిబ్బందితోపాటు 4,746 వాహనాలు, నిర్మాణ సామగ్రిని సహాయక చర్యలు చేపట్టామని టర్కీ ప్రభుత్వం వెల్లడించింది.
టర్కీలో భూకంపం సంభవించిన తరువాత, ప్రపంచ దేశాలు సహాయం అందించాయి. మొత్తం 70 దేశాల నుంచి సహాయక బృందాలు టర్కీకి చేరుకున్నాయి. టర్కీ వాతావరణం సహాయ బృందాలకు ఇబ్బంది కలిగిస్తోంది.
ఆపన్నహస్తం అందించిన భారత్..
టర్కీలో భూకంపం తర్వాత భారత్ కూడా టర్కీకి ఆపన్నహస్తం అందించింది. సహాయక సామగ్రి, పరికరాలు,సైనిక సిబ్బందితో కూడిన నాలుగు C-17 విమానాలను భారతదేశం టర్కీకి పంపింది. టర్కీకి 108 టన్నుల కంటే ఎక్కువ బరువున్న రిలీఫ్ ప్యాకేజీలను పంపించింది భారత్.
పరికరాలు, వాహనాలు, డాగ్ స్క్వాడ్‌లు, 100 మందికి పైగా సైనిక సిబ్బందిని భారత్ టర్కీకి పంపింది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను గుర్తించి తరలించేందుకు ప్రత్యేక పరికరాలను ఈ బృందాలతో పంపారు. శిథిలాల రెస్క్యూ ఆపరేషన్స్ (CSSR) నిర్వహించగల సామర్థ్యం ఉన్నవారు ఈ బృందంలో ఉన్నారు. ఉపశమన సామాగ్రిలో పవర్ టూల్స్, లైటింగ్ పరికరాలు, ఎయిర్-లిఫ్టింగ్ బ్యాగ్‌లు, యాంగిల్ కట్టర్లు, రోటరీ రెస్క్యూ రంపాలు మొదలైనవి ఉన్నాయి. ఇది కాకుండా, రెస్క్యూ మిషన్ కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్‌ను కూడా పంపారు.
30 పడకల ఫీల్డ్ హాస్పిటల్..
ఫీల్డ్ ఆపరేషన్‌లో 30 పడకల వైద్య సదుపాయాన్ని ఏర్పాటు చేయడానికి పరికరాలు, 99 మంది సిబ్బందిని భారత్ పంపింది. ఇందులో వివిధ రంగాలకు చెందిన వైద్య నిపుణులు ఉన్నారు. వైద్య పరికరాలలో ఎక్స్-రే యంత్రాలు, వెంటిలేటర్లు, ఆపరేషన్-థియేటర్లు, వాహనాలు, అంబులెన్స్‌లు, జనరేటర్లు మొదలైనవి ఉంటాయి. టర్కీతో పాటు సిరియాకు కూడా భారత్ C130J విమానం ద్వారా సహాయక సామగ్రిని పంపింది. ఇందులో 3 ట్రక్కుల సాధారణ, రక్షణ గేర్లు, అత్యవసర వినియోగ మందులు, సిరంజిలు, ఈసీజీ మెషీన్‌లు, మానిటర్‌లు, ఇతర అవసరమైన వైద్య సామాగ్రి, పరికరాలతో సహా 6 టన్నులకు పైగా ఉపశమన సామగ్రి ఉన్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)