Droupadi Murmu: గిరిజనులకు అతి పెద్ద అండ దొరికినట్టే, ద్రౌపది విజయంతో ఆ వర్గాల ఆనందం
Droupadi Murmu: ద్రౌపది ముర్ము గెలుపుతో గిరిజనుల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నారు. ఝార్ఖండ్ గవర్నర్‌గా ఉన్న సమయంలో ఆ వర్గ ప్రజలకు ఆమె ఎంతో మంచి చేశారు.
Droupadi Murmu:
ద్రౌపది ముర్ముపై ప్రశంసల వెల్లువ
ఎన్‌డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ముని నిలబెట్టినప్పటి నుంచి భాజపా మద్దతుదారులంతా అధిష్ఠానాన్ని పొగుడుతూ వచ్చారు. చాలా గొప్ప వ్యక్తిని, చరిష్మా ఉన్న నేతను బరిలోకి దింపారంటూ ప్రశంసలు కురిపించారు. అటు కేంద్రం కూడా ద్రౌపది ముర్ము ఎంతో విజనరీ ఉన్న నేత అని ఆకాశానికెత్తేసింది. ఝార్ఖండ్ ప్రజలూ ద్రౌపది ముర్ము సేవల్ని గుర్తు చేసుకున్నారు. దాదాపు ఏడేళ్ల పాటు ఝార్ఖండ్‌కి గవర్నర్‌గా ఉన్నారామె. ఆ రాష్ట్ర నేతలూ ద్రౌపది ముర్ముని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఎంతో మృదు స్వభావి అని, ఎప్పుడూ ప్రజల సంక్షేమం కోసమే పాటుపడేవారని, ఎంతో వినయంగా ఉండే వ్యక్తి అని అంటున్నారు. గిరిజన తెగకు చెందిన నేతగా, ఆ వర్గ ప్రజల్లోని భయాందోళనలు పోగొట్టే ప్రయత్నం చేశారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నారు.
గిరిజనుల అభద్రతా భావాన్ని పోగొట్టారు..
పతల్‌గడీ ఉద్యమం సహా కౌలు చట్టాల సవరణల సమయంలో గిరిజనులు ఎంతో అభద్రతా భావానికి లోనయ్యారు. అప్పుడు ద్రౌపదిముర్ముతో చర్చలు జరిపారు ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు. ప్రభుత్వంతో చర్చించి సమస్యకు పరిష్కారం చూపించారు. కౌలు చట్టం బిల్లు పాస్ అవకుండా చూశారు. ఏదైనా ఓ అంశంపై లోతైన చర్చ జరిపేందుకు అధికారులకు అవకాశం కల్పించేవారు ముర్ము. గిరిజనులకూ గవర్నర్‌ను కలిసే అవకాశం కేవలం ద్రౌపది ముర్ము హయాంలోనే వచ్చిందని చెబుతారు. ఇకపైనా ఆమె ఆ తెగ ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
భాజపా నుంచే ప్రస్థానం ప్రారంభం..
సంతల్ కమ్యూనిటీ నుంచి వచ్చిన ద్రౌపది ముర్ము ఒడిశాలోని రాయ్‌రంగపూర్ పంచాయతీ కౌన్సిలర్‌గా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.
1997లో బీజేపీ లో చేరిన ద్రౌపది ముర్ము అదే ఏడాదిలో కౌన్సిలర్ అయ్యారు. తర్వాత 2000వ ఏడాదిలో రాయరంగపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ టర్మ్ లోనే ఆమెను మంత్రి పదవి వరించింది. 2000-02 వరకూ ఒడిశాలో రవాణా, వాణిజ్య మంత్రి అయ్యారు. బిజు జనతాదళ్-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో ఆమె పని చేశారు. 2002 నుంచి 2004 మే వరకు మత్స్య, జంతు వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు. 2004లో మళ్లీ ఎమ్మెల్యే అయ్యారు. అదే సమయంలో 2002 నుంచి 2009 వరకూ మయూర్ భంజ్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2006 నుంచి 2009 వరకూ ఒడిశా ఎస్టీ మోర్చా అధ్యక్షురాలిగానూ ఉన్నారు. 2010లో మళ్లీ మయూర్ భంజ్ జిల్లా అధ్యక్షురాలు అయ్యారు. మళ్లీ 2013 నుంచి 2015 వరకూ మయూర్ భంజ్ జిల్లా అధ్యక్షురాలిగా పని చేశారు. 2015లో ఝార్ఖండ్ రాష్ట్రానికి గవర్నర్ గా ఎంపికయ్యారు.