TikTok Ban: ఆ దేశాల్లోనూ టిక్‌టాక్ బ్యాన్,సెన్సిటివ్ డేటాపై చైనా నిఘా పెడుతోందన్న ఆరోపణలు
TikTok Ban: అమెరికా, కెనడాలోనూ టిక్‌టాక్‌పై నిషేధం విధించారు.
TikTok Ban:
కెనడా, అమెరికాలో నిషేధం..
టిక్‌టాక్‌ను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది కెనడా. చైనాలోని ByteDanceకు చెందిన టిక్‌టాక్ (TikTok)పై ఇండియాలో ఇప్పటికే నిషేధం కొనసాగుతోంది. తాము అందించిన ఏ డివైస్‌లోనూ టిక్‌టాక్ యాప్ ఉండటానికి వీల్లేదని కెనడా ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ యాప్ కారణంగా భద్రతకు భంగం వాటిల్లుతోందని ఆరోపిస్తోంది. అంతే కాదు. సెన్సిటివ్ సమాచారాన్ని సేకరిస్తున్నారన్న విమర్శలూ చేస్తోంది. ఈ వివరాలు సేకరించేందుకు చైనా ఈ యాప్‌ను అస్త్రంగా వాడుకుంటోందని మండి పడుతోంది. ఇక అగ్రరాజ్యంలోనూ టిక్‌టాక్‌పై అసహనం వ్యక్తమవుతోంది. ఈ మేరకు వైట్‌హౌజ్ అధికారికంగా ఓ ప్రకటన చేసింది. ప్రభుత్వం జారీ చేసిన అన్ని డివైస్‌లలోనూ టిక్‌టాక్‌ను తొలగించాలని ఆదేశించింది. ప్రభుత్వ సంస్థలు వెంటనే అప్రమత్తమవ్వాలని తేల్చి చెప్పింది. 30 రోజుల్లోగా అన్ని డివైస్‌లలో టిక్‌టాక్‌ను తీసేయాలని వెల్లడించింది. అమెరికా కూడా చైనాపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. యూజర్స్‌కు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని చోరీ చేస్తోందని ఆరోపిస్తోంది. పౌరుల భద్రతకు సంబంధించిన విషయం కనుక ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదని తేల్చి చెప్పింది అగ్రరాజ్యం. కెనడా ప్రధాని జస్టిన ట్రూడో టిక్‌టాక్ బ్యాన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. పౌరుల వ్యక్తిగత భద్రతకు భంగం కలగకుండా చూసుకుంటామని చెప్పారు. "పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని కాపాడేందుకు మేం వేసిన తొలి అడుగు ఇది. ఇంతకు మించి వేరే ఆప్షన్ కూడా లేదు" అని వెల్లడించారు.
30 రోజుల గడువు..
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్‌కు 30 రోజుల గడువు ఇచ్చినప్పటికీ..కెనడాలో మాత్రం వెంటనే ఈ నిషేధం అమల్లోకి రానుంది. అమెరికాలో ప్రస్తుతం కోటి 38 లక్షల మంది టిక్‌టాక్ యూజర్‌లు ఉన్నారు. అయితే...కేవలం ప్రభుత్వానికి సంబంధించిన డివైస్‌లలో మాత్రమే బ్యాన్ చేయనున్నట్టు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది టిక్‌టాక్ యాక్టివ్ యూజర్స్ ఉన్నట్టు అంచనా.
భారత్‌లోనూ...
2020 నవంబర్‌లో సెక్షన్ 69ఏ కింద 43 మొబైల్ యాప్స్‌ను బ్లాక్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. భారతదేశ సార్వభౌమానికి భంగం కలిగించే వ్యవహారాల్లో భాగస్వామ్యం ఉన్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. శాంతి, భద్రతల పరిరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అంతకు ముందు 2020 జూన్ 29వ తేదీన 59 మొబైల్ యాప్స్‌ను, సెప్టెంబర్ 2వ తేదీన మరో 118 మొబైల్ యాప్స్‌ను కూడా కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 69ఏ కింద ఈ నిషేధం విధించినట్లు ప్రభుత్వం తెలిపింది.
Also Read: Gautam Adani: 3 నుంచి 38కి అదానీ - మళ్లీ నం.1 పొజిషన్‌లో మస్క్