Sisodia In jail : తీహార్ జైలుకు మనీష్ సిసోడియా- రిమాండ్ విధించిన రౌస్ అవెన్యూ కోర్టు !
ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు రెండు వారాల రిమాండ్ విధించిది కోర్టు. దీంతో ఆయనను తీహార్ జైలుకు తరలించారు.
Sisodia In jail : ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కు కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. ఆయనను పోలీసులు తీహార్ జైలుకు తరలించారు. ఈ నెల 20 వరకు రిమాండ్ విధింారు అయితే 10వ తేదీన సిసోడియా బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో సీబీఐ 7 రోజుల పాటు ప్రశ్నించింది. అయితే సిసోడియా సహకరించలేదని సీబీఐ వర్గాలుచెబుతున్నాయి.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో సిసోడియా కీలక పాత్ర పోషించాడని రిమాండ్ రిపోర్టులో సీబీఐ ఆరోపించింది. ''కేవలం కొంత మంది లిక్కర్ వ్యాపారులకు లబ్ధి కలిగించేందుకే ఎక్సైజ్ పాలసీని సిసోడియా మార్పుచేశారు. సౌత్ ఇండియా బేస్డ్ లిక్కర్ వ్యాపారులు, రాజకీయనేతల అధీనంలోని సౌత్ గ్రూప్ ద్వారా ఈ కేసులో నిందితుడైన విజయ్ నాయర్ రూ.100 కోట్లు వసూలు చేశాడు. ఈ పాలసీ ద్వారా సౌత్ గ్రూప్‌కే ఎక్కువ లబ్ధి చేకూరుతుంది. హవాలా మార్గాల ద్వారా రూ.100 కోట్ల చెల్లింపులు జరిగాయి. వాటిని మేము కనిపెట్టాం. 2021 సెప్టెంబర్, అక్టోబర్ మధ్య సిసోడియా 14 సెల్‌ఫోన్లు, నాలుగు సిమ్ కార్డులు మార్చారు. సాక్ష్యాలను ధ్వంసం చేయడమే సెల్‌ఫోన్లు మార్చడం వెనుక ప్రధాన ఉద్దేశం. ఈ మొబైల్ ఫోన్లను సిసోడియా సెక్రటరీ ధర్మేంద్ర శర్మ సమకూర్చారు. ఇందుకు సంబంధించి ఆయన స్టేట్‌మెంట్ కూడా తీసుకున్నాం'' అని సీబీఐ రిమాండ్ రిపోర్టులో తెలిపింది.
ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మనీష్ సిసోడియా డిప్యూటీ సీఎంగా అన్ని వ్యవహారాలుచూసుకునేవారు. అయితే అరెస్ట్ కావడంతో విచారణ పూర్తయి నిర్దోషిగా తేలేవరకూ పదవులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుని రాజీనామా చేశారు. ఢిల్లీ సర్కారులో, ఆమ్ ఆద్మీ పార్టీలో కేజ్రీవాల్ తర్వాత సిసోడియానే కీలకంగా వ్యవహరిస్తున్నారు. రాజీనామాకు ముందు వరకూ ఆయన ఢిల్లీ ప్రభుత్వంలోని 18 శాఖలకు ఇంచార్జిగా వ్యవహరించారు. సిసోడియాతో పాటు మనీలాండరింగ్ కేసులో గత పది నెలలుగా జైలులో ఉన్న ఢిల్లీ మినిస్టర్, ఆప్ నేత సత్యేంద్ర జైన్ కూడా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
బెయిల్ పిటిషన్‌పై మార్చి 15న విచారణ జరపాలని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దీన్ని సిసోడియా తరఫు న్యాయవాది వ్యతిరేకించడంతో మార్చి 10కి వాయిదా వేసింది కోర్టు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు రెండు రోజులు సీబీఐ కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 10న మధ్యాహ్నం 2 గంటలకు వాదనలను విననున్నట్లు పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన చాలా మంది ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. మరికొంత మంది సూత్రధారుల్ని అరెస్ట్ చేయాల్సి ఉందని సీబీఐ అధికారులు చెబుతున్నారు.