Republic Day 2024: తెలంగాణ శకటం థీమ్ ఖరారు - చుట్టూ ఆ కళాకారులతో నృత్యాలు
Telangana Tableau in Republic Day 2024: శకటం ప్రదర్శనకు వచ్చే సమయంలో దానికి రెండు వైపులా రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా కొమ్ముకోయ, గుస్సాడి, డప్పుల నృత్యాల కళాకారుల ప్రదర్శన ఉండే అవకాశం ఉంది.
Republic Day 2024 Theme: జనవరి 26న ఢిల్లీలోని కర్తవ్య పథ్ (రాజ్ పథ్) లో జరిగే గణతంత్ర దిన వేడుకల్లో తెలంగాణ శకటం ఈసారి కనిపించనుంది. ఈసారి తెలంగాణ శకటం థీమ్ కూడా ఇప్పటికే ఖరారు కాగా.. వాటిని కేంద్రం ఎంపిక చేసింది. గత మూడు నాలుగేళ్లుగా గణతంత్ర వేడుకల్లో తెలంగాణ శకటం కనిపించకుండా ఉన్న సంగతి తెలిసిందే. మదర్ ఆఫ్ డెమోక్రసీ పేరుతో ఈ ఏడాది తెలంగాణ శకటం రాజ్ పథ్ లో కనిపించనుంది. చాకలి ఐలమ్మ, కొమరం భీం, రాంజీ గోండు తదితర పోరాట యోధులతో శకటాన్ని ఏర్పాటు చేశారు. ఈ థీమ్‌కు కేంద్ర రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. జనవరి 26న కర్తవ్య పథ్‌లో తెలంగాణ శకటం మదర్ ఆఫ్ డెమోక్రసీ థీమ్‌తోనే సందడి చేయనుంది.
జనవరి 26న కర్తవ్య పథ్ లో తెలంగాణ శకటం మదర్ ఆఫ్ డెమోక్రసీ పేరుతో ప్రదర్శనకు వచ్చే సమయంలో దానికి రెండు వైపులా రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా కొమ్ముకోయ, గుస్సాడి, డప్పుల నృత్యాల కళాకారుల ప్రదర్శన ఉండే అవకాశం ఉంది.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో ఒకసారి, 2020లో మరోసారి రిపబ్లిక్ డే పరేడ్‌లో తెలంగాణ శకటం కనువిందు చేసింది. మళ్లీ నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర శకటానికి అవకాశం లభించింది.
ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అన్ని రాష్ట్రాల శకటాలకు సంబంధించి ఎంపిక పనులు గత నెలలోనే పూర్తయ్యాయని చెప్పారు. ఇటీవల తాను ప్రధాని మోదీని కలిసిన సమయంలో తెలంగాణ శకటానికి కూడా అనుమతి ఇవ్వాలని తాను కోరగా.. ఆయన ఓ లేఖ ఇవ్వాలని చెప్పినట్లుగా గుర్తు చేశారు. గత ప్రభుత్వం కేంద్రంతో సఖ్యతగా లేకపోవడం వల్ల ఇన్నాళ్లూ తెలంగాణ శకటం పరేడ్ లో కనిపించలేదని రేవంత్ రెడ్డి అన్నారు. తాను కోరగానే ప్రధాని తెలంగాణ శకటానికి అంగీకరించారని అన్నారు.
మరోవైపు రిపబ్లిక్ డే పరేడ్ కోసం ఎంపికైన ఏపీ శకటం కూడా ఎంపికైంది. ఈసారి డిజిటల్ క్లాస్ రూమ్ థీమ్‌తో ప్రదర్శన చేయనున్నారు. దేశంలోనే తొలిసారిగా 62 వేల డిజిటల్ క్లాస్ రూమ్‌ల ద్వారా ఏపీలో విద్యాబోధన చేస్తున్నారని ప్రభుత్వం చెబుతోంది. అందుకే ఈసారి అదే థీమ్ ను వారు ఎంచుకున్నారు. జనవరి 26న కర్తవ్య పథ్‌లో వికసిత్ భారత్ థీమ్‌లో భాగంగా రిపబ్లిక్ డే వేడుకల్లో తెలంగాణ, ఏపీ శకటాలు కనువిందు చేయనున్నాయి.