Covid Cases in Telangana: తెలంగాణలో కొత్తగా 12 కరోనా కేసులు, వాటిలో 9 హైదరాబాద్‌లోనే
Telangana COVID Cases: తెలంగాణలో గత 24 గంటల్లో 12 కొత్త కేసులు వెలుగులోకి వచ్చినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.
Telangana Health Bulletin: దేశవ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్ తో ఆందోళన అవసరం లేదని నిపుణులు చెబుతున్నా...పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తెలంగాణలో గత 24 గంటల్లో 12 కొత్త కేసులు వెలుగులోకి వచ్చినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. మరో 30 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. హైదరాబాద్‌లో 9, వరంగల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ఒక్కొటి చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,322 కొవిడ్ టెస్టులు చేయడంతో ఈ పాజిటివ్ లు బయటపడ్డాయి. మరో 38 మంది బాధితులు చికిత్స తీసుకుంటున్నారు. బాధితుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం సీడీఎఫ్‌డీ, గాంధీ ఆస్పత్రికి పంపించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది.
మంత్రి దామోదర రాజనర్సింహ...వైద్యారోగ్యశాఖ అధికారులతో కొవిడ్ పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్ల వివరాలపై ఆరా తీశారు. కరోనా బాధితులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ల్యాబ్‌ల్లో రోజుకు 16,500 ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయగలిగే సామర్థ్యం ఉందని అధికారులు మంత్రికి వివరించారు. మరో 84 ప్రైవేటు ల్యాబ్ లు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. ఈ నెలాఖరులోగా రోజుకు 4వేల ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతిరోజూ సాయంత్రం 4గంటల లోపే కొవిడ్ బులిటెన్ విడుదల చేయాలని వైద్యారోగ్య శాఖ కార్యదర్శికి సూచించారు.
మిక్రాన్ సబ్ వేరియంట్ జేఎన్1 లక్షణాలు
జ్వరం, ముక్కు కారడం, గొంతునొప్పి, తలనొప్పి మిక్రాన్ సబ్ వేరియంట్ జేఎన్1 లక్షణాలు. కొంతమందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు.. గుంపుల్లోకి వెళ్లకపోవడం, మాస్క్ ధరించడం తప్పనిసరిగా పాటించాలి. కేసులు పెరిగితే మళ్లీ టెస్టులు చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు.
న్యుమోనియా లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారిలోనూ కొవిడ్ కొత్త వేరియంట్ లక్షణాలు ఉంటున్నాయి. నగరంలో 14 నెలల బాలుడికి న్యుమోనియా లక్షణాలు ఉండటంతో నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. కొవిడ్ పరీక్షలు చేయడంతో పాజిటివ్ గా నిర్దారణ అయింది. న్యుమోనియా, ఇతర శ్వాసకోశ వ్యాధులతో వచ్చే పిల్లలందరికీ కరోనా పరీక్షలూ చేస్తున్నారు. ప్రస్తుతం నిలోఫర్ హాస్పిటల్ లో న్యుమోనియాతో 83 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. వీరందరికీ కరోనా పరీక్షలు చేశారు. కరోనా వైరస్ కారణంగా న్యుమోనియా సోకుతోందని, జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మరోవైపు కేంద్రం ప్రభుత్వం వైరస్ కట్టడికి అన్ని ప్రభుత్వాలు నియంత్రణ చర్యలు చేపట్టాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. జిల్లాల వారీగా ఆసుపత్రులకు వచ్చే ఇన్‌ఫ్లుయెంజా లైక్ ఇల్‌నెస్, సీవియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్‌నెస్ రోగులను నిరంతరం పర్యవేక్షించాలని, వారి వివరాలను ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్‌ఫామ్‌లో నమోదు చేయాలని సూచించింది. ఆర్‌టీపీసీఆర్ టెస్టులు అధికంగా చేపట్టి పాజిటివ్ నమూనాలను జన్యు పరిణామ విశ్లేషణ కోసం ఇన్సాకాగ్ లేబొరేటరీలకు పంపి కొత్త వేరియంట్లను సకాలంలో గుర్తించే ప్రయత్నం చేయాలి. రాబోయే పండగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని వైరస్ విస్తరించకుండా అడ్డుకోవడానికి తగిన నియంత్రణ చర్యలు చేపట్టాలి. శ్వాశకోశ సంబంధ పరిశుభ్రత పాటించేలా చూడాలని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది.