ఉద్యోగం మానేస్తా అని చెప్పలేక చేతివేళ్లనే నరికేసుకున్న గుజరాత్ వ్యక్తి. అసలేం జరిగిందంటే..
Surat Man Chops his Fingers: చేస్తున్న ఉద్యోగం ఇష్టం లేకపోతే చాలామంది మానేస్తారు. కానీ ఈ విషయం యజమానికి చెప్పలేక ఏకంగా నాలుగువేళ్లను కోసేసుకున్నాడు ఓ యువకుడు.- ఈ సంఘటన పూర్తి వివరాలు ఏంటంటే..
Surat Man Chops his Fingers: గుజరాత్‌లోని సూరత్‌లో జరిగిన సంఘటన షాక్ కు గురిచేసింది. సూరత్‌లోని వజ్రాల దుకాణంలో పనిచేసే ఓ వ్యక్తి ఏకంగా నాలుగు వేళ్లను కోసేసుకోవడం సంచలనం కలిగించింది. 32 ఏళ్ల మయూర్ తరాపరా సూరత్ లోని ఓ వజ్రాల దుకాణంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఉద్యోగంలోని ఒత్తిడిని తట్టుకోలేక ఎలాగైనా అక్కడ నుంచి బయటపడాలని చూశాడు. కానీ అతను పనిచేస్తోంది వారి బంధువుల దుకాణం కావడంతో ఆ విషయాన్ని యజమానికి చెప్పలేక.. తాను ఉద్యోగం చేయలేక తీవ్ర మానసిక సంఘర్షణకు గురై ఈ పనికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. చేతి వేళ్లను నరికేసుకుంటే ఇక తాను ఉద్యోగానికి పనికిరానని భావించి ఈ పని చేసినట్లు చెప్పారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఈ విషయాన్ని మొదట అతను బయటకు చెప్పలేదు. తన చేతివెళ్లను తాను స్పృహలో లేనప్పుడు ఎవరో కోసుకువెళ్లారని చెప్పాడు. తాను తన స్నేహితుడి ఇంటికి వెళుతుండగా స్పృహ తప్పి రోడ్డుపైన పడిపోయానని.. తనకు మత్తు మందు ఇచ్చి ఎవరో వేళ్లని కోసుకుని తీసుకెళ్లారని చెప్పాడు. క్షుద్ర పూజలు చేసే వ్యక్తులు ఎవరైనా పని చేసి ఉంటారని పోలీసులు మొదట భావించారు. కానీ కేసును విచారించే కొద్దీ జరిగిన సంఘటనకు మయూర్ చెప్పే విషయాలకు పొంతన కుదర్లేదు.
తానే కోసుకున్నట్లు అంగీకరించిన మయూర్
క్రైమ్ బ్రాంచ్ విచారణలో కొత్త విషయాలు తెలిశాయి. సంఘటన జరిగినప్పుడు అతని మోటర్ సైకిల్, ఫోన్, నగదును ఎవరూ ముట్టుకోలేదు. అలాగే అతనిపై దాడి జరిగిందన్న ఆధారాలు కూడా పోలీసులకు లభించలేదు. వాళ్లు గట్టిగా నిలదీయడంతో మయూర్ నిజాన్ని అంగీకరించాడు. తానే ఈ చర్యకు పాల్పడ్డట్లు అంగీకరించాడు. “ సింగాన్‌పూర్ కూడలిలో ఓ పదునైన కత్తిని కొన్నట్లు తారాపరా తెలిపాడు. ఆ తర్వాత నాలుగురోజులకు అంటే అంటే ఆదివారం రాత్రి 10 గంటల సమయంలోఅమ్రోలీ రింగ్ రోడ్డుపై మోటర్ సైకిల్‌ను నిలిపి కత్తితో నాలుగు వేళ్లను నరుక్కున్నాడు. చేతినుంచి రక్తం ఎక్కువుగా బయటకు రాకుండా మోచేతి వద్ద గట్టిగా కట్టాడు. ఆ తర్వాత కత్తిని, వేళ్లను ఓ బ్యాగులో వేసి రోడ్డుపక్కన పడేశాడు. ” అని ఓ అధికారి తెలిపారు
Also Read: Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
ఉద్యోగం నరకం
ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి కారణాన్ని తారపరా పోలీసులకు చెప్పాడు. ఉద్యోగంలో తాను బందీనయ్యానని... తనకు ఆ జాబ్ ఏ మాత్రం ఇష్టం లేదని అతను చెప్పాడు. తన యజమాని తన తండ్రికి బంధువని కుటుంబ అవసరాల రీత్యా బలవంతంగా ఆ ఉద్యోగం చేయాల్సి వస్తోందన్నారు. ఉద్యోగం ఇష్టం లేదన్న విషయం యజమానికి కానీ..మరొకరికి కానీ చెప్పే ధైర్యం తనకు లేకపోయిందని చెప్పాడు. మయూర్ తారాపరా సూరత్ మినీ బజార్‌లోని అనబ్ జెమ్స్‌లోని అకౌంట్స్ విభాగంలో కొన్నాళ్లుగా కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి పెళ్లయ్యి రెండేళ్లు పాప కూడా ఉన్నట్లు సమాచారం.