(Source: ECI/ABP News/ABP Majha)
సౌత్ కొరియా ఎన్నికలపై ఆనియన్స్ ఎఫెక్ట్, ఉల్లి ఆకులతో పోలింగ్ బూత్‌లకు ఓటర్లు
South Korea Elections: సౌత్ కొరియాలో ఓటర్లు ఉల్లి ఆకులతో పోలింగ్ బూత్‌లకు వచ్చి ఓట్లు వేస్తున్నారు.
South Korea National Assembly Elections: సౌత్ కొరియాలో ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు (South Korea Elections 2024) జరుగుతున్నాయి. ఓటర్లు పెద్ద ఎత్తున వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇది అన్ని చోట్లా జరిగేదే కదా అనుకోవచ్చు. కానీ..వాళ్లు ఉత్త చేతుల్తో రావడం లేదు. అందరూ ఉల్లిగడ్డలు పట్టుకుని వచ్చి మరీ ఓటు వేస్తున్నారు. సౌత్ కొరియాలో ఉల్లి ఆకులు విపరీతంగా వాడతారు. వాటి ధరలు ఈ మధ్య కాలంలో అమాంతం పెరిగిపోయాయి. ఇప్పుడిదే ఎన్నికల ఫలితాల్ని డిసైడ్ చేసే అంశమైంది. ఈ ఉల్లి ఆకులనే పట్టుకుని రోడ్లపైన కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు సౌత్ కొరియా ఓటర్లు. మొత్తం 300 మంది సభ్యులున్న సౌత్ కొరియా నేషనల్ అసెంబ్లీకి ఎన్నికలు మొదలయ్యాయి. ప్రస్తుత అధ్యక్షుడు యూన్ సుక్ యేల్ (Yoon Suk Yeol) ఇంకా మూడేళ్ల పాటు అదే పదవిలో కొనసాగాల్సి ఉంది. కానీ...ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రకటించడం వల్ల మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. ప్రస్తుతానికి సౌత్ కొరియాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. నిత్యావసర ధరలు మండిపోతున్నాయి. ఈ సమస్యలతో పాటు వృద్ధుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వైద్యులూ తమ సమస్యల్ని తీర్చాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. ఇవన్నీ కలిసి ఆ దేశ ఆర్థిక స్థితినే కాకుండా రాజకీయాల్నీ దెబ్బ కొడుతున్నాయి. ఆసియాలో నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన దక్షిణ కొరియా ఇప్పుడు ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటోంది.
అయితే...ఉల్లి ఆకుల ధరల్ని కట్టడి చేసేందుకు యూన్ కొన్ని సూపర్ మార్కెట్‌లకు స్వయంగా వెళ్లి అక్కడి పరిస్థితుల్ని పరిశీలించారు. ఒక కట్ట ఉల్లి ఆకులకు 875 వాన్‌లు చెల్లించాల్సి వస్తోంది. అంటే మన కరెన్సీలో అది దాదాపు రూ.54. నిజానికి కేవలం ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కొన్ని చోట్ల సబ్సిడీ ఇస్తోంది. అక్కడ మాత్రమే 875 వాన్‌లకు విక్రయిస్తున్నారు. మిగతా చోట్ల మాత్రం దీనికి మూడు, నాలుగు రెట్లు ఎక్కువగా వసూలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఓ కట్ట ఉల్లి ఆకుల ధర 3-4 వేల వాన్‌లుగా ఉంటోంది. అటు ప్రతిపక్ష నేతలూ కూరగాయలు వెంట తీసుకెళ్లి ప్రచారం చేస్తున్నారు. వాళ్ల స్పీచ్‌లలోనూ కూరగాయల ధరల ప్రస్తావనే వస్తోంది. అక్కడి సోషల్ మీడియాలోనూ ఇదే ప్రచారం జరుగుతోంది. ఓటర్లు పోలింగ్ స్టేషన్స్‌కి ఉల్లి ఆకుల కట్టలు పట్టుకుని వచ్చి అక్కడే ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. అయితే...ఎన్నికల సంఘం ఇలా ఉల్లి ఆకులు పట్టుకురావడంపై నిషేధం విధించింది. ఇది ఎన్నికల ఫలితాల్ని ప్రభావితం చేసే ప్రమాదముందని హెచ్చరించింది. భావ ప్రకటనా స్వేచ్ఛకు తాము గౌరవం ఇస్తున్నప్పటికీ దానికీ ఓ పరిధి ఉంటుందని స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం ఇలా బ్యాన్ చేసిందని తెలిసినప్పటి నుంచి ఓటర్లు మరింత అసహనానికి లోనవుతున్నారు. నిషేధం విధించినప్పటికీ కొన్ని చోట్ల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు అన్ని కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. యాపిల్స్ ధర గతంతో పోల్చితే 90% మేర పెరిగింది.