Sonia Gandhi Hospitalized: ఆస్పత్రిలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆరోగ్యం నిలకడగా ఉందని రణ్‌దీప్ సుర్జేవాలా ట్వీట్
కాంగ్రెస్ అధ్యకురాలు ఆస్పత్రిలో చేరారు. ఆమె ఆరోగ్యంగా నిలకడగా ఉందని రణ్‌దీప్ సుర్జేవాలా ట్వీట్ చేశారు.
ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ దిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. ఇటీవలే ఆమెకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఈ నెల 2వ తేదీన కరోనా బారిన పడ్డారు సోనియా. ప్రస్తుతానికి ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా వెల్లడించారు. అబ్జర్వేషన్‌లో ఉంచారని తెలిపారు. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకున్న వారందరికీ కృతజ్ఞతలు అంటూ రణ్‌దీప్ ట్వీట్ చేశారు. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో సోనియా గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)నోటీసులు జారీ చేశారు. ఇందులో భాగంగా జూన్ 8వ తేదీన ఆమె ఈడీ ముందు హాజరు కావాల్సి ఉంది. కానీ అప్పటికే ఆమె కరోనా బారిన పడటం వల్ల ఆమె హాజరు అవుతారా లేదా అన్న విషయంలో స్పష్టత రాలేదు. అయితే ఆమె హాజరు కావటం కష్టమేనని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. ఇప్పటి వరకైతే
ఇందుకు సంబంధించి కాంగ్రెస్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినా ఆరోగ్య సమస్యల్నే కారణంగా చూపించి ఈడీకి హాజరు కాకుండా ఉండే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
అసలేంటీ నేషనల్ హెరాల్డ్ కేస్..?
సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీకి కూడా ఈడీ జూన్ 1వ తేదీన నోటీసులు పంపింది. వీరిద్దరి వాంగ్మూలాలను రికార్డ్ చేసేందుకే నోటీసులు జారీ చేసినట్టు ఈడీ వెల్లడించింది. ఆ మరుసటి రోజే సోనియా గాంధీ కరోనా బారిన పడ్డారు. ఈడీ దర్యాప్తునకు సహకరిస్తామని కాంగ్రెస్ అప్పుడే ప్రకటించింది. కానీ ప్రత్యక్షంగా హాజరు కావటానికి మాత్రం కుదరకపోవచ్చని చెప్పింది. జూన్ 13వ తేదీన రాహుల్ గాంధీ ఈడీ ముందు హాజరు కావాల్సి ఉంది. 1937లో జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రారంభించారు. మహాత్మా గాంధీ, వల్లభాయ్ పటేల్ అప్పట్లో ఈ పత్రికకు మార్గదర్శకత్వం చేశారు. నిజాలు బయట పెడుతున్నారన్న అక్కసుతో బ్రిటీష్ ప్రభుత్వం 1942 నుంచి 1945 వరకూ ఈ పత్రికపై నిషేధం విధించింది. అయితే ఈ పత్రికకు సంబంధించిన ఆస్తులను అక్రమంగా తమ సొంతం చేసుకున్నారని భాజపా ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఫిర్యాదు చేశారు. అప్పుడే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా రాహుల్ గాంధీపై కేసు నమోదైంది. నేషనల్ హెరాల్డ్ పత్రిక కాంగ్రెస్‌కు దాదాపు 90 కోట్ల రూపాయల బకాయి పడింది. వీటిని వసూలు చేసుకునే హక్కుని కాంగ్రెస్ యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి లాక్కునే ప్రయత్నం చేసిందని ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. కరోనా కారణంగా ప్రస్తుతానికి ఈడీ దర్యాప్తునకు బ్రేక్ పడింది.