PM Modi: ప్రధాని మోదీ నివాసంలో 3 అడుగుల నాగుపాము, పట్టుకుని అడవిలో వదిలిన అటవీ అధికారులు
Snake at PM Modi House: ఢిల్లీలోని కల్యాణ్ మార్గ్‌లో ఉన్న ప్రధాని మోదీ నివాసంలో నాగుపాము కనిపించింది. అటవీ అధికారులు ఆ పాముని పట్టుకుని అడవిలోకి వదిలారు.
Snake Rescue: ప్రధాని నరేంద్ర మోదీ ఇంట్లో ఓ పాము కలకలం రేపింది. ఢిల్లీలోని కల్యాణ్ మార్గ్‌లోని మోదీ నివాసంలో 3 అడుగుల నాగుపాము కనిపించింది. ఈ పాముని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమైంది. వైల్డ్‌లైఫ్ SOS కి సమాచారం అందించింది. రెస్క్యూ హెల్ప్‌లైన్‌కి కాల్ చేసి వివరాలు వెల్లడించింది. సమాచారం అందిన వెంటనే మోదీ నివాసానికి వచ్చిన రెస్క్యూ టీమ్ చాలా సేపు శ్రమించి 3 అడుగుల నాగుపాముని పట్టుకున్నారు. ఎలుకను తినేందుకు వెంబడిస్తూ మోదీ నివాసంలోకి వచ్చినట్టు అధికారులు గుర్తించారు. ఆ పాముని పట్టుకున్న తరవాత అన్ని వైద్య పరీక్షలు చేశారు. ఆ తరవాత అటవీ ప్రాంతంలోకి వదిలారు.
కొద్ది రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో పాములు కలకలం రేపుతున్నాయి. వర్షాకాలం రావడం వల్ల పలు చోట్ల కనిపించి అందరినీ భయాందోళనలకు గురి చేస్తున్నాయి. అటవీ అధికారులకు రోజూ కాల్స్ వెళ్తున్నాయి. వెంట వెంటనే పలు టీమ్స్ సమాచారం మేరకు ఆయా ప్రాంతాలకు వెళ్లి పాముల్ని పట్టుకుంటున్నాయి. ఆ తరవాత వాటిని సురక్షితంగా అడవుల్లో వదులుతున్నాయి. గ్రేటర్ నోయిడాలో ఓ భారీ కోబ్రాని గుర్తించారు. ఓ ఇంట్లో ఇది కనిపించింది. వెంటనే స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. ర్యాపిడ్ రెస్పాన్స్ యూనిట్ స్పందించి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. మరో చోట 7 అడుగుల నాగుపాముని గుర్తించారు. దాన్నీ బంధించి అడవిలో వదిలారు. ఇప్పుడు ప్రధాని ఇంట్లోనూ పాముని గుర్తించి ముగ్గురితో కూడిన ఓ టీమ్ వచ్చి పట్టుకుంది.