Shiv Sena Symbol: షిందే వర్గానికి ఆ గుర్తు కేటాయించడం సరైన నిర్ణయమే, చట్ట ప్రకారమే చేశాం - సుప్రీంకోర్టులో ఈసీ వివరణ
Shiv Sena Symbol: శివసేన పార్టీ గుర్తుని షిందే వర్గానికి కేటాయించడాన్ని ఎన్నికల సంఘం సమర్థించుకుంది.
Shiv Sena Symbol Controversy:
మహారాష్ట్ర రాజకీయాల్లో కొన్ని నెలలుగా శివసేన పార్టీ పేరు, గుర్తుపై పోరు కొనసాగుతోంది. ఠాక్రే, షిందే గ్రూపుల మధ్య ఘర్షణ జరుగుతూనే ఉంది. ఎన్నికల సంఘం ఆ పార్టీ పేరుని, గుర్తిని షిందే వర్గానికి కేటాయించిన తరవాత ఈ వైరం ఇంకా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం చేసిన కుట్ర అంటూ థాక్రే వర్గం తీవ్రంగా మండి పడుతోంది. ఇప్పటికే ఈ విషయమై సుప్రీంకోర్టుని ఆశ్రయించింది థాక్రే వర్గం. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాలు చేస్తూ పిటిషన్ వేసింది. అయితే దీనిపై ఎన్నికల సంఘమూ స్పందించింది. తాము తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకుంది. శివసేన పార్టీ పేరుని,గుర్తుని షిందే వర్గానికి కేటాయించడం సరైన నిర్ణయమే అని వెల్లడించింది. చట్టప్రకారమే నిర్ణయం తీసుకున్నామని తేల్చి చెప్పింది. థాక్రే వర్గం వేసిన పిటిషన్‌కు ఈ బదులు ఇచ్చింది.
"శివసేన పార్టీ గుర్తుని షిందే వర్గానికి కేటాయించడాన్ని సమర్థించుకుంటున్నాం. అన్ని కోణాల్లో పరిశీలించాకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఉద్దవ్ థాక్రే ప్రస్తావించిన అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకున్నాం. ఆ తరవాతే ఈ కీలక ప్రకటన చేశాం"
- ఎన్నికల సంఘం
Shiv Sena symbol issue | Election Commission files reply in SC on plea challenging EC's decision
— ANI (@ANI) March 15, 2023
EC justifies its decision to allot the symbol to the Shinde camp and says it was a well-reasoned order and covers all the issues raised by the Uddhav camp.. pic.twitter.com/1QunZiE5qW
Election Commission says it has passed the order as quasi-judicial capacity.
— ANI (@ANI) March 15, 2023
ఇదీ జరిగింది..
శివసేన పార్టీ ఇక నుంచి బాల్ థాక్రే కుటుంబసభ్యులది కాదు. ఆయన పార్టీ నుంచి చీలిపోయిన ఏక్ నాథ్ షిండేదేనని గత నెలలో ఎన్నికల సంఘం తేల్చింది. ఎన్నికల సంఘం నిర్ణయంతో ఉద్దవ్ థాక్రేకు ఊహించని షాక్ తగిలింది. ఆయనకు పార్టీ కూడా దక్కకుండా పోయింది. పార్టీ చీలిక వర్గమైన ప్రస్తుత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే వర్గానికే శివసేన పార్టీ పేరు, ఆ పార్టీకి చెందిన బాణం గుర్తు దక్కుతుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఉద్దవ్ థాక్రే కేబినెట్లో మంత్రిగా ఉన్న షిండే తిరుగుబాటు చేయడంతో అప్పటివరకు అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. శివసేనకు ఉన్న యాభై ఆయనకు 40 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. సీఎంగా షిండే బాధ్యతలను చేపట్టారు. అనూహ్యంగా డిప్యూటీ సీఎం పదవీని దేవేంద్ర ఫడ్నవీస్‌కు అప్పగించారు. మొత్తం 19 మంది ఎంపీల్లో 12 మంది షిండే వైపున్నారు. ఆ తర్వాత శివసేన ఎవరిదన్న వివాదం ఏర్పడటంతో శివసేన పార్టీ పేరు, గుర్తు రెండూ ఈసీ స్తంభింప చేసింది. శివసేన పార్టీ చీలిక వర్గాల(ఏక్ నాథ్ షిండే, ఉద్ధవ్ థాక్రే)కు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త పార్టీ పేర్లు కేటాయించింది. ఉద్ధవ్ థాక్రే వర్గానికి 'కాగడా' గుర్తును కేటాయించింది. 'శివసేన- ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే' పేరును థాక్రే వర్గానికి కేటాయించింది. 'బాలాసాహెబంచి శివసేన' అన్న పేరును మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి కేటాయించింది ఈసీ.
Also Read: Imran Khan Arrest: లండన్ ప్లాన్‌లో భాగంగానే నా అరెస్ట్, ఇదంతా నవాజ్ షరీఫ్ కుట్ర - ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు