(Source: ECI/ABP News/ABP Majha)
దర్యాప్తు సంస్థల దాడులను నిరసిస్తూ ప్రతిపక్షాల పిటిషన్, విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం
SC on CBI, ED: దర్యాప్తు సంస్థల దాడులకు వ్యతిరేకంగా 14 ప్రతిపక్ష పార్టీలు వేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది.
Supreme Court:
14 పార్టీల పిటిషన్
దేశవ్యాప్తంగా పలు చోట్ల సీబీఐ,ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. బిహార్‌లో ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ విచారణ జరుగుతోంది. ఢిల్లీలో లిక్కర్ స్కామ్ వేడి ఇంకా చల్లారలేదు. అయితే ఈ దాడులపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ప్రతిపక్ష పార్టీలను అణిచివేసేందుకు దర్యాప్తు సంస్థల్ని పావులుగా వాడుకుంటున్నాయని తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే 14 ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టుని ఆశ్రయించాయి. కేంద్రానికి వ్యతిరేకంగా పిటిషన్ వేశాయి. ప్రతిపక్షాలపై పక్షపాత ధోరణితో దాడులు చేయిస్తోందని ఆ పిటిషన్లో తెలిపాయి. ఈ పిటిషన్‌ను పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం...విచారణకు అంగీకరించింది. ఏప్రిల్ 5వ తేదీన వాదనలు వింటామని స్పష్టం చేసింది. కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీ, రాష్ట్రీయ జనతా దళ్, తృణమూల్ కాంగ్రెస్, DMK సహా మరి కొన్ని పార్టీలు ఈ పిటిషన్ వేశాయి. బీజేపీలో చేరగానే అన్ని ఈ దాడులు ఆపేస్తున్నారని విమర్శించాయి. బీజేపీ మాత్రం ఈ విమర్శలను కొట్టి పారేస్తోంది. దర్యాప్తు సంస్థలు చట్టప్రకారమే నడుచుకుంటున్నాయని తేల్చి చెబుతోంది. స్వతంత్రంగా పని చేస్తున్నాయని వివరిస్తోంది.
SC agrees to hear on April 5 plea filed by 14 political parties led by Congress alleging arbitrary use of ED and CBI in arresting opposition leaders. pic.twitter.com/yOYiTgI0tn
— ANI (@ANI) March 24, 2023
సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మను సింఘ్వీ ఈ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ వద్ద ప్రస్తావించారు. అత్యవసర విచారణ జరపాలన కోరారు. CBI,EDలను తమకు వ్యతిరేకంగా పని చేసేలా బీజేపీ ఉసిగొల్పుతోందని 14 పార్టీలు పిటిషన్ వేశాయని వివరించారు. దాదాపు 95% మేర కేసులు ప్రతిపక్ష నేతలపైనే ఉన్నాయని చెప్పారు. బిహార్ డిప్యుటీ సీఎం తేజస్వీ యాదవ్‌కు సమన్లు జారీ చేసిన విషయాన్ని చెప్పారు. వీటన్నింటినీ పరిశీలించిన సుప్రీం కోర్టు ఏప్రిల్ 5న విచారిస్తామని వెల్లడించింది.
ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్
ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసు విచారణకు హాజరవుతానని బిహార్ డిప్యుటీ సీఎం తేజస్వీ యాదవ్ ఢిల్లీ హైకోర్టులో వెల్లడించారు. మార్చి 25న కోర్టులో హాజరవుతానని తెలిపారు. ఇప్పటికే సీబీఐ మూడు సార్లు ఆయనకు నోటీసులు పంపింది. కానీ ప్రతిసారి ఏదో ఓ కారణం చెబుతూ హాజరు కాలేదు. ఈ సారి మాత్రం తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారు. సీబీఐ నోటీసులు పంపినా స్పందించకపోవడంపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన కోర్టు...ఎందుకు హాజరు కావడం లేదని ప్రశ్నించింది. తేజస్వీ తరపున వాదించిన న్యాయవాది తన వాదనలు వినిపించారు. సీబీఐ ఎదుట హాజరైతే ఆయనను అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతారని అన్నారు. బడ్జెట్ సమావేశాల కారణంగా ఏప్రిల్ 5వ తేదీ తరవాతే సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌కు వెళ్తారని వివరించారు. ఈ వాదనలు విన్న సీబీఐ తేజస్వీని అరెస్ట్ చేసే ఆలోచనే లేదని తేల్చి చెప్పింది.
Also Read: ప్రజలకు మంచి బోధించాలని అల్లాయే రాముడిని పంపాడు, ఆయన అందరివాడు - ఫరూక్ అబ్దుల్లా