Russia Ukraine Crisis: మళ్లీ యుద్ధ మేఘాలు- రష్యా కాల్పుల్లో ఐదుగురు ఉక్రెయిన్ జవాన్లు మృతి
తమ దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఉక్రెయిన్ సైనికులపై కాల్పులు జరిపినట్లు రష్యా ప్రకటించింది. ఈ కాల్పుల్లో ఐదుగురు మృతి చెందినట్లు తెలిపింది.
ఉక్రెయిన్- రష్యా మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నట్లు కనిపిస్తున్నాయి. తమ దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన కొంతమంది బృందంపై తాము కాల్పులు జరిపామని రష్యా సైన్యం ప్రకటించింది. ఈ కాల్పుల్లో ఐదుగురు ఉక్రెయిన్ సైనికులు మరణించినట్లు వెల్లడించింది. తమ భూభాగంలోనే ఉక్రెయిన్ సైనికులను హతమార్చినట్లు పేర్కొంది.
Russian Army says killed 5 'saboteurs' from Ukraine on Russian territory: AFP News Agency
— ANI (@ANI) February 21, 2022
రష్యా వాదన
ఈ కాల్పుల్లో రష్యా సైనికులు ఎవరూ గాయపడలేదని ఆ దేశం వెల్లడించింది. ఉక్రెయిన్ సాయుధ దళాలు రెండు యుద్ధ వాహనాల్లో రష్యా భూభాగంలోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నించాయని వీటిని అడ్డుకునేందుకు కాల్పులు జరిపామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కాల్పుల్లో రెండు వాహనాలు ధ్వంసమైనట్లు వెల్లడించింది.
మాకేం తెలీదు
తమ సైనికులు చొరబాటుకు ప్రయత్నించారన్న రష్యా వాదనను ఉక్రెయిన్ తోసిపుచ్చింది. రష్యా- ఉక్రెయిన్ మధ్య ఇటీవల భారీగా ఎదురుకాల్పులు జరుగుతున్నాయని తెలిపింది. వేర్పాటువాదుల అధీనంలో ఉన్న డాన్‌బాస్‌పై దండయాత్ర చేసే ఆలోచన లేదని ఉక్రెయిన్ మరోసారి స్పష్టం చేసింది.
తమ సైనికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లితే చూస్తూ ఊరుకోబోమని ఉక్రెయిన్ తేల్చి చెప్పింది. సరిహద్దుల్లో తాము కాల్పులకు పాల్పడుతున్నామని రష్యా చేసిన ఆరోపణలను కూడా ఉక్రెయిన్ సైన్యం ఖండించింది.
శాంతి చర్చలు
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను దౌత్యచర్చల ద్వారా అడ్డుకునేందుకు ప్రపంచదేశాలు ప్రయత్నిస్తున్నాయి. జర్మనీ, ఫ్రాన్స్ సహా ఐరోపా దేశాలు ఈ మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలు జరిపాయి. అయినప్పటికీ రష్యా వెనక్కి తగ్గినట్లు కనిపించలేదు.
చుట్టుముట్టి
ఉక్రెయిన్ సరిహద్దులో లక్షా 30 వేలకు పైగా సైన్యాన్ని రష్యా మోహరించింది. ఉత్తర, దక్షిణ, తూర్పు సరిహద్దులన్నింటినీ చుట్టుముట్టింది. ఉక్రెయిన్ సరిహద్దును పంచుకునే బెలారస్లో భారీ ఎత్తున సైనిక విన్యాసాలు నిర్వహించింది. దీంతో యుద్ధం అనివార్యమనే ఆందోళనలు మొదలయ్యాయి. అమెరికా నిఘావర్గాలు కూడా ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరించాయి.
Also Read: Lalu Prasad's Health: సీరియస్‌గా లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం: రిమ్స్