Revanth Reddy US Tour-కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ-రేవంత్ రెడ్డి
డల్లాస్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనలో మగ్గుతున్న తెలంగాణకు..కాంగ్రెస్‌తోనే విముక్తి లభిస్తుందని స్పష్టం చేశారు.
డల్లాస్ తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో రేవంత్
తెలంగాణ ఏ లక్ష్యం కోసమైతే తెచుకున్నామో ఇప్పుడు అది నెరవేరడం లేదని, రాష్ట్రం కేసీఆర్ కుటుంబ పాలనలో బందీ అయిందని విమర్శించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. అమెరికాలోని డల్లాస్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలోని స్థితిగతులపై ప్రసంగించారు. తెలంగాణ కోసం ఎంతో మంది యువకులు, విద్యార్థులు ప్రాణ త్యాగాలు చేశారని, వారి త్యాగం, సోనియమ్మ దీవెన వల్లే ప్రత్యేక రాష్ట్రం సాధించామని గుర్తు చేశారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి బహుమతిగా అధికారం ఇవ్వాలని కోరారు రేవంత్ రెడ్డి. ఎక్కడో మారుమూల పల్లెల్లో పుట్టి అమెరికాలో ఎదగటం సాధారణ విషయం కాదని ఎన్‌ఆర్‌ఐలను ప్రశంసించారు. అమెరికా అభివృద్ధిలో భాగస్వామ్యం ఉండడం గర్వంగా ఉందని కొనియాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం టి.డి. ఎఫ్ ఏర్పాటు చేసి ఎన్ఆర్‌ఐలు ఎంతో శ్రమించారని అన్నారు. పార్టీ చందాలు అడగటానికో, ఓట్ల కోసమే ఇక్కడికి రాలేదన్న రేవంత్ రెడ్డి..తెలంగాణ స్థితిగతులు ఎలా ఉన్నాయో వివరించేందుకే వచ్చామని స్పష్టం చేశారు. తెలంగాణ అనుకున్న లక్ష్యాలు సాధిస్తోందా లేదా అని పరిశీలించాలని, అంతా బాగుందనుకోవటం సరికాదని అన్నారు. కేసీఆర్ కుటుంబం వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ తెలంగాణ అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు రేవంత్ రెడ్డి.
కాంగ్రెస్‌కు అధికారం ఇస్తేనే తెలంగాణకు విముక్తి-రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రజలకు అప్పులు, ఆత్మహత్యలే మిగిలాయని ఉద్యోగాల్లేక యువత సతమతమవుతోందని మండి పడ్డారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా ఇవ్వటం లేదని అసహనం వ్యక్తం చేశారు. 60 ఏళ్లు తెలంగాణలో అన్ని వనరులు అభివృద్ధి చేస్తే కేసీఆర్ కుటుంబం అన్నింటినీ దోచుకుందని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం బందీఖానా నుంచి తెలంగాణను విడిపించాలని రేవంత్ పిలుపునిచ్చారు.
ఖమ్మం జిల్లాలో ఓ యువకుడు ఉద్యోగం లేదన్న బాధతో ఆత్మహత్య చేసుకున్నాడని..అలాంటి సంఘటనలు తెలంగాణలో రోజూ జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మ గౌరవం, స్వయం పాలన సామాజిక న్యాయం కోసం తెలంగాణ తెచుకున్నామన్న రేవంత్, ఈ బానిస బతుకుల నుంచి విముక్తి కోసం కొట్లాడాలని పిలుపునిచ్చారు. ప్రజలు మా వెంట ఉంటే వెనకడుగు వేయకుండా పోరాటం చేస్తామని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు మంచి రోజులు తెచ్చే బాధ్యత తమదేనని వెల్లడించారు రేవంత్. కేసీఆర్ కుటుంబ పాలనకు స్వస్తి పలికేందుకు సహకరించాలని కోరారు. దేశ అభివృద్ధి కోసం పాటు పడుతూ ఎనలేని సేవలందిస్తున్నారని ఎన్‌ఆర్‌ఐలందరినీ ప్రశంసించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.