New Parliament Building: మీ అహంకారంతో కాదు రాజ్యాంగ విలువలతో పార్లమెంట్ తయారైంది - రాహుల్ ఫైర్
New Parliament Building: పార్లమెంట్ ప్రారంభోత్సవ విషయంలో రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
New Parliament Building:
రాహుల్ గాంధీ ట్వీట్
కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరు కావడం లేదని ఇప్పటికే విపక్షాలు స్పష్టం చేశాయి. కాంగ్రెస్ సహా మొత్తం 19 పార్టీలు ఈ మేరకు లేఖ కూడా రాశాయి. దీనిపై కేంద్రమంత్రి అమిత్‌షాతో పాటు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా స్పందించారు. దీనిపై రాజకీయాలు చేయొద్దని అన్నారు. అయితే..అటు విపక్షాలు మాత్రం బీజేపీపై మండి పడుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని పక్కన పెట్టి ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌ని ప్రారంభించడమేంటని ప్రశ్నిస్తున్నాయి. ఈ వివాదంపై రాహుల్ గాంధీ స్పందించారు. ట్విటర్ వేదికగా బీజేపీపై మండి పడ్డారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా జరిపించకపోవడం ఆమెకు అవమానకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"భారత రాజ్యాంగంలోనే అత్యున్నత పదవి రాష్ట్రపతి. ఆ హోదాలో ఉన్న వ్యక్తి చేత పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించకపోవడం ఆ పదవిని కించపరిచినట్టే అవుతుంది. పార్లమెంట్ అనేది మీ అహంకారంతో కాదు, రాజ్యాంగ విలువలతో తయారవుతుంది"
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత
राष्ट्रपति से संसद का उद्घाटन न करवाना और न ही उन्हें समारोह में बुलाना - यह देश के सर्वोच्च संवैधानिक पद का अपमान है।
— Rahul Gandhi (@RahulGandhi) May 24, 2023
संसद अहंकार की ईंटों से नहीं, संवैधानिक मूल्यों से बनती है।
ఈ కార్యక్రమాన్ని బైకాట్ చేస్తున్నట్టు కాంగ్రెస్ ప్రకటించిన కాసేపటికే రాహుల్ గాంధీ ఈ ట్వీట్ చేశారు. మొత్తం 19 పార్టీలు ఒకే మాటపై ఉన్నాయి. "పార్లమెంట్‌లో ప్రజాస్వామ్యానికి చోటులేదు. అందుకే మాకు ఆ బిల్డింగ్‌లో ఎలాంటి విలువలూ కనిపించడం లేదు" అని తేల్చి చెబుతున్నాయి. కాంగ్రెస్ నిర్ణయాన్ని ప్రకటిస్తూ కేసీ వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
"కాంగ్రెస్ పార్టీతో సైద్ధాంతికంగా కలిసొచ్చే పార్టీలన్నింటితోనూ చర్చించాకే బైకాట్ చేయాలని నిర్ణయించుకున్నాం. విపక్షాలన్నీ ఈ విషయంలో ఒక్కటవడం చాలా సంతోషంగా ఉంది"
- కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని పూర్తిగా పక్కన పెట్టి ప్రధాని మోదీ ఒక్కరే పార్లమెంట్‌ని ఆవిష్కరించాలనుకోవడం చాలా అవమానకరమని.. ఇది ప్రజాస్వామ్యానికే మచ్చ తెచ్చి పెడుతుందని విపక్షాలు గట్టిగా విమర్శిస్తున్నాయి.
ఈ నెల 28వ తేదీన జరగనున్న కొత్త పార్లమెంట్ ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యే ప్రసక్తే లేదని విపక్షాలు తేల్చి చెప్పాయి. ఇప్పటికే 19 పార్టీలు లేఖ రాశాయి. ఈ నిర్ణయంపై కేంద్రహోం మంత్రి అమిత్ షా స్పందించారు. దీన్ని రాజకీయం చేయొద్దని అన్నారు. ఈ పార్లమెంట్ భవనం ప్రధాని మోదీ దూరదృష్టికి నిదర్శనం అని వెల్లడించారు.
"ఈ కొత్త పార్లమెంట్ భవనం ప్రధాని మోదీ ముందుచూపుకి నిదర్శనం. మే 28వ తేదీన ప్రధాని ఈ భవనాన్ని దేశానికి అంకితం చేయనున్నారు. దాదాపు 60 వేల మంది కార్మికుల శ్రమతో కట్టిన భవనమిది. ఇది చిరస్థాయిలో నిలిచిపోతుంది. ఈ కార్యక్రమంలోనే ఆ కార్మికులందరినీ ప్రధాని మోదీ సత్కరిస్తారు"
- అమిత్ షా, కేంద్ర హోం మంత్రి
Also Read: Sengol in Parliament: పార్లమెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా సెంగోల్, ఏంటీ దీని కథ - ఎందుకంత ప్రత్యేకం?