What Next Rahul Gandhi : రాహుల్ గాంధీ ఎన్నికల్లో 8 ఏళ్ల పోటీ చేయలేరు - ఇక మిగిలింది ఒకటే ఆశ !
రాహుల్ గాంధీ జైలుకు వెళ్లక తప్పదా? రాహుల్ గాంధీ ముందు ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ ఏమిటి ?
What Next Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ కూటమి గెలిస్తే ప్రధానమంత్రి అవుతారని ఆశలు పెట్టుకున్న రాహల్ గాంధీకి అసలు ఎన్నికల్లో పోటీ చేసే అర్హతనే కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. పరువు నష్టం కేసులో తనకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ గుజరాత్ హైకోర్టులో సవాల్ చేసినా ప్రయోజనం లేకపోయింది. "రాహుల్ గాంధీపై 10కిపైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దోషిగా తేలిన కేసు తర్వాత కూడా పలు కేసులు దాఖలయ్యాయి. వీర్ సావర్కర్ మనవడు కూడా కేసు వేశారు. ఏదిఏమైనా.. మోదీ ఇంటి పేరు వివాదంలో పడిన శిక్షతో రాహుల్ గాంధీకి అన్యాయం జరిగింది అనడానికి ఏం లేదు! ఈ తీర్పు సరైనదే. సూరత్ కోర్టు ఆదేశాలపై జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు " అని గుజరాత్ హైకోర్టు తీర్పునిచ్చింది.
సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవడమే మార్గం
2024 లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాహుల్ గాంధీపై గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ కు కూడా షాక్ తగిలినట్టు అయ్యింది. ఏదైనా కేసులో దోషిగా తేలితే, సంబంధిత వ్యక్తి 8ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిబంధనల్లో ఉంది. అలాంటిది.. 2024 ఎన్నికల వేళ రాహుల్ గాంధీ పోటీ చేయకపోతే ఎలా? అని కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. హైకోర్టు తీర్పుపై ఇప్పుడు రాహుల్ గాంధీకి ఒక్కటే ఆప్షన్ మిగిలింది. అదే సుప్రీంకోర్టుకు వెళ్లడం . సుప్రీంకోర్టులో పిటిషన్ వేసుకుని రెండేళ్ల జైశిక్షపై స్టే తెచ్చుకుంటే తప్ప.. ఆయనకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 8(3) ఏం చెబుతోందంటే ?
ఏదైనా నేరానికి పాల్పడి, రెండు సంవత్సరాల కంటే తక్కువ కాకుండా జైలు శిక్ష విధించబడిన వ్యక్తి [సబ్-సెక్షన్ (1) లేదా సబ్-సెక్షన్ (2)లో సూచించిన ఏదైనా నేరం కాకుండా అటువంటి నేరారోపణ తేదీ నుండి అనర్హులు అవుతారు . అతను విడుదలైనప్పటి నుండి మరో ఆరు సంవత్సరాల పాటు అనర్హుడిగా కొనసాగాలి. ఈ నిబంధన ప్రకారం రాహుల్ గాంధీ అనర్హడవుతారు.
రాహుల్ గాంధీ జైలుకెళ్లక తప్పని పరిస్థితి !
సుప్రీంకోర్టులోనూ శిక్షపై స్టే లభించకపోతే ఆయన జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అన్ని రకాల న్యాయస్థానాల్లో అవకాశాలు కోల్పోయిన తర్వాత ఆయన .. జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. ఇలా జైలుకు వెళ్తే.. పరువు నష్టం కేసులో జైలుకు వెళ్లిన ప్రధాని పదవికి పోటీ పడే నేతగా చరిత్రకెక్కుతారు. రెండేళ్ల పాటు జైల్లో ఉండి... విడుదలైన తర్వాత ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అవుతారు. ఈ కారణంగా రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో వేయబోయే పిటిషన్‌పై ఉత్కంఠ నెలకొంది.