Passport: పాస్‌పోర్ట్‌లో పేజీలు చింపేశాడు, ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు
ముంబయిలో ఓ వ్యక్తి, తన ట్రావెలింగ్ హిస్టరీ భార్యకు తెలియకూడదని పాస్‌పోర్ట్‌లోని పేజీలు చింపేశాడు.
అరెరే దొరికిపోయానే..
మాల్దీవ్స్‌కు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడా వ్యక్తి. ముంబయిలోని ఎయిర్‌పోర్ట్‌కు వచ్చాడు. క్యూలో నిలుచుని ఇమిగ్రేషన్ కౌంటర్ దగ్గరకు వెళ్లాడు. ఇంకాసేపట్లో ఫ్లైట్ ఎక్కుతానని అనుకున్న ఆ వ్యక్తికి అధికారులు షాక్ ఇచ్చారు. విమానం ఎక్కేందుకు వీల్లేదని తేల్చి చెప్పారు. "అరెరే దొరికిపోయానే" అని నాలుక కరుచుకున్నాడు ఆ ప్రయాణికుడు. అతని పాస్‌పోర్ట్‌లో కొన్ని పేజీలు మిస్ అయ్యాయని గుర్తించిన అధికారులు, ఆ వ్యక్తిని ఫ్లైట్ ఎక్కకుండా ఆపేశారు. అనుమానం వచ్చి ఆరా తీస్తే గానీ అసలు విషయం బయట పడలేదు. వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు.
ఏం జరిగిందంటే..
సందర్శి యాదవ్ తన పాస్‌పోర్ట్‌లోని దాదాపు 10పేజీలు చింపేశాడు. 2019లో సందర్శికి వివాహమైంది. అయితే, ఈ వివాహానికి ముందు తాను ఎక్కడెక్కడికి వెళ్లాలో ఎవరికీ తెలియకూడదని ఆ ట్రావెలింగ్ హిస్టరీకి సంబంధించిన అన్ని పేజీలు చించేశాడు. ముఖ్యంగా తన భార్యకు తెలియకూడదనే ఈ పని చేశాడట. పాస్‌పోర్ట్‌లోని 3 నుంచి ఆరో పేజీ వరకూ, 31 నుంచి 34పేజీల వరకూ చింపేశాడు. ఆ సమయంలో సందర్శి
థాయ్‌లాండ్‌కు వెళ్లాడు. ఈ సీక్రెట్‌ను దాచిపెట్టాలనుకుని, ఏం చేయాలో తెలియక ఈ ఐడియా ఇంప్లిమెంట్ చేశానని అంగీకరించాడని పోలీసులు వెల్లడించారు. పోలీసులు నిందితుడిని అంధేరీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్ట్‌లో ప్రవేశపెట్టారు. రూ.25,000 బెయిల్ షూరిటీతో విడుదలయ్యాడు. ఐపీసీతో పాటు పాస్‌పోర్ట్ యాక్ట్ కిందా కేసులు నమోదు చేశారు. అయితే సందర్శి తరపున న్యాయవాది మాత్రం ఇవి ఆరోపణలే అని కొట్టి పారేస్తున్నారు. తన క్లైంట్ చాలా అమాయకుడని, పాస్‌పోర్ట్ సరిగా బైండ్ అవకపోవటం వల్లే ఆ పేజీలు మిస్ అయ్యాయని వెనకేసుకొస్తున్నారు.
ఈ-పాస్‌పోర్ట్‌లు వచ్చేస్తున్నాయ్..
ఇలాంటి అవకతవకలు జరుగుతున్నాయనే, కేంద్ర ప్రభుత్వం చిప్‌తో కూడిన పాస్‌పోర్ట్‌లు జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. అంతర్జాతీయ ప్రయాణాలను సులభతరం చేసేందుకు, వ్యక్తిగత వివరాలకు భద్రత పెంచేందుకు కేంద్రం కొత్తగా ఈ-పాస్‌పోర్ట్‌లు జారీ చేయనుంది. గతేడాదే ఈ-పాస్‌పోర్ట్‌ల అంశాన్ని కేంద్రం ప్రస్తావించగా..ఇటీవల విదేశాంగ మంత్రి జైశంకర్ మరోసారి ఈ అంశంపై చర్చించారు. ఈ ఏడాది చివరి నాటికి ఎలక్ట్రానిక్ పాస్‌పోర్ట్‌లు జారీ చేస్తామని వెల్లడించారు. భారత పౌరులు విదేశీ ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా వీటిని అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ చిప్ ద్వారా ప్రయాణికుడి వివరాలను క్షణాల్లో వెరిఫై చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. నకిలీ పాస్‌పోర్ట్‌ల సమస్యనూ తీర్చుతుంది.
Also Read: Sri Lanka Crisis: శ్రీలంక ప్రధాని విక్రమసింఘే రాజీనామా - అన్ని పార్టీలతో కలిపి ప్రభుత్వం !