ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తే ముక్కు పిండి డబ్బు వసూలు చేయాలి - లా కమిషన్ సూచన
Law Commission: ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసే వాళ్లకు భారీ జరిమానాలు విధించాలని లా కమిషన్ సూచించింది.
Law Commission: లా కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. బహిరంగ ప్రదేశాలు, జాతీయ రహదారులపై పదేపదే రాస్తారోకోలు చేయడంతో పాటు ఆస్తులను ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా పరిగణించాలని తేల్చి చెప్పింది. అలాంటి వాళ్లపై భారీ జరిమానాలు విధించాలని ప్రతిపాదించింది. ఆయా ఆస్తుల మార్కెట్ విలువను లెక్కించి ఆ మేరకు వాళ్ల నుంచి వసూలు చేయాలని వెల్లడించింది. పబ్లిక్, ప్రైవేట్ ప్రాపర్టీస్‌తో పాటు సంస్థలకు నష్టం కలిగించినా జరిమానాలు విధించాలని తేల్చి చెప్పింది. ఇలా అయితేనే అలాంటి చర్యలు తగ్గుతాయని తెలిపింది. ఆస్తులకు నష్టం కలిగించి అరెస్ట్ అయిన వాళ్లకు బెయిల్ దక్కాలంటే కచ్చితంగా ఆ ప్రాపర్టీలు ఎంత విలువ చేస్తాయో అంత డబ్బు చెల్లించాల్సిందే అన్న నిబంధన తీసుకురావాలని లా కమిషన్ సూచించింది. దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ రహదారులపై పదేపదే ప్రతిపక్షాలు ధర్నాలు, రాస్తారోకోలు చేయడం ఇబ్బందికరంగా మారింది. ఆ క్రమంలోనే కొన్ని పబ్లిక్ ప్రాపర్టీస్ ధ్వంసమవుతున్నాయి. అందుకే..లా కమిషన్ ఈ సూచనలు చేసింది. అటు ప్రజలూ తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, ఇది దృష్టిలో పెట్టుకుని చట్టంలో మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరముందని ప్రతిపాదించింది.
"ఎవరైనా సరే ప్రజా ఆస్తులను ధ్వంసం చేస్తే మార్కెట్‌లో వాటి విలువ ఎంత ఉందో లెక్కగట్టాలి. అంత మొత్తం వాళ్ల నుంచి వసూలు చేయాలి. ఇలా ప్రజా ఆస్తులకు నష్టం కలిగించే వాళ్లపై కఠినంగా వ్యవహరించాలి. వాళ్లనే అందుకు బాధ్యులుగా చేయాలి. భారీ జరిమానాలు విధించాలి"
- లా కమిషన్
ఇందుకోసం ప్రత్యేకంగా చట్టం తీసుకురావాలని లా కమిషన్ సూచించింది. Kerala Prevention of Damage to Private Property and Payment of Compensation Act ని అందుకు ఉదాహరణగా చూపించింది. భారతీయ న్యాయ సన్నిహతలో ఇందుకు సంబంధించి ఓ సెక్షన్‌ని చేర్చాలని ప్రతిపాదించింది. రాజకీయ పార్టీలు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి వారించింది. ఇదే సమయంలో Prevention of Damage to Public Property Act of 1984 ని ప్రస్తావించింది. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే వాళ్లను నేరస్థులుగా పరిగణిస్తోంది ఈ చట్టం. అయితే...ఈ చట్టం అమల్లోకి వచ్చిన తరవాత కూడా ఆస్తుల ధ్వంసం కొనసాగుతూనే ఉందని గుర్తు చేసింది లా కమిషన్. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2015లో Damage to Public Property Act (Amendment) Bill ని తీసుకొచ్చింది. కానీ ఇప్పటి వరకూ అది అమల్లోకి రాలేదని అసహనం వ్యక్తం చేస్తోంది లా కమిషన్. పైగా ఏటా ఈ నష్టతీవ్రత పెరుగుతోందని చెబుతోంది.