Protection for Israel: ఇజ్రాయెల్ ప్రజలకు రక్షణ కవచాలు: మమక్, మమద్, మిక్లాట్ షెల్టర్ల గురించి తెలుసా?
1992 నుండి నిర్మించే ప్రతి కొత్త భవనంలో "మమద్" (Merkhav Mugan Dirati - సురక్షిత గది) నిర్మించానలి ఆ చట్టంలో పేర్కొన్నారు. అలాగే అపార్ట్మెంట్లలో "మమక్" (సామూహిక సురక్షిత గది) నిర్మించాల్సి ఉంది.

ఇజ్రాయెల్ దీర్ఘకాలంగా ఇరాన్ నుండి వ్యూహాత్మక ముప్పును ఎదుర్కొంటోంది. అంతేకాకుండా, ఇరాన్ మద్దతు ఉన్న హమాస్, హిజ్బుల్లా, యెమెన్‌లోని హౌతీలు, మరియు పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ గ్రూపుల నుండి ఇజ్రాయెల్ తరచూ దాడులను ఎదుర్కొంటుంది. నిత్యం రాకెట్లు ఇజ్రాయెల్ వైపు దూసుకు వస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో శత్రువుల రాకెట్, క్షిపణి దాడులను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్‌కు రక్షణ కవచంగా ఐరన్ డోమ్, డేవిడ్స్ స్లింగ్ వంటి వైమానిక రక్షణ వ్యవస్థలు, యారో అనే క్షిపణులు అడ్డుకుంటాయని, అందుకే ప్రాణ నష్టాన్ని నివారిస్తుందని చెబుతుంటారు. కానీ, అంతగా వెలుగులోకి రాని ముఖ్యమైన రక్షణ కవచాలు మమక్, మమద్, మిక్లాట్ అనే షెల్టర్ వ్యవస్థలు. వాటి గురించి పూర్తి కథనం కింద చదవండి.
ఐరన్ డోమ్ విఫలమైతే రక్షణ ఎలా?
ఇజ్రాయెల్‌పై వందలాది క్షిపణులు, రాకెట్ లాంచర్లతో దాడులు తరచుగా జరుగుతుంటాయి. అయితే, ప్రాణ నష్టం తక్కువగా ఉండటం నిజంగా ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తోంది. ఇరాన్, ఇరాన్ ప్రాయోజిత గ్రూపుల నుండి వచ్చే రాకెట్లను, క్షిపణులను గాల్లోనే అడ్డుకునేందుకు ఐరన్ డోమ్ అనే రక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్ ఏర్పాటు చేసుకుంది. ఈ ఐరన్ డోమ్ శత్రు దేశాల క్షిపణులను, రాకెట్లను గాల్లోనే పేల్చివేస్తుంది. అయితే, ఆ శకలాలు భూమి మీద పడితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అంతేకాదు, కొన్నిసార్లు వేల సంఖ్యలో రాకెట్లను ప్రయోగిస్తే ఐరన్ డోమ్ అన్నింటినీ అడ్డుకోలేకపోవచ్చు. ఆ సమయంలో ప్రాణ నష్టం అధికంగా జరిగే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితిని ఊహించే ఇజ్రాయెల్ తన ప్రజలకు అవసరమైన షెల్టర్‌ల నిర్మాణాన్ని చేపట్టింది. వీటినే మమక్ మరియు మమద్ అని పిలుస్తారు.
షెల్టర్‌ల ఏర్పాటుకు దారితీసిన కారణాలు
ఇజ్రాయెల్ దేశం ఏర్పడిన తొలి నాళ్లలోనే సరిహద్దు దేశాల నుండి దాడులు ప్రారంభమయ్యాయి. పాలస్తీనా మిలిటెంట్ గ్రూపులు నిత్యం రాకెట్లతో దాడులు జరిపేవి. ఇజ్రాయెల్ చిన్న దేశం కావడంతో, సరిహద్దుల నుండి వచ్చే క్షిపణులు, రాకెట్ లాంచర్లు అతి తక్కువ వ్యవధిలోనే, అంటే ప్రయోగించిన కొన్ని సెకన్లలోపే ఇజ్రాయెల్ భూభాగాన్ని చేరుకునేవి. ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న శత్రు దేశాలు, పాలస్తీనా మిలిటెంట్ గ్రూపుల నుండి నిరంతరం క్షిపణి, రాకెట్ దాడుల బెదిరింపులు కొనసాగాయి. ఇజ్రాయెల్ ఏర్పడిన తొలి దశాబ్దాల్లోనే ఈ ముప్పు స్పష్టమైంది. వీటి నుండి ప్రజలను రక్షించడానికి ఈ సురక్షిత షెల్టర్‌ల అవసరం ఏర్పడింది. అంతేకాకుండా, నిత్యం ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న అరబ్ దేశాలతో ఉన్న వైరం కారణంగా షెల్టర్‌లు అవశ్యకత ఉందని ఆ దేశ పాలకులు భావించారు.
ఇలా 1960లలో పౌరుల రక్షణకు షెల్టర్‌లను నిర్మించడం ప్రారంభించారు. అయితే, షెల్టర్‌ల నిర్మాణాలకు చట్టబద్ధమైన మరియు విస్తృతమైన రూపు వచ్చింది . 1990ల ప్రారంభంలో జరిగిన గల్ఫ్ యుద్ధంలో ఇరాక్ ప్రయోగించిన స్కడ్ మిస్సైల్స్ ఇజ్రాయెల్ భూభాగాన్ని తాకాయి. ఆ సమయంలో వాటిని అడ్డుకునేంత రక్షణ వ్యవస్థలు ఇజ్రాయెల్ వద్ద లేకపోవడంతో షెల్టర్‌ల నిర్మాణం తప్పనిసరి అని భావించారు.
మమద్, మమక్‌ల నిర్మాణం తప్పనిసరి చేసిన ఇజ్రాయెల్
1992లో గల్ఫ్ యుద్ధం తర్వాత, ఇజ్రాయెల్ ప్రభుత్వం పౌర రక్షణ చట్టానికి సవరణలు తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం, 1992 నుండి నిర్మించే ప్రతి కొత్త భవనంలో "మమద్ (Merkhav Mugan Dirati - సురక్షిత గది)" నిర్మించడం తప్పనిసరి. అలాగే, అపార్ట్మెంట్లలో "మమక్ (Merkhav Mugan Komati - సామూహిక సురక్షిత గది)" నిర్మించాల్సి ఉంటుంది. మమద్‌లు శత్రు దేశాల దాడుల సమయంలో చిన్న కుటుంబాలకు రక్షణ ఇస్తే, మమక్‌లు అపార్ట్‌మెంట్లలో ఉండే ఎక్కువ కుటుంబాలకు శత్రు రాకెట్ల నుండి రక్షణ కల్పిస్తాయి. ఈ షెల్టర్‌ల నిర్మాణం ప్రతి కొత్త నిర్మాణ భవనంలో ఏర్పాటు చేయడాన్ని ఇజ్రాయెలీ ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇలా దేశం అంతటా పౌర రక్షణ వ్యవస్థను షెల్టర్‌ల నిర్మాణం ద్వారా బలోపేతం చేసింది. ప్రతి ఇంటికి ఈ మమద్, మమక్‌లు రక్షణ కవచంగా ఉపయోగపడుతున్నాయి.
బహిరంగ ప్రదేశాల్లో పౌర రక్షణ కోసం మిక్లాట్‌లు
ప్రైవేటు ఇళ్లలోనూ, అపార్ట్‌మెంట్లలో రక్షణ కోసం మమద్, మమక్ పేరుతో షెల్టర్‌ల నిర్మాణం తప్పనిసరి చేసిన ఇజ్రాయెల్ ప్రభుత్వం, బహిరంగ ప్రదేశాల్లోనూ పౌరుల రక్షణకు చర్యలు చేపట్టింది. పార్కులు, పాఠశాలలు, మార్కెట్లు, ప్రార్థనా మందిరాలు వంటి బహిరంగ ప్రదేశాల్లో వందలాది మందికి ఈ క్షిపణి దాడుల నుండి రక్షణ కల్పించేందుకు మిక్లాట్ పేరుతో షెల్టర్‌లను నిర్మించింది. స్థానిక ప్రభుత్వాలు వీటిని నిర్మించి పర్యవేక్షిస్తాయి.
షెల్టర్‌ల వినియోగంలో కీలక పాత్ర పోషించే హోమ్ ఫ్రంట్ కమాండ్
ఈ షెల్టర్‌ల నిర్మాణం, నిర్వహణ, మరియు వాటిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇజ్రాయెల్ హోమ్ ఫ్రంట్ కమాండ్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసింది. శత్రు దేశాల నుండి దాడులు ప్రారంభం కాగానే సైరన్ మోగుతుంది. అలాంటి సమయంలో ప్రజలు ఎక్కడి వారక్కడే తక్షణం తమ షెల్టర్‌లలోకి వెళ్లేలా ఈ వ్యవస్థ పౌరులందరికీ శిక్షణ ఇస్తుంది. తద్వారా ప్రాణ నష్టం జరగకుండా హోమ్ ఫ్రంట్ కమాండ్ కీలక పాత్ర పోషిస్తుంది. గాజా వంటి సరిహద్దుల నుండి తరచూ దాడులు జరుగుతుంటాయి; అక్కడి నుండి దాడులు సెకన్ల వ్యవధిలోనే జరుగుతుంటాయి. అతి తక్కువ సమయంలోనూ ప్రాణాలు కాపాడుకునేందుకు ఈ షెల్టర్‌లు ఉపయోగపడుతున్నాయి.
షెల్టర్‌లు ఎలా నిర్మిస్తారంటే?
మమద్, మమక్, మిక్లాట్ షెల్టర్‌ల నిర్మాణం అత్యంత గట్టి పదార్థాలతో జరుగుతుంది. గోడలు, పైకప్పు, మరియు అండర్‌గ్రౌండ్‌లో నిర్మించే ఈ షెల్టర్‌లకు మందపాటి రీన్‌ఫోర్స్డ్ కాంక్రీట్, రీబార్లను ఉపయోగిస్తారు. ఈ నిర్మాణంలో గోడల మందం దాదాపు 25 నుండి 30 సెంటీమీటర్లు ఉంటుంది. ఈ నిర్మాణం పేలుళ్ల దాడులను, వాటి శకలాలను తట్టుకునేలా ఉంటుంది. షెల్టర్‌ల తలుపులు స్టీల్ లేదా ఐరన్‌తో తయారు చేస్తారు. ఇవి పేలుడు నిరోధకంగాను, పేలుడు శకలాలను నిరోధించే విధంగాను, గాలి చొరబడని విధంగా తయారు చేస్తారు. జీవ, రసాయన దాడులు జరిగినా ఆ గ్యాస్ లోపలికి రాకుండా కట్టుదిట్టంగా సీల్ చేయబడి ఉంటాయి. కిటికీలు కూడా స్టీల్, ఐరన్‌తో తయారు చేస్తారు; ఇవి పూర్తిగా కప్పబడి ఉండేలా ఉంటాయి. కాంక్రీట్ నిర్మాణం లోపల బలాన్ని పెంచేందుకు స్టీల్ రీబార్లను ఎక్కువగా వినియోగిస్తారు. జీవ, రసాయన దాడులు జరిగితే ఆ వాయువులను ఫిల్టర్ చేసే ప్రత్యేక ఎయిర్ ఫిల్టర్ సిస్టమ్‌లను అధునాతన షెల్టర్‌లలో ఏర్పాటు చేస్తున్నారు. ఇలా రాకెట్, క్షిపణి, బాంబు దాడుల నుండే కాక, జీవ, రసాయన దాడుల నుండి పౌరులను రక్షించేలా ఇజ్రాయెల్ ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం విశేషం.






















