గుంటూరు వైఎస్‌ఆర్‌సీపీలో ఆగని రగడ- పక్క చూపులు చూస్తున్న కీలక నేతలు
Guntur News: గుంటూరు జిల్లాలో ఇన్‌ఛార్జ్‌ల మార్పుతో వైఎస్‌ఆర్‌సీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. కీలకమైన నేతు తమ దారి తాము చూసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

గుంటూరు వైఎస్‌ఆర్‌సీపీలో ఇన్‌ఛార్జ్‌ల మార్పు రగడ ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. అప్పటి వరకు ఉన్న వాళ్లను పీకేసి అనూహ్యంగా కొత్తవారి పేర్లు తెరపైకి రావడంతో అసంతృప్తి జ్వాల రగులుతూనే ఉంది. కీలకమైన నేతలు పెద్ద నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు చూసిన తర్వాత వైఎస్‌ఆర్‌సీపీ అధినేత ఆలోచనలు పూర్తిగా మారిపోయినట్టు కనిపిస్తోంది. సిట్టింగ్‌లను దాదాపు మార్చేయాలన్న ప్లాన్‌తో ఉన్నట్టు సమాచారం. అందుకే ముందుగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొదలు పెట్టారు. అక్కడ ఏకంగా 11 మంది ఇన్‌ఛార్జ్‌లను మార్చేశారు. మార్చిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వివరాలు:
ప్రత్తిపాడు - బాలసాని కిరణ్ కుమార్
కొండెపి - ఆదిమూలపు సురేష్
వేమూరు - వరికూటి అశోక్ బాబు
తాడికొండ - మేకతోటి సుచరిత
సంతనూతలపాడు - మేరుగు నాగార్జున
చిలకలూరిపేట - మల్లెల రాజేశ్ నాయుడు
గుంటూరు పశ్చిమ - విడదల రజనీ
అద్దంకి - పాణెం హనిమిరెడ్డి
మంగళగిరి - గంజి చిరంజీవి
రేపల్లె - ఈవూరు గణేష్
గాజువాక - వరికూటి రామచంద్రరావు
ఈ మార్పుతో ఇప్పటికే అక్కడ ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న వాళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు అదే బాటలో మరికొందరు సీనియర్లు ఉన్నట్టు సమాచారం. వారంతా వేర్వేరు పార్టీలతో టచ్‌లోకి వెళ్లాలని తెలుస్తోంది.
వారిలో ముందు వరసలో డొక్కా మాణిక్యవరప్రసాద్ ఉన్నట్టు తెలుస్తోంది. జగన్ తీసుకున్న నిర్ణయంతో విభేదించిన ఆయన తన దారి తాను చూసుకుంటానని అంటున్నారట. ఇప్పటికే తన అనుచరులతో చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తోంది. టీడీపీ నుంచి వెళ్లిన ఆయన మరోసారి సైకిల్ ఎక్కే పరిస్థితి లేదని అంటున్నారు. అదే టైంలో ఆ పార్టీతో పొత్తులో ఉన్న జనసేన వైపునకు చూడాలేని పరిస్థితి ఉందని అంటున్నారు. ఆయనకు ఇప్పుడు ఉన్న ఏకైక ఆప్షన్ బీజేపీ మాత్రమే అంటున్నారు. ఇప్పటికే ముఖ్యనేతలతో ఆయన మంతనాలు జరుపుతున్నారని టాక్ నడుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో కీలక నిర్ణయం ఆయన నుంచి వస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరో కీలక నేత మద్దాలి గిరి కూడా వైసీపీ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయంపై అసహనంతో ఉన్నారు. 2019 ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన మద్దాలి గిరి నెలల వ్యవధిలోనే వైసీపీకి మద్దతు ప్రకటించారు. అప్పటి నుంచి ఆ పార్టీ నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇప్పుడు సడెన్‌గా ఆ నియోజకవర్గం నుంచి విడుదల రజినీకి ఛాన్స్ ఇవ్వడంతో లెక్కలు మారిపోతున్నాయి. కచ్చితంగా తాను పోటీలో ఉంటానంటున్నారాయన. తనకు అన్యాయం జరిగిందని వాపోతున్నారు.
ఈ వారంలో ఒకట్రెండు జిల్లాలకు చెందిన జాబితాను కూడా వైసీపీ రిలీజ్ చేసే అవకాశం ఉంది. అనంతరం ఇంకా ఎన్ని పరిణామాలు చూడాల్సి ఉంటుందో అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో మొదలైంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

