PM Narendra Modi: చీతాలకు కొత్త ఉత్సాహం వచ్చింది, ఈ శ్రమ వృథా కావద్దు - ప్రధాని మోదీ
PM Narendra Modi: చీతాలు భారత్‌కు వచ్చిన సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.
PM Narendra Modi:
అందరికీ అభినందనలు..
నమీబియా నుంచి వచ్చిన 8 చీతాలను కునో నేషనల్ పార్క్‌లోకి వదిలారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. చీతాలు భారత్‌లో అడుగుపెట్టిన సందర్భంగా ఆయన దేశ ప్రజలకు అభినందనలు తెలిపారు. నమీబియా ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. "ఎన్నో దశాబ్దాల తరవాత చీతాలు మన దేశానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా...దేశ ప్రజలకు అభినందనలు తెలుపుతున్నాను. నమీబియా ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఆ దేశం సహకరించకపోయుంటే...ఇది సాధ్యమయ్యేదే కాదు" అని వెల్లడించారు. "దశాబ్దాల క్రితం జీవవైవిధ్యం దెబ్బతింది. దాదాపు చీతాలు అంతరించిపోయిన దుస్థితి వచ్చింది. ప్రస్తుతం మనం ఈ జీవవైవిధ్యానికి పునరుజ్జీవం పోశాం. చీతాలతో పాటు ప్రకృతిని ఎంతగానో ప్రేమించే భారత్ కూడా కొత్త శక్తితో, ఉత్సాహంతో మేలుకుంది" అని ప్రధాని మోదీ అన్నారు. చీతాలు అంతరించిపోయాయని 1952లో భారత్ ప్రకటించటం దురదృష్టకరమని...దశాబ్దాలుగా వాటిని సంరక్షించుకునే కృషి జరగనే లేదని అసహనం వ్యక్తం చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న తరుణంలో కొత్త శక్తితో చీతాలకు పునరావాసం కల్పించామని వెల్లడించారు.
A long wait is over, the Cheetahs have a home in India at the Kuno National Park. pic.twitter.com/8FqZAOi62F
— Narendra Modi (@narendramodi) September 17, 2022
చూసేందుకు ఇంకా సమయం ఉంది..
కునో నేషనల్ పార్క్‌లోని ఈ చీతాలను చూసేందుకు ప్రజలు ఇంకొన్ని నెలల పాటు వేచి చూడాలని అన్నారు ప్రధాని మోదీ. "ఈ చీతాలు మన అతిథుల్లా వచ్చాయి. ఈ ప్రాంతం వాటికి కొత్త. కునో నేషనల్ పార్క్ వాతావరణానికి అవి అలవాటు పడేంత వరకూ మనం నిరీక్షించక తప్పదు" అని స్పష్టం చేశారు. చీతాలను సంరక్షించాలన్న లక్ష్యం నీరుగారిపోకూడదని అభిప్రాయపడ్డారు. "ప్రకృతి, వాతావరణం, పక్షులు, ఇలా ఏది చూసుకున్నా..అవి కేవలం మనం మనుగడ సాగించేందుకు సహకరించటమే కాదు. మనల్ని అవి రక్షిస్తున్నాయి" అని తెలిపారు.
ప్రత్యేక ఎన్‌క్లోజర్లు
నమీబియా నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో వచ్చిన 8 చీతాలను ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా కునో నేషనల్ పార్క్‌లోకి వదిలారు. చీతాలను వదిలాక కెమెరాతో స్వయంగా ఆయనే చీతాలను ఫోటోలు తీశారు. స్పెషల్ ప్లేన్‌లో వచ్చిన చీతాలను ప్రత్యేకంగా తయారు చేసిన క్వారంటైన్ ఎన్‌క్లోజర్స్‌లో ఉంచనున్నారు. రెండు మగ చీతాలను ఈ ఎన్‌క్లోజర్‌లో ఉంచుతారు. ఆడ చీతాని పక్కనే మరో ఎన్‌క్లోజర్‌లో ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు. మొత్తం 8 చీతాల కోసం ఆరు పెద్ద ఎన్‌క్లోజర్‌లు అరేంజ్ చేశారు. "Action Plan for Introduction of Cheetah in India"లో భాగంగా...కేంద్రం ఈ చీతాలను దక్షిణాఫ్రికా నుంచి ఇక్కడికి రప్పించింది. ఇప్పటికే వీటికి వ్యాక్సిన్‌లు వేశారు. వాటికి సాటిలైట్ కాలర్‌లు కూడా అమర్చారు. ఇండియాలో చీతాల గాండ్రింపులు మరోసారి వినపడాలన్న లక్ష్యంతో...ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టింది కేంద్రం. అయితే...ఇదేమంత సులువుగా అయిపోలేదు. దాదాపు 50 ఏళ్ల సంప్రదింపుల తరవాత ఈ కల సాకారమైంది.