PM Cares: కోవిడ్ సమయంలో అనాథల కోసం వచ్చిన పీఎం కేర్స్ దరఖాస్తుల్లో సగానికి పైగా రిజెక్ట్
PM Cares Telugu News: కరోనా వైరస్ ఎంతో మంది ప్రాణాలను బలిగొంది. కోవిడ్ కారణంగా అనాథలైన పిల్లల కోసం పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం కింద వచ్చిన దరఖాస్తుల్లో 51 శాతం తిరస్కరించారు.
PM Cares Scheme Applications Rejected: కరోనా వైరస్ ఎంతో మంది ప్రాణాలను బలిగొంది. పిల్లలకు తల్లిదండ్రులను దూరం చేసింది. ఈ మహమ్మారి వల్ల ఎంతో మంది పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయి అనాథలు అయిపోయారు. వారి భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. ఈ సమయంలో కేంద్రప్రభుత్వం మహమ్మారి వల్ల అనాథలైన పిల్లల్ని ఆదుకోవడం కోసం పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రెన్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. మే 29, 2021న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు.
పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రెన్ స్కీమ్‌ను మహిళల, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. కోవిడ్ మహమ్మారి సమయంలో అనాథ పిల్లల కోసం ప్రారంభించిన పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం కింద వచ్చిన దరఖాస్తుల్లో 51 శాతం తిరస్కరణకు గురయ్యాయి. మార్చి 11, 2020 - మే 5, 2023 మధ్య కోవిడ్ 19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను లేదా పెంపుడు తల్లిదండ్రులను, సంరక్షకులను కోల్పోయిన పిల్లలకు సహాయం చేయాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది.
613 జిల్లాల నుంచి 9,331 దరఖాస్తులు
అధికారిక సమాచారం ప్రకారం.. మొత్తం 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 613 జిల్లాల నుండి మొత్తం 9,331 దరఖాస్తులు ఈ పథకం కింద అందాయి. మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అధికారి అందించిన డేటా ప్రకారం.. 32 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 558 జిల్లాల నుండి 4,532 దరఖాస్తులు మాత్రమే ఆమోదం పొందాయి. వాటిలో 4,781 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. మొత్తం 18 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఇంత పెద్దమొత్తంలో దరఖాస్తులను తిరస్కరించడానికి మంత్రిత్వ శాఖ ఎటువంటి నిర్దిష్ట కారణం ప్రకటించలేదు. వచ్చిన మొత్తం దరఖాస్తులలో రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ల నుంచి వరుసగా 1,553, 1,511, 1,007 అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు నమోదయ్యాయి. ఇందులో మహారాష్ట్ర నుంచి 855, రాజస్థాన్ నుంచి 210, ఉత్తరప్రదేశ్ నుంచి 467 దరఖాస్తులకు ఆమోదం లభించింది.
ఈ పథకం కింద కలిగే సౌకర్యాలు
ఈ పథకం లక్ష్యం ఈ పిల్లలకు నిరంతర సమగ్ర సంరక్షణ,రక్షణ కల్పించడం. అలాగే, వారికి 23 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఆరోగ్య బీమా,విద్యా సాధికారత, ఆర్థిక సహాయం అందించాలి. కోవిడ్‌లో అనాథలైన పిల్లల కోసం సెంట్రల్ సెక్టార్ స్కీమ్‌గా పీఎం కేర్స్ చిల్డ్రన్ కోసం స్కాలర్‌షిప్ అనే కొత్త పథకం కూడా తీసుకొచ్చారు. ఈ పథకం కింద ప్రతి బిడ్డకు స్కాలర్‌షిప్ అలవెన్స్‌గా రూ. 20 వేలు, నెలకు రూ. 1000 నెలవారీ స్టయిఫండ్, పుస్తకాలు, దుస్తులకు, పాఠశాల ఫీజులు లభిస్తాయి. ఇది కాకుండా, ఇతర విద్యా పరికరాల కోసం 8000 రూపాయల వార్షిక స్టయిఫండ్ లభిస్తుంది.
ఈ పథకానికి అర్హులు ఎవరు ?
కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను ఇద్దరిని కోల్పోయిన వారు,
తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని లేదా చట్టబద్ధమైన సంరక్షకులను, దత్తత తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు,
ఈ పథకం ప్రయోజనం పొందాలంటే.. తల్లిదండ్రులు మరణించే నాటికి పిల్లల వయసు 18 ఏళ్లు నిండి ఉండకూడదు.
ఈ పథకం కింద లభించే ప్రయోజనాలు..
* 18 ఏళ్లు నిండినప్పటి నుంచి నెలసరి స్టయిఫండ్, 23 ఏళ్లు నిండిన తర్వాత రూ.10 లక్షల ఫండ్
* కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఉచిత విద్య
* ఉన్నత విద్య కోసం ఎడ్యుకేషన్ లోన్, పీఎం కేర్స్ నుంచి రుణాలకు వడ్డీ చెల్లింపు
* ఆయుష్మాన్ భారత్ కింద ఫ్రీగా రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, ప్రీమియాన్ని కూడా పీఎం కేర్స్ ద్వారా చెల్లింపు
* ఉచిత భోజన, వసతి ప్రయోజనాలు
* ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు పౌష్టికాహారం, పాఠశాల విద్యకు ముందస్తు సాయం, వ్యాధి నిరోధక కార్యక్రమాలకు, ఆరోగ్య రక్షణకు, ఆరోగ్య పరీక్షలకు సంబంధించి అంగన్‌వాడీల ద్వారా సపోర్టు
* సమగ్ర శిక్షా అభియాన్ కింద పాఠ్యపుస్తకాలు, యూనిఫాం
* ప్రైవేట్ పాఠశాలలో చేరే పిల్లలకు విద్యా హక్కు చట్టంలోని 12(1)(సీ) సెక్షన్ కింద వారికి బోధనా రుసుం చెల్లింపుల నుంచి మినహాయింపులు
* ఉన్నత విద్య కోసం దేశంలోని ఉన్నత విద్యా కోర్సులను అందించేందుకు అవసరమైన ఎడ్యుకేషన్ లోన్